
నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
కడప కార్పొరేషన్ : నారాయణ జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేసి, ఆ యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయాలని వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా డిమాండ్ చేశారు. సోమవారం రిమ్స్ ఆసుపత్రిలోని మార్చురీ ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాజా మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలన్నారు. నారాయణ విద్యాసంస్థల ఛెర్మైన్, రాష్ట్ర మంత్రి నారాయణపై హత్య కేసు నమోదు చేయాలని, ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే పరామర్శ
అంతకుముందు మృతిచెందిన విద్యార్థుల తల్లిదండ్రులను కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల యాజమాన్యమే ఆ విద్యార్థులను హత్య చేసిందన్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికే విద్యార్థులపై ప్రేమలేఖలంటూ విద్యార్థులపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వెంట వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌసులాజం, జిల్లా అధికార ప్రతినిధులు టీకే అఫ్జల్‌ఖాన్, జి. రాజేంద్రప్రసాద్‌రెడ్డి, పులి సునీల్‌కుమార్, చల్లా రాజశేఖర్, నాగిరెడ్డి ప్రసాద్‌రెడ్డి, వి. నాగేంద్రారెడ్డి పాల్గొన్నారు.