ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ కాలనీల్లో విద్యుత్ మీటర్లు పెట్టుకోవాలని అధికారులు పేదప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ కాలనీల్లో విద్యుత్ మీటర్లు పెట్టుకోవాలని అధికారులు పేదప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12వ రోజున ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో విద్యుత్ మీటర్లు పెట్టుకోవడానికి ఎస్సీలకు సబ్‌ప్లాన్ కింద డబ్బులు ఇస్తే బాగుంటుందని సూచించారు. ఎస్సీలకు ఇచ్చే ఉచిత విద్యుత్ పరిమితిని 50 యూనిట్ల నుంచి 250 యూనిట్లకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఏపీ ట్రాన్స్ కోలో ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు ఎంత ఉన్నాయో తెలుపాలని టీడీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ ఎఫిషియెన్సీకి ఎంత ఖర్చుపెడుతున్నారని ప్రశ్నించారు. విద్యుత్ ఆదా చేయకుండా విచ్చలవిడిగా వాడుతున్నారని, వ్యవసాయ రంగంలోనూ, ఇతర రంగాల్లోనూ వైర్ల నాణ్యత లేక విద్యుత్ ఎక్కువ ఖర్చవుతోందని ఆయన తెలిపారు. ఆడిట్ రిపోర్టులో ఏం అవకతవకలు వచ్చాయి, వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మరో టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వీధిలైట్లను మార్చి ఎల్‌ఈడీ బల్బులను పెడతామని ప్రభుత్వం చెప్తున్నదని, అయితే అది మున్సిపాలిటీల్లో అది సాధ్యం కావడం లేదని చెప్పారు. ఈ విషయంలో ఎప్పటిలోపల ఎంఓయూ అమలు చేస్తారని ప్రశ్నించారు.