
గవర్నర్‌ను కలిసి వినతిపత్రాన్ని ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ. పక్కన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు
కూటమి ప్రభుత్వ పాలనపై గవర్నర్ జస్టిస్ నజీర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారు
ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని అనడం దారుణం
సమాజంలో వివక్ష పెంచేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
తక్షణం జోక్యం చేసుకోవాలి.. గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందని, తక్షణం జోక్యం చేసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం కోరింది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై గురువారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం రాజ్‌భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
ఇటీవల గంగాధర నెల్లూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు టీడీపీ వారికే చేయాలని, వైఎస్సార్‌సీపీ వారికి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లేనని చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా సమ దృష్టితో పాలన అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు, దానికి విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమాన్ని అందుకునే లబ్ధిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపజేస్తారని, చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరిపట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని బొత్స మండిపడ్డారు.
ఇలా ఏ నాయకుడూ మాట్లాడలేదు..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబులా మాట్లాడలేదని బొత్స తప్పుబట్టారు. ఏ రాజకీయ పార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారని పేర్కొన్నారు. ఏ పార్టీ కూడా వ్యక్తిగత ఎజెండాతో పనిచేయదని, కానీ, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు.
సామాన్యుల అవసరాలపైనా రాజకీయమా?
సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ రంగు పులమడం దారుణమని బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఒత్తిడి తెస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి సర్కారు మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు.
జర్నలిస్టులనూ వదలరా?
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, చివరికి జర్నలిస్టుల పైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు బి.విరూపాక్షి, తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ మంత్రులు విడదల రజిని, వెలంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment