'చంద్రబాబు, లోకేశ్ లంచాలు, కమీషన్ల కోసమే'
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సర్కార్‌ను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గుంటూరులో వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న రైతుదీక్షలో పాల్గొన్న ఆయన ఏపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు ఏ వనరులను వదిలిపెట్టడం లేదని.. లంచాలు, కమీషన్లు వచ్చే పనులే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేస్తున్నరని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలో రైతులందరూ ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నారని, పంటలు అమ్ముకునే పరిస్థితి లేదని తెలిపారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, జిల్లాల్లో టీడీపీ నేతలు అవినీతి చేస్తున్నారని ఆరోపించారు.
'రూ. లక్షన్నర పనికి రూ.5 వేలు కూడా ఖర్చు పెట్టడం లేదు. లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు సీఎం అయ్యారు. అవినీతిలో ఏపీ ఫస్ట్ అని బీబీసీ కూడా చెప్పడమే అందుకు నిదర్శనం. ప్రజలను బాగుపరిచే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుంటున్నారు. ఎక్కడ చూసినా దోచుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర నీటి ప్రయోజనాలను చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కింది. రాష్ట్రానికి నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సీఎం చంద్రబాబు నిర్వాకంతోనే రాష్ట్రానికి నీటి కష్టాలు ఎదురవుతున్నాయని' రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.