రైతులను దగా చేసిన సీఎం
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్‌మోహన్‌రెడ్డి
- ఎన్నికల ముందు హామీలు.. తర్వాత మోసాలు..
- రూ. 5వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏది?
- మద్దతు ధరపై ప్రధానికి ఒక్కలేఖన్నా రాశారా?
- ఎన్‌పీఏలుగా 40 లక్షల రైతుల ఖాతాలు
- ఆయనకు జ్ఞానోదయం కల్గించడానికే ఈ నిరాహారదీక్ష
(గుంటూరు దీక్ష నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) రైతుల ఓట్ల కోసం ఎన్నికలపుడు వారికి పూర్తిగా మోసపూరిత హామీలిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గద్దెనెక్కిన తరువాత వాటిని పూర్తిగా మర్చిపోయారని, ఈ మూడేళ్ల ఆయన పాలనలో రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే... రైతులకు కనీస మద్దతు ధర లభించని సందర్భాల్లో ఆదుకునేందుకు రూ 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని, రైతుల రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని, నిపుణులైన హుడా, స్వామినాథన్ కమిటీల సిఫార్సులను అమలు చేస్తానని వాగ్దానాలు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక అన్నిటినీ తుంగలో తొక్కి రైతులను దగా చేశారన్నారు.
తుపానులు, కరువుతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించకుండా ఎగనామం పెట్టిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలబడేందుకు సోమవారం గుంటూరులోని నల్లపాడు రోడ్డులో రెండు రోజుల నిరాహారదీక్షకు పూనుకున్న సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులు ఎన్నో అవస్థలు పడుతూ కడుపు నిండా బాధతో అలమటిస్తున్నారని, వారి బాధను ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటుగా వారి సమస్యలు పరిష్కరించే విధంగా చంద్రబాబుకు బుద్ధీ, జ్ఞానం కలగాల ని దేవుడిని ప్రార్థిస్తూ తానీ రెండు రోజుల నిరా హారదీక్షకు పూనుకుంటున్నానని జగన్ ప్రకటించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే....
ప్రతిపక్షంలో ఉండగా ఏమన్నారు బాబూ?
‘‘చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఒక మాదిరిగా, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాదిరిగా మాట్లాడతారు. రైతులతో ఓట్లేయించుకోవడానికి వాగ్దానాలు చేసి ఆ తరువాత వాటి ఊసే ఎత్తరు. 2010లో చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద దీక్ష చేసిన సందర్భంగా హుడా కమిటీ సిఫార్సులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఆరోజు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక ఆయనకు హుడా కమిటీ రిపోర్టు, అందులోని అంశాలు కనిపించాయి. ప్రతి రైతుకూ ఎకరాకు కనీసం రూ 10 వేల నుంచి రూ 15 వేలు ఇవ్వాలని ఆ రోజు డిమాండ్ చేస్తూ చంద్రబాబు దీక్ష చేశారు. తీరా అధికారంలోకి వచ్చా క హుడా ఎవరు? ఆ సిఫార్సులేమిటి? నాకు తెలియదే! అని మాట్లాడ్డం చూస్తూ ఉంటే ఈయనా... మన ముఖ్యమంత్రి?! అని ఆశ్చర్యం కలుగుతోంది. ఎన్నికల సమయంలో రైతుల ఓట్లతో పని ఉన్నపుడు వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోతే రూ 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటానన్నారు.
అసలు చంద్రబాబుకు ధరల స్థిరీకరణ నిధి ఎందుకు గుర్తుకు వచ్చిందంటే ... ఎన్నికలపుడు నేను రూ 3,000 కోట్లతో రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని అప్పటికే హామీ ఇచ్చాను. దాంతో బాబుకు వెన్నులో నుంచి భయం పుట్టింది. ‘జగన్ రూ 3,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తానన్నాడా! అయితే నేను రూ 5 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తా’నని చంద్రబాబు ప్రకటించారు. ఇక, ఇవాళ ఎన్నికలైపోయాయి. ప్రజలతో, రైతులతో పని కూడా అయిపోయింది. మూడేళ్లు పూర్తయినా ధరల స్థిరీకరణ నిధి అనే ఊసే చంద్రబాబుకు గుర్తుకు రాదు. అటు ధరలు రాక రాష్ట్రంలో రైతులు అవస్థలు పడుతూ ఉన్నా కనీస మద్దతు ధర ఇంకా పెంచాలి అంటూ కనీసం ఒక్కటంటే ఒక్క లేఖ కూడా ప్రధానమంత్రికి రాసిన పాపాన పోలేదు.
40 లక్షల రైతుల ఖాతాలు నాశనం..
చంద్రబాబు పుణ్యమా అని కోటి 4 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ 40 లక్షల ఖాతాలు ఓవర్ డ్యూ ఖాతాలుగా మారిపోయాయి. అవన్నీ కూడా ‘నాన్ పెర్ఫార్మింగ్ ఎకౌంట్లు’(ఎన్‌పీఏ)గా మారిపోయాయి. ఎన్నికలపుడు రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని బాబు ప్రకటించిన ఫలితంగానే ఇవన్నీ ఇలా తయారయ్యాయి. రైతుల విషయంలో చంద్రబాబు పూర్తిగా చేతులెత్తేశారు. ఆయన పాలనలో కష్టాలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మిర్చి ధర గత ఏడాది క్వింటాలుకు రూ. 13 వేల నుంచి రూ. 14 వేలుంటే ఈ ఏడాది రూ.6 వేల నుంచి రూ 7 వేల వరకే ఉంది.
ఇది అన్యాయమని మేం ప్రశ్నిస్తే బాబు మొసలి కన్నీరు కార్చారు. ఇపుడు రూ. 2,500 నుంచి రూ. 4,000కు పడిపోయింది. సీఎంగా ఉన్న వ్యక్తి స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. మార్కెట్‌లో పోటీని సృష్టించాలి. కానీ బాబు రైతులకు కాకుండా వ్యాపారులకు అండగా నిలిచారు. ఒక్క మిర్చే కాదు.. 2016–17లో రాష్ట్రంలో రైతులు 19 రకాల పంటలు వేశారు. ఒక్కదానికీ ధర లేదు. ఈ దారుణమైన మోసానికి నేను నిరసన తెలుపుతున్నాను. చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని కోరుతూ నేను ఈ నిరాహార దీక్ష చేస్తున్నాను.