జగన్ బాటలో జనం
⇔ రైతుల సమస్యల పరిష్కారానికి నేడు, రేపు జగన్ దీక్ష
⇔ జగన్‌కు మద్దతుగా గుంటూరుకు తరలుతున్న నేతలు
⇔ అదే బాటలో కార్యకర్తలు, అభిమానులు, రైతులు
⇔ చంద్రబాబు సర్కారుపై ఆగ్రహ జ్వాలలు
⇔ రైతు సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వరుస కరువులు..అష్టకష్టాలు పడి పండించిన మిర్చి, పసుపు, కంది పంటలకు గిట్టుబాటు ధరల్లేవు, పెట్టిన పెట్టుబడుల్లో సగం కూడా దక్కే పరిస్థితి లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో జిల్లా రైతాంగం కుదేలైంది. ఇప్పటికే మిర్చి రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఆరుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయినా చంద్రబాబు సర్కారులో చలనం లేదు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ల ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి మిర్చి, కందులు, పసుపు కొని రైతులను ఆదుకునేందుకు ప్రయత్నించడం లేదు.
కేవలం క్వింటాకు రూ.1,500 ముష్టి వేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా... రైతులకు మద్దతుగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మే 1, 2 తేదీల్లో గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టారు. ఇప్పటికే ప్రజాసమస్యలపై పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్న వైఎస్ జగన్ మరోమారు నిద్రపోతున్న బాబు సర్కారు కళ్లు తెరిపించేందుకు ఈ దీక్షను పూనారు.
జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు రైతాంగం జగన్ దీక్షకు మద్దతుగా నిలిచింది. ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకు సోమవారం జిల్లా నుంచి పెద్ద ఎత్తున గుంటూరుకు తరలుతున్నారు. జగన్ దీక్షలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. రైతులకు న్యాయం చేయాలంటూ జగన్‌తో గొంతు కలిపి డిమాండ్ చేయనున్నారు.
రైతాంగం కుదేలు
కరువుతో తగ్గిన పంటల దిగుబడి, అదే సమయంలో గిట్టుబాటు ధర లభించకపోవడంతో జిల్లా రైతాంగం కుదేలైంది. దాదాపు 60 వేల హెక్టార్లలో రైతులు మిర్చి పంటను సాగు చేశారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా పంట చేతికి వచ్చేసరికి క్వింటా మిర్చి ధర రూ.4 వేలకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో మిర్చి కోత ఖర్చు కూడా రైతులకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో జిల్లా రైతాంగం ఆత్మహత్యల బాట పట్టింది.
అయినా ప్రభుత్వం ఆదుకోలేదు. మార్క్‌ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి మిర్చిని కొనుగోలు చేయమని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. క్వింటాకు రూ.1,500 ముష్టి విధించి చేతులు దులుపుకుంది. మరోవైపు 98 వేల హెక్టార్లలో సాగు చేసిన కంది పంటకు గిట్టుబాటు ధర లేక గతేడాది కందులు సైతం రైతుల ఇళ్లలోనే మగ్గుతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
జిల్లాలో దాదాపు 2 వేల హెక్టార్లలో పసుపు పంట సాగు చేశారు. ప్రస్తుతం క్వింటా పసుపు ధర రూ.4 వేలకు పడిపోయింది. కొనే నాధుడే లేకుండా పోయాడు. సుబాబుల్, జామాయిల్, పొగాకు, బొప్పాయిలదీ అదే పరిస్థితి. వాటికీ గిట్టుబాటు ధర లేదు. ఇక తీవ్ర వర్షాభావం పుణ్యమా అని భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు కూడా అందడం లేదు. దీంతో పశ్చిమ ప్రాంతంలో పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయి. చెన్నై, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు పొట్టచేత పట్టుకొని రైతులు తరలిపోతున్నారు.
పశువులను సైతం కొందరు రైతులు నీటి వనరులున్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయినా బాబు సర్కారులో చలనం లేదు. రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ల గోడు పట్టించుకోవడం లేదు. ఇటు మనుషులతో పాటు పశువులకు గుక్కెడు నీరందించే ప్రయత్నం చేయడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి తీవ్రతను దీక్ష ద్వారా తెలియజెప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరోమారు దీక్షకు పూనారు. జగన్ దీక్షకు సర్వత్రా మద్దతు లభిస్తోంది.