ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధరలు లేక అష్టకష్టాలు పడుతున్న రైతులను ఏమాత్రం ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తలపెట్టిన రెండురోజుల రైతుదీక్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలోనే ఆయన దీక్ష ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ధ్యేయంతో ఈ దీక్ష చేపట్టారు.
ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్.. అక్కడినుంచి రోడ్డు మార్గంలో గుంటూరు బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ కార్మిక దినోత్సవంలో పాల్గొని పతాకావిష్కరణ చేసిన తర్వాత దీక్షా స్థలికి చేరుకున్నారు. రాష్ట్రం నలు మూలల నుంచి పలువురు రైతులు, రైతు నాయకులు, వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు, యువతీ యువకులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ జగన్ దీక్షకు తమ మద్దతు పలికారు.