రైతులకు మద్దతుధర కల్పించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతుదీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. గుంటూరు నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు సమీపంలో రెండో రోజు ఉదయం వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించి జగన్ తన దీక్షను కొనసాగించారు. చుట్టుపక్కల మార్కెట్ యార్డులన్నింటికీ సెలవు ప్రకటించినా కూడా రైతులు మాత్రం పెద్ద సంఖ్యలో వచ్చి జగన్ మోహన్ రెడ్డికి తమ సమస్యలు తెలిపారు.
ఇన్నాళ్లు కష్టపడినా సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి ఫలితం లేకుండా పోతోందని.. గత సంవత్సరం ఉన్న స్థాయిలో కూడా ఈసారి ధరలు లేవని వాపోతున్నారు. ఈ ప్రభుత్వం పోతేనే తమ బతుకులు బాగుపడతాయంటూ దీక్షా ప్రాంగణంలో పలువురు రైతులు మండిపడ్డారు. గిట్టుబాటు ధరలు లేక ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని వినుకొండకు చెందిన నాగిరెడ్డి అనే రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేపట్టిన రైతు దీక్షకు ప్రజల నుంచి మద్దతు లేదంటూ టీడీపీ మంత్రులు, ఇతర నాయకులు చేస్తున్న విమర్శలను వైఎస్ఆర్‌సీపీ నాయకుడు మేరుగ నాగార్జున కొట్టిపారేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా జనం వస్తూనే ఉన్నారని, దీక్షా ప్రాంగణం ఇంత కిక్కిరిసిపోయి కనిపిస్తుంటే ప్రజల మద్దతు లేదనడం ఏంటని ఆయన ప్రశ్నించారు.