ఆత్మహత్య చేసుకున్న తనీష్ చౌదరి (ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ: విద్యా వ్యవస్థ రోజురోజుకు విద్యార్థుల పాలిట ఉచ్చులా మారుతోంది. ర్యాంకుల పేరుతో కాలేజీ యాజమాన్యాలు పెంచుతున్న ఒత్తిడికి తాళలేక చాలామంది విద్యార్థులు తనువు చాలిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పేరు మోసిన కార్పోరేట్ కాలేజీల్లో ఈ ఉదంతాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. తాజాగా వేరవేరు సంఘటనల్లో ఇద్దరు ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గుడివాడకు చెందిన తనీష్ చౌదరి నిడమనురు నారాయణ కాలేజిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం ప్రత్యేక క్లాస్‌లకు హాజరైన అనంతరం అర్దరాత్రి హాస్టల్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించిన తోటి విద్యార్ధులు వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే తనీష్ విగతజీవుడయ్యాడు. హుటాహుటిన కాలేజీ హాస్టల్‌కు చేరుకున్న యాజమాన్యం మృతదేహాన్ని గుట్టు చప్పుడుకాకుండా కామినేని ఆస్పత్రికి తరలించారు. తనీష్ ఆత్మహత్యతో తోటి విద్యార్థులు, స్నేహితులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. తెలంగాణలోని వికారాబాద్‌లో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం మెమిన్‌పేట్ మండలం ఇర్లపల్లికి చెందిన విద్యార్థిని కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థిని, కాలేజీ వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సివుంది. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment