68 కాలేజీల మూసివేతకు అనుమతివ్వండి | Intermediate Board Requested High Court To Close 65 Colleges In Telangana | Sakshi
Sakshi News home page

68 కాలేజీల మూసివేతకు అనుమతివ్వండి

Published Fri, Feb 28 2020 2:56 AM | Last Updated on Fri, Feb 28 2020 2:56 AM

Intermediate Board Requested High Court To Close 65 Colleges In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ) లేకుండా నిర్వహిస్తున్న 68 కార్పొరేట్‌ కాలేజీలను మూసేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. వాటిలో నారాయణ కాలేజీలు 26, శ్రీచైతన్య కాలేజీలు 18 ఉన్నాయని తెలిపింది. ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ వెలువడిన దృష్ట్యా మూసివేత నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇప్పటికే 68 కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పింది. ఇంటర్‌ పరీక్షలు అయ్యాక ఈ ఏడాది మార్చి 28 తర్వాత 68 కాలేజీల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరింది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ అఫిడవిట్‌ ద్వారా హైకోర్టుకు నివేదించారు. అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్‌కు చెందిన డి.రాజేశ్‌ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఇంటర్‌ పరీక్షలు అవ్వగానే మార్చి 28 తర్వాత ఎన్‌ఓసీలు లేకుండా నడుపుతున్న కాలేజీలను మూసివేయాల్సిందేనని ఇంటర్మీడియట్‌ బోర్డు తేల్చి చెప్పింది. ఈ హామీని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 7కి వాయిదా వేసింది. నారాయణ, శ్రీచైతన్య ఇతర విద్యా సంస్థలు ఎన్‌ఓసీ లేకుండా ఎన్ని కాలేజీలను నిర్వహిస్తున్నాయో, ఎన్ని కాలేజీలను అధికారులు తనిఖీలు చేశారో, ఆయా కాలేజీల్లో పరిస్థితులెలా ఉన్నాయో పూర్తి వివరాలతో ఏప్రిల్‌ 3లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఇంటర్‌ బోర్డును ఆదేశించింది. షోకాజ్‌ నోటీసుల జారీ అనేది కంటితుడుపు చర్యే అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది.

కాలేజీలకు నోటీసులు ఇచ్చాం..: ఇంటర్‌ బోర్డు తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ స్పందిస్తూ.. షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకోడానికి వీలుకాదన్నారు. ఆ 68 కాలేజీలు తాత్కాలిక ఎన్‌వోసీలతో నడుపుతున్నాయని, ఇకపై అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ ఇచ్చే అవకాశాలు కూడా లేవని చెప్పారు. షోకాజ్‌ నోటీసుకు స్పందించి వివరణ ఇస్తున్నాయని తెలిపారు. ఈ 68 కాలేజీల్లో 29,808 మంది విద్యార్థులున్నారని చెప్పారు. వీరందరి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం (2020–21) నుంచి ఆ కాలేజీలకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు.

ప్రభుత్వమే అన్నీ చేయలేక..: ప్రభుత్వ కాలేజీల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు లేనందున ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇవ్వాల్సి వచ్చిందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ హైకోర్టుకు నివేదించారు. గతంలో హైకోర్టు ఆదేశించిన మేరకు ఆయన అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఎన్‌వోసీ లేని కాలేజీల్లోని విద్యార్థులు వారు చదివే కాలేజీలకు బదులుగా మరో కాలేజీలో పరీక్షలు రాస్తారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం పూర్తి అవ్వగానే మార్చి 28 తర్వాత నుంచే ఎన్‌ఓసీలు లేని 68 కాలేజీలను మూసేస్తామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement