సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. స్థానిక కోటా కింద స్థానికులంతా అర్హులేనని సీజే ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఇదే సమయంలో స్థానికులు ఎవరు అనే అంశంపై సరైన మార్గదర్శకాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికులు ఎవరనే విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం రూపొందించిన మార్గ నిర్దేశకాల ప్రకారం కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు సూచించింది.
కాగా, ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ప్రవేశాల్లో స్థానికత జీవోకు సంబంధించి నేడు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇక, జీవోలో భాగంగా నీట్ ప్రవేశ పరీక్ష రాసే సమయానికి విద్యార్థి వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం తీర్పును వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment