ఏ పార్టీ తరపున ప్రచారం చేశారో చెప్పండి
హైదరాబాద్ కలెక్టర్‌పై హైకోర్టు అసహనం
సాక్షి, హైదరాబాద్: ఓ సివిల్ కేసులో అప్పీల్ దాఖలు చేయడంలో ప్రభుత్వ ఆలస్యానికి కారణం ఎన్నికలని చెప్పడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అధికారులు ఏమన్నా రాజకీయ నాయకులా..కలెక్టర్ ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు..గెలిచారా? లేదా? అని ప్రశ్నించింది. ఎన్నికలు వచ్చినా అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదు కదా.. అప్పీల్ దాఖలుకు ఎన్నికలు ఎందుకు అడ్డంకి అవుతాయంటూ తప్పబట్టింది. కలెక్టర్ ఏ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని నిలదీసింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని ఓ స్థలం ఏపీ ప్రభుత్వానిదని 2014లో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఫజలుల్లాల్ హక్‌తో పాటు మరో 9 మంది 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి..ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులకే చెందుతుందని ఉత్తర్వులు జారీ చేశారు. 1968 నుంచి ప్రభుత్వం ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని పాఠశాల నిర్వహిస్తున్నందున ఖాళీ చేయాలని చెప్పలేమన్నారు. భూ సేకరణ చట్టం కింద ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని, ఒకవేళ ప్రక్రియ చేపట్టకుంటే స్థాలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు స్వా«దీనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 2016లో తీర్పు వెలువరించారు. సింగిల్ జడ్జి తీర్పుపై హైదరాబాద్ కలెక్టర్ 2024, జూలైలో అప్పీల్ దాఖలు చేశారు. ఎన్నికల కారణంగా అప్పీల్‌లో ఆలస్యం జరిగిందంటూ మధ్యంతర అప్లికేషన్‌లో విజ్ఞప్తి చేశారు.
ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫునన స్పెషల్ జీపీ ఎ.దివ్య వాదనలు వినిపిస్తూ..ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా అప్పీల్‌లో ఆలస్యం జరిగిందని, విచారణకు స్వీకరించాలని కోరారు. అప్పీల్ దాఖలుకు ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎలా కారణంగా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, ఎన్నికల కోడ్ కారణంగా అధికారులు ఇతర పలు కార్యక్రమాల్లో బిజీ ఉన్నారని జీపీ సమాధానమిచ్చారు.
దీనికి ధర్మాసనం మరింత అసహనం వ్యక్తం చేస్తూ.. మీ స్పందన ఇలానే ఉంటే ఇంకా ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయాల్సి వస్తుందని, అప్పీల్‌ను తిరస్కరించాల్సి వస్తుందని హెచ్చరించింది. సరైన కారణాలతో అప్పీల్ దాఖలు చేస్తామని న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment