Civil case
-
ఆరోపణలపై పోరాడేందుకు న్యాయ సంస్థల నియామకం
అదానీ గ్రూప్ ఇటీవల అమెరికాలో తనపై వచ్చిన ఆరోపణలను న్యాయబద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈమేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC), ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ దాఖలు చేసిన సివిల్, క్రిమినల్ కేసులను నిర్వహించడానికి కిర్క్లాండ్ & ఎల్లిస్, క్విన్ ఇమ్మాన్యుయేల్ ఉర్కహర్ట్ & సుల్లివాన్ ఎల్ఎల్పీ అనే న్యాయ సంస్థలను అదానీ గ్రూప్ నియమించింది.అసలేం జరిగిందంటే..అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దాంతో అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఏజీఈఎల్‌లో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి యూఎస్‌లోని ఎస్ఈసీ, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ప్రాథమిక దర్యాప్తు జరిపి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టింది. వాటిని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ తాజాగా రెండు సంస్థలను నియమించింది. ఇవి కంపెనీపై వచ్చిన ఆరోపణలపై న్యాయబద్ధంగా అక్కడి కోర్టుల్లో సమాధానం చెప్పనున్నాయి.కేసు నేపథ్యంసోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుంచి కాంట్రాక్టులు పొందడానికి ఏజీఈఎల్‌కు అనైతికంగా సాయపడటానికి భారత అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ, ఇతర ఎగ్జిక్యూటివ్‌లపై 2024 నవంబర్ 21న అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఎస్ జైన్‌లపై యూఎస్ ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఏఫ్సీపీఏ) ఉల్లంఘనలకు సంబంధించి అభియోగాలు మోపలేదని ఎజీఈఎల్ నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: ఇళ్ల నిర్మాణ వ్యయంలో భారీ కోత..?న్యాయ సంస్థల గురించిషికాగోలో ప్రధాన కార్యాలయం ఉన్న కిర్క్టాండ్ & ఎల్లిస్ అధికంగా వాణిజ్య వివాదాలు, మేధో సంపత్తి వ్యాజ్యాలు, వైట్-కాలర్ కేసుల్లో ప్రత్యేకత కలిగి ఉంది. ఇప్పటికే జాన్సన్ & జాన్సన్, వోక్స్ వ్యాగన్ వంటి ప్రధాన సంస్థలకు ఈ సంస్థ సేవలందించింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన క్విన్ ఇమ్మాన్యుయేల్ సెక్యూరిటీస్ లిటిగేషన్, ప్రొడక్ట్ లయబిలిటీ, రెగ్యులేటరీ ఇన్వెస్టిగేషన్ల్లో ప్రసిద్ది చెందింది. ఈ కంపెనీకి గూగుల్, యాపిల్, ఉబెర్ వంటి క్లయింట్లు ఉన్నారు. -
కలెక్టర్..ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు?
సాక్షి, హైదరాబాద్: ఓ సివిల్ కేసులో అప్పీల్ దాఖలు చేయడంలో ప్రభుత్వ ఆలస్యానికి కారణం ఎన్నికలని చెప్పడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అధికారులు ఏమన్నా రాజకీయ నాయకులా..కలెక్టర్ ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు..గెలిచారా? లేదా? అని ప్రశ్నించింది. ఎన్నికలు వచ్చినా అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదు కదా.. అప్పీల్ దాఖలుకు ఎన్నికలు ఎందుకు అడ్డంకి అవుతాయంటూ తప్పబట్టింది. కలెక్టర్ ఏ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని నిలదీసింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని ఓ స్థలం ఏపీ ప్రభుత్వానిదని 2014లో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఫజలుల్లాల్ హక్‌తో పాటు మరో 9 మంది 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి..ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులకే చెందుతుందని ఉత్తర్వులు జారీ చేశారు. 1968 నుంచి ప్రభుత్వం ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని పాఠశాల నిర్వహిస్తున్నందున ఖాళీ చేయాలని చెప్పలేమన్నారు. భూ సేకరణ చట్టం కింద ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని, ఒకవేళ ప్రక్రియ చేపట్టకుంటే స్థాలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు స్వా«దీనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 2016లో తీర్పు వెలువరించారు. సింగిల్ జడ్జి తీర్పుపై హైదరాబాద్ కలెక్టర్ 2024, జూలైలో అప్పీల్ దాఖలు చేశారు. ఎన్నికల కారణంగా అప్పీల్లో ఆలస్యం జరిగిందంటూ మధ్యంతర అప్లికేషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫునన స్పెషల్ జీపీ ఎ.దివ్య వాదనలు వినిపిస్తూ..ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా అప్పీల్లో ఆలస్యం జరిగిందని, విచారణకు స్వీకరించాలని కోరారు. అప్పీల్ దాఖలుకు ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎలా కారణంగా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, ఎన్నికల కోడ్ కారణంగా అధికారులు ఇతర పలు కార్యక్రమాల్లో బిజీ ఉన్నారని జీపీ సమాధానమిచ్చారు. దీనికి ధర్మాసనం మరింత అసహనం వ్యక్తం చేస్తూ.. మీ స్పందన ఇలానే ఉంటే ఇంకా ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయాల్సి వస్తుందని, అప్పీల్‌ను తిరస్కరించాల్సి వస్తుందని హెచ్చరించింది. సరైన కారణాలతో అప్పీల్ దాఖలు చేస్తామని న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం వాయిదా వేసింది. -
భూ హక్కులకు భరోసా
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూ యాజమాన్య హక్కులకు పూర్తి భరోసా లభించనుంది. భూ యజమానులకే కాకుండా కొనుగోలుదారులకు సైతం భూమి హక్కులపై భద్రత ఏర్పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భూములకు సంబంధించిన సమస్యలు, మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో వాటికి ఆస్కారం లేకుండా చేయడమే లక్ష్యంగా తెచ్చిన ఈ చట్టం భూముల వ్యవస్థ స్వరూపాన్ని మారుస్తుందని విశ్లేషిస్తున్నారు. బ్రిటీష్ కాలంలో తయారైన భూ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, ఆధునికీకరించకపోవడంతో పలు సమస్యలు తలెత్తాయి. రికార్డుల తారుమారు, నకిలీల కారణంగా భూ యజమానులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సివిల్ వివాదాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో పరిష్కరించడం కష్టసాధ్యంగా మారింది. వీటివల్ల శాంతి భద్రతల సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా వీటిని గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ల్యాండ్ టైట్లింగ్ బిల్లును తేవడంతోపాటు భూముల రీ సర్వేను ప్రారంభించారు. ప్రస్తుతం భూముల రీ సర్వే విజయవంతంగా కొనసాగుతుండగా ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఇటీవలే కేంద్రం ఆమోదం తెలపడంతో వెంటనే అమల్లోకి తెచ్చారు. హైకోర్టులో ఎప్పుడైనా అప్పీల్‌కు అవకాశం ఈ చట్టం వల్ల భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. రీ సర్వే ద్వారా భూముల డిజిటల్ రికార్డులను ఇప్పటికే పక్కాగా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. స్థిరాస్తుల శాశ్వత రిజిష్టర్ రూపకల్పనతో ఆ ఆస్తిని యజమాని మినహా మరెవరూ విక్రయించేందుకు అవకాశం ఉండదు. దాని ప్రకారమే రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యుటేషన్ జరగడంతో వివాదాలకు ఆస్కారం ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో ఆటో మ్యుటేషన్ అమల్లోకి వచ్చింది. హక్కుల రిజిస్టర్లో నమోదైన పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు కొత్తగా ఏర్పడే జిల్లా, రాష్ట్ర స్థాయి ట్రిబ్యునళ్లలో అప్పీల్‌కు అవకాశం ఉంటుంది. అభ్యంతరాలు లేకపోతే రెండేళ్ల తర్వాత ఆ భూములకు శాశ్వత హక్కుదారులుగా గుర్తించి శాశ్వత రిజిస్టర్లో నమోదు చేస్తారు. రెండేళ్ల తర్వాత ట్రిబ్యునళ్లలో అవకాశం లేకపోయినా హైకోర్టులో మాత్రం ఎప్పుడైనా అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టులో సివిల్ వివాదాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనివల్ల వివాదాలు త్వరితగతిన పరిష్కారం కానున్నాయి. కింది కోర్టులపై తగ్గనున్న భారం కొత్త చట్టం ద్వారా ఇప్పటి మాదిరిగా కింది స్థాయి సివిల్, రెవెన్యూ కోర్టులకు భూ వివాదాలను పరిష్కరించే అధికారం ఉండదు. ఆయా కోర్టుల్లో వేలాది సివిల్ కేసులు పెండింగ్‌లో ఉండడం విపరీతమైన భారం పడుతున్న విషయం తెలిసిందే. కింది స్థాయి సివిల్ కోర్టుల్లో భూ వివాదాల పరిష్కారానికి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. సంవత్సరాలు గడిచినా కొన్ని కేసులు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఎక్కడైనా ఒక భూమికి సంబంధించిన వివాదం తలెత్తితే ఆర్డీవో, జేసీ కోర్టుల్లో వెంటనే పరిష్కారం కావడంలేదు. ఆ వివాదం సివిల్ కోర్టుకు వెళితే తేలేందుకు ఎన్ని ఏళ్లు పడుతుందో తెలియని పరిస్థితి. రెండు మూడు తరాలు గడిచినా ఇవి తేలకపోవడంతో న్యాయస్థానాలపై కేసుల భారం పెరుగుతోంది. -
అవినీతి పాపం పండింది
నాలుగేళ్లుగా అక్కడే తిష్ట వేశాడు. ప్రతి వ్యవహారంలో తలదూర్చి ప్రైవేట్ పంచాయితీలు నెరుపుతున్నాడు. కేసులొస్తే.. కాసులు పుచ్చుకుని రాజీ చేసి పంపుతున్నాడు. రెండేళ్లుగా అవినీతి ఆరోపణలు వచ్చినా తన పలుకుబడి ఉపయోగించి సీటును పదిలం చేసుకున్నాడు. వెయ్యి గొడ్లను తిన్న రాబంధు.. ఒక్క గాలివానకు కూలినట్లు.. ఓ సివిల్ పంచాయితీతో అవినీతి పోలీస్ అధికారి పాపం పండింది. అక్షరాల రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయాడు. సూళ్లూరుపేట/వరదయ్యపాళెం: ప్రపంచ స్థాయి పరిశ్రమలకు కేంద్రం శ్రీసిటీ పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన హైటెక్ పోలీస్‌స్టేషన్ అవినీతికి కేరాఫ్‌గా మారింది. కాసులు ఇస్తే.. కేసులు మాఫీ అయిపోతున్నాయి. ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా రాజీ మార్గంతో కేసులు సరిపుచ్చుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ఇక్కడ పని చేసిన వారికి కాసుల పంట. ఇసుక,గ్రావెల్ తరలించడానికి ఇక్కడ భారీగా ముడుపులు అందుతున్నట్టు సమాచారం. టీడీపీ ప్రభుత్వంలో జిల్లా నుంచి ఇసుక, గ్రావెల్ తమిళనాడుకు భారీగా అక్రమ రవాణా జరిగేది. ఈ అక్రమ రవాణాకు ఒక్కో టిప్పర్ లారీకి నెలవారీ మామూళ్లు పెద్ద ఎత్తున అందుతున్నట్లు సమాచారం. పరిశ్రమల్లో తలెత్తే వివాదాల్లోనూ భారీగా ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ సివిల్ పంచాయితీలో తలదూర్చి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఎస్సై సుబ్బారెడ్డి తీరు సంచలనం సృష్టించింది. సివిల్ పంచాయితీలో తల దూర్చి సూళ్లూరుపేట పట్టణంలో స్థిరపడిన ఎస్సై బీ సుబ్బారెడ్డి చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం శ్రీసిటీ సెజ్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఓ సివిల్ కేసులో ప్రత్యర్థిని వేధించి రూ.లక్ష లంచం తీసుకుంటూ తిరుపతి ఏసీబీ ఆధికారులకు చిక్కాడు. అవినీతికి బాగా అలవాటు పడిపోయిన ఎస్సై పాపం ఎప్పుడు పండుతుందా అని స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో బుధవారం ఏసీబీ అధికారులు పథకం ప్రకారం ట్రాప్ చేసి పట్టుకోవడంతో సర్వత్రా ఆనందం వెల్లివిరిసింది. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం చిలమత్తూరు గ్రామానికి చెందిన కే మస్తాన్‌నాయుడు సూళ్లూరుపేట పట్టణంలోని షార్ బస్టాండ్ సెంటర్లో మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి మత్తేరిమిట్ట, చిలమత్తూరు వద్ద కొంత పొలాలు ఉన్నాయి. అయితే మత్తేరిమిట్ట గ్రామానికి చెందిన శేషప్రియ అనే మహిళ తన భూములను అదే గ్రామానికి చెందిన వారు ఆక్రమించుకున్నారని, ఐదారు మందిపై నవంబర్ 3వ తేదీన శ్రీసిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో మస్తాన్‌నాయుడు పేరు కూడా ఉంది. అయితే ఈ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని, బాధితురాలు శేషప్రియ ఇచ్చిన సర్వే నంబర్లకు తన భూములకు చెందిన సర్వే నంబర్లకు ఎలాంటి సంబంధం లేదని ఎస్సై సుబ్బారెడ్డికి అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను కూడా అందజేశాడు. సుమారు నెలల పాటు మిన్నకుండిపోయిన ఎస్సై ఈ నెల 3న మస్తాన్‌నాయుడుకు ఫోన్ చేసి నీపై కేసు ఉంది అరెస్ట్ చేయాలని బెదిరిస్తూ వచ్చాడు. 10వ తేదీన ఏకంగా సూళ్లూరుపేటలోని మెడికల్ షాపు వద్దకొచ్చి స్టేషన్‌కు వచ్చి మాట్లాడమని చెప్పి వెళ్లిపోయాడు. మస్తాన్ నాయుడు అదే రోజు శ్రీసిటీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా బేరం మాట్లాడారు. నీ అరెస్ట్ ఆపేసి కేసులో లేకుండా చేస్తాను రూ.5 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేయడం, చివరకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బుధవారం సూళ్లూరుపేటలో డబ్బులు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో బా«ధితుడు తిరుపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శ్రీసిటీ ఎస్సై సుబ్బారెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉండడంతో తిరుపతి ఇన్చార్జి ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌డీ శాంతో రూ.లక్ష (రూ.2వేలు నోట్లు) ఇచ్చి ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. బాధితుడు మస్తాన్‌నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సైను సస్పెండ్ చేసేందుకు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో తిరుపతి ఏసీబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాలుగేళ్లుగా శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్లోనే.. అవినీతి నిరోధకశాఖకు అడ్డంగా దొరికిన ఎస్సై సుబ్బారెడ్డి నాలుగేళ్ల క్రితం శ్రీసిటీ హైటెక్ పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఔట్‌పోస్టుగా ఉండి హైటెక్ పోలీస్‌స్టేషన్‌గా స్థాయి పెరిగిన నాటి నుంచి మొదటి ఎస్సైగా సుబ్బారెడ్డి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రెండేళ్లుగా ఆయనపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయనకున్న పలుకుబడితో నాలుగేళ్లుగా ఒకే పోలీస్‌స్టేషన్‌లో కొనసాగాడు. ఆయన ధాటికి ఇక్కడ ఎస్సైలుగా వచ్చిన మరో ముగ్గురు కూడా అనధికారంగానే బదిలీ కావడం విశేషం. -
బంధించి..హింసించారు..
సాక్షి, సిటీబ్యూరో: పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నా వారిలో మార్పు రావడం లేదు. అయితే పరిధుల పేరుతో పంచాయితీలు పెట్టుకోవడం, లేదా ఫిర్యాదుల విషయంలో తాత్సారం ప్రదర్శించడంతో పాటు సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. మంచిరేవులలోని ఓ స్థలానికి సంబంధించి ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరి«ధిలోని సరూర్‌నగర్ పోలీసులు జోక్యం చేసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) అధికారుల సాయంతో ఓ వ్యాపారిని నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్భంధించడంతో పాటు శారీకరంగా, మానసికంగా హింసించారు. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు లాక్కోవడమేగాక తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని అక్రమంగా కేసు నమోదు చేసి తనను అరెస్టు చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు అతను మంగళవారం రాష్ట్ర మానవహక్కుల సంఘంతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే..ఉప్పల్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. నార్సింగి పరిధిలోని మంచిరేవులలో 930 చదరపు గజాల స్థలాన్ని అభివృద్ధి చేయడానికి పోచంపల్లి మండలం, శివారెడ్డిగూడేనికి చెందిన మంజులా దేవితో 2016లో ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకుగాను తొలుత రూ.5 లక్షలు, ఆ తర్వాత ఏడాది మరో రూ.40 లక్షలు చెల్లించాడు. 2018 ఫిబ్రవరిలో ఆమె అదే స్థలాన్ని వరంగల్‌కు చెందిన మోహన్‌రావుకు అప్పగిస్తూ మరో ఒప్పందం చేసుకుంది. ఆ విషయం చంద్రశేఖర్‌రెడ్డికి తెలియకుండా అదే ఏడాది డిసెంబర్లో డాక్యుమెంట్ రిజిస్టర్ చేశారు. ఈ విషయం తెలియడంతో చంద్రశేఖర్‌రెడ్డి గత ఫిబ్రవరి నుంచి ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న ఆమె బాధితుడిని బెదిరించేందుకుగాను ఆగస్టులో బెంగళూరులోని సంజయ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జూన్ 15న చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరు వచ్చి ఆమెను వేధించడమే కాకుండా బెదిరించాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. పూర్వాపరాలు పరిశీలించని సంజయ్‌నగర్ పోలీసులు సెప్టెంబర్ 3న కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధితుడు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు. దీంతో ఆమె సరూర్‌నగర్ పోలీసుల సాయంతో రంగంలోకి దిగా రు. గత అక్టోబర్ 18న చంద్రశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉంచుకుని శారీరకంగా, మానసికంగా వేధించారు. ఆపై బాధితుడిని సరూర్‌నగర్ పోలీసులకు అప్పజెప్పారు. వారు బాధితుడి నుంచి బలవంతంగా మంచిరేవుల స్థలానికి సంబంధించి ఒప్పందం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడమేగాక తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు. సదరు మహిళ సరస్వతీనగర్ కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఆమెను వేధించాడని, బెంగళూరులో ఇల్లు నిర్మించి ఇస్తానంటూ మోసం చేశాడనే ఆరోపణలపై నమోదు చేసిన పోలీసులు అక్టోబర్ 23న అతడిని అరెస్టు చేశారు. బెంగళూరులో, ఇక్కడా ఒకే మహిళ, ఒకే ఆరోపణలపై ఫిర్యాదు చేశారని బాధితుడు ఆ«ధారాలు చూపినా పట్టించుకోలేదు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, సంతకంతో కూడిన పేపర్లను ఆమెకు అప్పగించారు. మంచిరేవుల స్థలంపై ఆశలు వదులుకోవాలంటూ బెదిరించి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటికి వచ్చిన బాధితుడు పోలీసుల బెదిరింపులకు భయపడిన కొన్నాళ్లు మిన్నకుండిపోయాడు. ఎట్టకేలకు మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల సంఘంతో పాటు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అతను న్యాయం చేయాలని కోరాడు. -
ఏఎస్ఐ వీరంగం
నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ జిల్లా నవీపేట పోలీసుస్టేషన్ ఏఎస్ఐ జాన్సన్ మంగళవారం వీరంగం సృష్టించాడు. ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టాడు. వివరాలు.. నిజామాబాద్ రూరల్ మండలం పాల్దా గ్రామానికి చెందిన కిరణ్‌రావు ఆయన బంధువు మధుసూదన్‌రావు మధ్య పంట పొలానికి సంబంధించి కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పంట పొలాల సరిహద్దులో కిరణ్‌రావు బోరు వేశారని మధుసూదన్ నవీపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంగళవారం కిరణ్‌రావును పోలీసుస్టేషన్‌కు పిలిపించాడు. ఏఎస్ఐ జాన్సన్ స్టేషన్లో విచక్షణారహితంగా బెల్ట్‌తో చితకబాదాడని, కాలుతో తన్నాడని బాధితుడు ఆరోపించారు. అకారణంగా దుర్భాషలాడారని వాపోయాడు. ఫిర్యాదు చేసిన వారి ఎదురుగానే తనను లాకప్‌లో వేసి చితకబాదాడని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఏసీపీ శ్రీనివాస్‌రావును కలసి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఏఎస్ఐ జాన్సన్‌ను వివరణ కోరగా.. తాను కొట్టలేదని, కిరణ్‌రావు చెప్పిన మాటలు అవాస్తవమని పేర్కొన్నారు. -
అయోధ్య కేసు విచారణకు తొలగిన అడ్డంకులు
-
1994 తీర్పుపై పునఃసమీక్షకు నో
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం కేసు విషయంలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. 1994 నాటి ఇస్మాయిల్ ఫారుఖీ కేసును విస్తృత ధర్మాసనానికి ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం 2:1 మెజారిటీతో గురువారం ఈ తీర్పు చెప్పింది. ఇస్లాం ప్రకారం ప్రార్థనలు చేసేందుకు మసీదు తప్పనిసరి కాదు అని 1994 నాటి తీర్పుపై పునఃవిచారణ జరగదని స్పష్టం చేసింది. ధర్మాసనంలోని సీజేఐ, జస్టిస్ అశోక్ భూషణ్‌లు ఇందుకు మద్దతుగా తీర్పునివ్వగా మరో న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ విభేదించారు. పునఃసమీక్ష జరగాల్సిందేనన్నారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో.. అత్యంత సున్నితమైన అయోధ్య కేసు విచారణ వేగవంతం అవడానికి మార్గం సుగమమైంది. అక్టోబర్ 29 నుంచి ఈ కేసులో రోజువారీ విచారణ జరగనుంది. తీర్పుతో బీజేపీ, ఆరెస్సెస్ హర్షం వ్యక్తం చేశాయి. అయోధ్య కేసులోనూ త్వరలో తీర్పు వెలువడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. కోర్టు తీర్పును ఆమోదించాల్సిందేనని పేర్కొంది. ఇది భూసేకరణ వివాదమే 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ ఎం సిద్దిఖీ సుప్రీంను ఆశ్రయించారు. భూ వివాదంలో హైకోర్టు తీర్పును సుప్రీం నిర్ణయం ప్రభావితం చేసిందన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ప్రార్థనల కోసం మసీదు ముఖ్యమైన ప్రదేశమేమీ కాదనడంపై పునఃసమీక్ష చేయాలని కోరారు. అయోధ్య కేసులోని ప్రధాన కక్షిదారుల్లో ఒకరైన సిద్దిఖీ చనిపోయినా ఆయన వారసులు ఈ కేసును సుప్రీంకోర్టుకు నివేదించారు. దీన్ని 2:1తో ధర్మాసనం తిరస్కరించింది. ‘ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో లెవనెత్తిన అంశాలన్నీ భూ సేకరణకు సంబంధించినవేనని పునరుద్ఘాటిస్తున్నాం. అయోధ్య కేసులో విచారణకు సంబంధించి ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రభావమేమీ ఉండదు’ అని జస్టిస్ అశోక్ భూషణ్ తమ (సీజేఐతో కలుపుకుని) నిర్ణయాన్ని వెలువరించారు. అయోధ్యలో నెలకొన్న సివిల్ భూ వివాదాన్ని కొత్తగా ఏర్పాటుచేయబోయే ముగ్గురు సభ్యుల బెంచ్ అక్టోబర్ 29 నుంచి విచారిస్తుందన్నారు. అక్టోబర్ 2న ప్రస్తుత సీజేఐ మిశ్రా రిటైర్‌కానున్నారు. 2010లో అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద రామజన్మభూమి–బాబ్రీ మసీదు స్థలాన్ని మూడు భాగాలుగా విడగొడుతూ తీర్పు నివ్వడాన్ని సవాల్ చేయడంపైనా కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి.. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మొహి అఖాడా, రామ్ లల్లాలకు పంచాలని ఆదేశించింది. ప్రభుత్వం అన్ని మతాలను సమదృష్టితో చూడాలని సూచించింది. కాగా దేశానికి మేలు చేసేందుకు అయోధ్య విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. స్వాగతించిన ఆరెస్సెస్ విస్తృత ధర్మాసనానికి అయోధ్య కేసును బదిలీ చేయబోమంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్వాగతించింది. ఈ వివాదంతో వీలైనంత త్వరగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘అక్టోబర్ 29 నుంచి ముగ్గురు సభ్యుల ధర్మాసనం శ్రీరామజన్మభూమి కేసును విచారిస్తామని గురువారం సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసం వచ్చింది’ అని ఓ ప్రకటనలో ఆరెస్సెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని మరింతకాలం కొనసాగించాలని చూస్తోందని.. అందుకే త్వరగా నిర్ణయం వెలువడకుండా (2019 ఎన్నికల తర్వాత ఈ వివాదంపై తీర్పు వెలువరించాలన్న కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ) కుట్ర పన్నిందని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ ఆరోపించారు. పాకిస్తాన్ ఏజెంట్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఇకపై వీరి ప్రయత్నాలేవీ సఫలం కాబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తీర్పుకు కట్టుబడే: కాంగ్రెస్ గురువారం నాటి కోర్టు తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో అయోధ్య అసలు వివాదంపై విచారణను వేగవంతం చేసేందుకు మార్గం సుగమమైందని పేర్కొంది. ఇన్నాళ్లూ రామమందిరం పేరుతో బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తూ వస్తోందని.. కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది విమర్శించారు. రామమందిర వివాదాన్ని పరిష్కరించడంలో బీజేపీ పాత్ర లేశమాత్రమైనా లేదన్నారు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ చెబుతోందని.. ఆచరణలోనూ కట్టుబడి ఉంటామని ఆమె పేర్కొన్నారు. అసలు విచారణ ఇకపైనే.. రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని.. అది తమకు అనుకూలంగానే ఉందని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న ముస్లింలు పేర్కొన్నారు. ‘ఇస్లాంలో మసీదు అంతర్గత భాగం కాదనే విషయాన్ని 1994లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మాకు సంబంధం లేదు. ఇప్పుడు కేసు పూర్తిగా రామజన్మభూమి–బాబ్రీ మసీదు మధ్య స్థల వివాదంపైనే ఉందని సుప్రీం స్పష్టం చేసింది. ఇది సంతోషదాయకం’ అని మౌలానా మహ్ఫుజూర్ రహమాన్ తరపున నామినీగా ఉన్న ఖాలిక్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ‘ఇకపై అయోధ్య–బాబ్రీ కేసు విచారణ మత విశ్వాసాలపై కాకుండా భూ యాజమాన్య హక్కుదారు, యోగ్యత ఆధారంగానే కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొనడం హర్షదాయకం. రెవెన్యూ రికార్డుల ఆధారంగా బాబ్రీ స్థల వివాదంలో మా వాదనలు వినిపిస్తాం. ఏ మందిరాన్నీ ధ్వంసం చేయకుండానే బాబ్రీ మసీదును నిర్మించారనేది మా విశ్వాసం’ అని సున్నీ వక్ఫ్ బోర్డు తరపున కక్షిదారుగా ఉన్న ఇక్బాల్ అన్సారీ తెలిపారు. మిగిలిన కక్షిదారులు కూడా కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అయోధ్య–బాబ్రీ వివాదమేంటి? భారత్‌లో ఐదు దశాబ్దాలుగా హిందు–ముస్లింల మధ్య ఘర్షణకు అయోధ్య–బాబ్రీ మసీదు వివాదం కారణమవుతోంది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు జన్మించిన పవిత్రస్థలంలో మందిర నిర్మాణం జరగాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. 2.77 ఎకరాల స్థలంలో భవ్యంగా మందిర నిర్మాణం జరగాలని కోరుతున్నారు. అయితే బాబర్ మసీదు నిర్మించిన ఈ స్థలం తమకే చెల్లుతుందని రామమందిర నిర్మాణం జరపడానికి వీల్లేదని ముస్లింలు వాదిస్తున్నారు. రామజన్మభూమిలో ఆయన విగ్రహాలు పెట్టి.. అక్కడ పూజలకు అనుమతించాలంటూ 1950లో గోపాల్ సిమ్లా, పరమహంస రామచంద్రదాస్‌లు ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. దీనికితోడు 1992, డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదులోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడంతో దేశవ్యాప్తంగా ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లోనూ మసీదు కింద రామమందిరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో రామమందిర నిర్మాణానికి హిందూ సంఘాలు, వద్దే వద్దంటూ ముస్లింలు పోటాపోటీగా కోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై అక్టోబర్ 29 నుంచి సుప్రీంకోర్టు రోజూవారి విచారణ చేపట్టనుంది. ‘మసీదు’పై పునఃసమీక్ష: జస్టిస్ నజీర్ ‘అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఆయా వర్గాలకు చాలా ముఖ్యమైనవి’ అని జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మసీదు అంత ముఖ్యమైన ప్రదేశం కాదని, ముస్లింలు ఎక్కడైనా నమాజ్ చేసుకోవచ్చన్న 1994నాటి ఇస్మాయిల్ ఫారుఖీ కేసుపై పునఃసమీక్ష జరగాలని తన 42 పేజీల తీర్పులో ఆయన చెప్పారు. సమగ్రమైన విచారణ జరపకుండా నాడు తీర్పుచెప్పారన్నారు. రాజ్యాంగ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ‘మసీదు’ వ్యాఖ్యలపై విస్తృత ధర్మాసనంతో పునఃసమీక్ష జరపాలన్నారు. తన తీర్పులో 4 ప్రశ్నలు సంధించారు. ‘1954 షిరూర్ మఠ్ కేసులో మత విశ్వాసాలను పరీక్షించకుండానే తీర్పు వెలువరించారా? ఆవశ్యకమైన మత విశ్వాసాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు జరగాలా? ఆర్టికల్ 25కింద ఒక మతానికి సంబంధించిన విశ్వాసాలనే కాపాడాలా? అన్ని మతాలకూ వర్తిస్తుందా? ఆర్టికల్ 15, 25, 26 ప్రకారం అన్ని విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందా?’ అని ప్రశ్నించారు. బహుభార్యత్వం, నిఖాహలాలా, మహిళా జననాంగాల విచ్ఛిత్తి కేసుల్లో తీర్పులను గుర్తుచేశారు. అయోధ్య స్థల వివాద క్రమమిదీ.. ► 1528: బాబర్ సైన్యాధ్యక్షుడు మిర్ బాకీ బాబ్రీ మసీదును నిర్మించాడు. ► 1885: ఈ స్థలంలో రాముడికి చిన్న పైకప్పు కట్టుకునేందుకు అనుమతివ్వాలని మహంత్ రఘువీర్ దాస్ ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీన్ని తిరస్కరించింది. ► 1949: వివాదాస్పద స్థలంలో రామ్ లల్లా విగ్రహాల స్థాపన ► 1959: విగ్రహాలకు పూజ చేసేందుకు అనుమతించాలంటూ నిర్మోహి అఖాడా పిటిషన్ ► 1981: ఈ స్థలాన్ని తమకు అప్పగించాలంటూ యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు కేసు ► 1986, ఫిబ్రవరి 1: హిందూ భక్తులకు ప్రవేశాన్ని అనుమతిస్తూ స్థానిక కోర్టు తీర్పు ► 1992, డిసెంబర్ 6: బాబ్రీ మసీదు నిర్మాణం పాక్షికంగా ధ్వంసం ► 1994, అక్టోబర్ 24: ఇస్మాయిల్ ఫారుఖీ కేసు విచారణ సందర్భంగా ఇస్లాంలో మసీదు అంతర్భాగం కాదన్న సుప్రీంకోర్టు ► 2003, మార్చి 13: వివాదాస్పద స్థలంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరపొద్దని సుప్రీం ఆదేశం, అలహాబాద్ హైకోర్టుకు కేసు బదిలీ. ► 2010, సెప్టెంబర్ 30: నిర్మోహీ అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డులకు వివాదాస్పద భూమిని పంచుతూ హైకోర్టు ఆదేశం. ► 2016, ఫిబ్రవరి 26: రామమందిర నిర్మాణానికి అనుమతించాలంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ ► 2017, మార్చి 21: కక్షిదారులంతా కోర్టు బయట చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని నాటి సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహార్ సూచన ► నవంబర్ 20: అయోధ్యలో మందిరం, లక్నోలో భారీ మసీదు నిర్మాణానికి అంగీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించిన షియా వక్ఫ్ బోర్డు. ► 2018, సెప్టెంబర్ 27: ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు విముఖత. అక్టోబర్ 29 నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు వెల్లడి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో ప్రధాన కక్షిదారులు ఇక్బాల్ అన్సారీ, నిర్మోహి అఖాడా మహంత్ ధరమ్ దాస్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ -
సెటిల్మెంట్ ఖాకీ !
జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి సెటిల్మెంట్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రౌడీగ్యాంగ్‌లను ప్రోత్సహిస్తూ యథేచ్ఛగా సివిల్ పంచాయితీలు చేస్తున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా వస్తున్నాయి. జిల్లాకు చెందిన కీలక నేత, రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారి అండదండలతోనే ఆయన చెలరేగిపోతున్నారని పలువురు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయినా వెళ్లకుండా తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ తెచ్చుకున్నారంటే ఆ అధికారి ఏ స్థాయి వ్యవహారపరుడో అర్థం చేసుకోవచ్చు. సాక్షి, అమరావతిబ్యూరో : జిల్లాలోని రెండు నియోజకవర్గాలను ఓ పోలీసు అధికారి హడలెత్తిస్తున్నారు. రాజకీయ అండతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నిత్యం సెటిల్మెంట్లు..ఇసుకదందాలు..అక్రమ కేసులు..రౌడీ గ్యాంగ్‌లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. బదిలీ అయిన రెండేళ్లకే మళ్లీ అక్కడికే పోస్టింగు తెచ్చుకునేంత లాబీయింగ్ నడపగల స్థాయి ఆ అధికారిది. జిల్లా ఉన్నతాధికారినే ఆయన ఖాతరు చేయడం లేదు. ఓ పోలీసు అధికారికి ఓ స్థానం ఒకసారి పనిచేసిన తరువాత మళ్లీ ఆదే హోదాతో అక్కడ సహజంగా పోస్టింగు ఇవ్వరు. కానీ ఈ మధ్యస్థాయి ఉన్నతాధికారి ఆ నిబంధనకు అతీతుడు. ఆయనకు జిల్లా కీలక నేత అండదండలున్నాయి. పోలీసు అధికారి అండ.... అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లూ, చెవులుగా పనిచేసే రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారి దన్ను పుష్కలంగా ఉంది. అందుకే ఆయన ఒకే హోదాతో ఒకే స్థానంలో నాలుగేళ్లలో రెండుసార్లు పోస్టింగు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన జిల్లాలో కీలకమైన పోస్టింగు దక్కించుకున్నారు. ఆయన పరిధిలోకి రెండు నియోజకవర్గాలు వస్తాయి. అందులో ఒకటి జిల్లా కీలక నేత సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. ఆ స్థానంలో దాదాపు రెండేళ్లు ఆయన యథేచ్చగా చెలరేగిపోయారు. అనంతరం హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఏడాదిన్నరలోనే జిల్లాలోని తన పాత స్థానానికే ఆయనకు పోస్టింగు తెప్పించుకోవడం పోలీసువర్గాలనే విస్మయపరిచింది. అంతగా రాజకీయ అండ ఉన్న ఆయనకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఆయన యవ్వారాలకు సంబంధించిన కొన్ని ఉదంతాలు ఇవిగో.. ♦ ఆయన పనిచేసే కేంద్రంలోఓ వ్యాపారి కుటుంబ వివాదంలో ఈ అధికారి సెటిల్మెంట్ దందాకు తెరతీశారు. పెట్రోల్ బంకు, క్వారీలు, భూములు ఇలా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులపై బాబాయి, అబ్బాయిల మధ్య ఆస్తి వివాదం చెలరేగింది. అబ్బాయికి అనుకూలంగా కేసును సెటిల్ చేసేందుకు ఆ పోలీసు అధికారి డీల్ కుదుర్చుకున్నారు. ఆ సివిల్ కేసును కాస్తా క్రిమినల్ కేసుగా మలచారు. బాబాయిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తాను చెప్పినట్లు సెటిల్ చేసుకోవాలని వేధించారు. బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించారు. ఆ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించినట్లు నిగ్గుతేలిందని సమాచారం. కానీ ఆ అధికారి రాజకీయ పరపతికి తలొగ్గి ఉన్నతాధికారులు చర్య తీసుకోనేలేదు. ♦ ఆ పోలీసు అధికారి సెటిల్మెంట్ల కోసం ఏకంగా ఓ గ్యాంగ్‌నే ఏర్పాటు చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఆయన రెండోసారి ఆ స్థానంలో పోస్టింగ్ తెచ్చుకున్న తరువాత పలువురిపై రౌడీషీట్లు తొలగించారు. వారు ఓ ముఠాగా తయారై సెటిల్మెంట్లు చేస్తూ హల్చల్ చేస్తుండటం గమనార్హం. ఆ పోలీసు అధికారి అండతోనే ఇదంతా సాగుతోందన్నది నియోజకవర్గంలో బహిరంగ రహస్యంగా మారింది. ♦ ఈ అధికారి గతంలో తెలంగాణలో పని చేశారు. అప్పట్లో పోలీసుల అండతో నయిం గ్యాంగ్ చేసిన దందాలపై ఆయనకు అవగాహన ఉంది. అదే రీతిలో జిల్లాలో గ్యాంగ్ సంస్కృతికి ఈయన తెరతీశారు. హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధించిన ఓ రౌడీని కూడా ఇక్కడకు రప్పించారు. ♦ ఓ మహిళను మాయమాటలతో మోసం చేసి ఆమెకు చెందిన భూమిని రాయించుకోవడంతోపాటు దాదాపు రూ.కోటి వరకు నగదు తీసుకున్నారని సమాచారం. మోసపోయానని గ్రహించిన ఆమె తన భూమి, నగదు వెనక్కి ఇవ్వమని ఎంతగా అడిగినా ససేమిరా అన్నారు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ♦ జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఇసుక అక్రమరవాణాకు ఆయన అండదండలున్నాయి. ఆయన పరిధిలోని నియోజకవర్గాల నుంచే రోజుకు వందలసంఖ్యలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తన మాట వినడం లేదని ఓ సర్కిల్ స్థాయి అధికారిపై ఆయన ఈయన బహిరంగంగానే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటారు. ఈ విషయంలో ఆయన్ని కట్టడి చేయడం జిల్లా ఉన్నతాధికారితరం కూడా కావడం లేదు. -
సివిల్ కేసులో ఒంటిమిట్ట సీఐ జోక్యం!
వైస్సార్, రాజంపేట: నందలూరు మండల పరిధిలోని గొల్లపల్లె రహదారిలో ఉన్న గొబ్బిళ్ల మెమోరియల్ హైస్కూల్ ఆస్తి వ్యవహారంలో ఒంటిమిట్ట సీఐ రవికుమార్ వ్యవహరించిన తీరుపై స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు గొబ్బిళ్ల భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ గొబ్బిళ్ల హైస్కూ ల్ ఆస్తి నా పేరుతో రిజిష్టరు అయిందన్నారు. అయితే దానిని కబ్జా చేయడానికి కోడూరు సుజాత కుట్ర పన్ని పోలీసులకు తప్పుడు సమచారం ఇచ్చిందన్నారు. దానికి అధికారపార్టీ నాయకుల వత్తిడి మేరకు ఒంటిమిట్ట సీఐ రవికుమార్ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. రాత్రి పది గంటల సమయంలో సీఐ తన సిబ్బందితో ఆవరణంలోకి ప్రవేశించి, గేటు ఓపెన్ చేయాలని విచారణ నిమిత్తం వచ్చానని చెప్పినట్లు తెలిపారు. దౌర్జన్యంగా తమ పట్ల సీఐ వ్యవహరించారన్నారు. అర్ధాంతరంగా రాత్రి సమయంలో సీఐ సివిల్ వ్యవహారంలో తలదూర్చి విచారణ చేయడం తగదన్నారు. ఈనెల 2వతేదీ కోడూరు సుజాత, ఇద్దరి పిల్లలపై నందలూరు పోలీసుస్టేషన్ తాను ఫిర్యాదు చేయగా, నాన్‌బెయిల్‌బుల్ కింద కేసు నమోదైందని పేర్కొన్నారు. అయితే ఇంతవరకు ఆ కేసుపై ఎటువంటి విచారణ కానీ, అరెస్టు కానీ చేయలేదని ఆరోపించారు. కేసులో ఉన్న వారు పోలీసుస్టేషన్లో సీఐ ఎదుట కూర్చొని మాట్లాడుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ఆమె ప్రశ్నించారు. పోలీసుల దౌర్జన్యం తమ పట్ల ఇలాగే కొనసాగితే తనతోపాటు నా కుటుంబసభ్యులు అందరం కలిసి పోలీసుస్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామన్నారు. పోలీసులు అక్రమంగా తమ ఆస్తిలోపలికి ప్రవేశిస్తే తమకు ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. తప్పుడు సమాచారం జిల్లా ఎస్పీకి చేరవేస్తున్నారని ఆరోపించారు. తాను జోక్యం చేసుకోలేదు ఈ విషయంపై సీఐ వివరణ కోరగా తాను సివిల్ కేసులో జోక్యం చేసుకోలేదని తెలిపారు. అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు. -
ఒప్పందానికి తలొగ్గలేదని..కేసులు.. రౌడీషీట్లు
సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు..కానీ ఏకంగా సివిల్ తాగాదాలే సృష్టించడం..కేసులు పెట్టించడం..ఆనక చర్చల పేరుతో బెదిరింపులకు,ఒత్తిళ్లకు పాల్పడటం.. వినకపోతే రౌడీషీట్లుతెరవడం.. జైలు పాల్జేయడం..ఇదీ ఆ పోలీసు అధికారి స్టైల్.. ఇటువంటి దందాలతో కోట్లు దండుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య..ఆ అధికారి మరెవరో కాదు.. రాష్ట్రవ్యాప్తంగాసంచలనం సృష్టించిన రౌడీషీటర్ గేదెలరాజుహత్య కేసులో ఏ1 నిందితుడిగా జైలుపాలైనఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబు!..మధురవాడ, గాజువాకల్లో ఏసీపీగా పని చేస్తున్నసమయంలో ఆయన చేసిన సెటిల్మెంట్లు, దందాలు.. ఆయన అరెస్టు అనంతరం వెలుగులోకి వస్తున్నాయి.మధురవాడ పరిధి రేవళ్లపాలేనికి చెందినపిళ్లా కుటుంబీకులను ఓ సివిల్ వివాదంలోరౌడీషీట్లతో వేధింపులకు గురిచేసిన రవిబాబు దురాగతం వెలుగులోకి వచ్చింది. వారసత్వహక్కుగా వారికి సంక్రమించిన రూ.4.5 కోట్ల విలువైన భూమిని ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి అప్పగించేందుకు ఒప్పందం చేసుకొని పిళ్లా కుటుంబీకులపై ఆయన పోలీస్ పవర్ ప్రయోగించారు. సాక్షి, విశాఖపట్నం: మధురవాడ శివారు రేవళ్లపాలెం గ్రామానికి చెందిన పిళ్లా అప్పారావుకు అదే గ్రామ పరిధిలో జాతీయ రహదారికి కూతవేటు దూరంలోని సర్వే నెం.211/1,2లలో 23.5 సెంట్ల భూమి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ విలువ గజం రూ.40 వేలు పలుకుతోంది. ఈ లెక్కన ఆ భూమి విలువ నాలుగున్నర కోట్ల పైమాటే. అప్పారావు తదనంతరం ఆ భూమి ఆయన సంతానమైన ఈశ్వరరావు, హిమాలయ, కనకరాజు, శ్రీనివాసరావు, రమేష్, భారతిలకు వారసత్వ హక్కుగా సంక్రమిచింది. వీరిలో శ్రీనివాసరావు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో అతని భార్య వెంకటలక్ష్మికు హక్కు లభించింది. అప్పారావు భూమిని ఆనుకొని నాగోతి అప్పలసూరి అనే వ్యక్తికి 24 సెంట్ల భూమి ఉండేది. దాన్ని ఎప్పుడో ఆయన వేరొకరికి అమ్మేశాడు. అయితే అదే గ్రామానికి అతని వారసుడిగా చెప్పుకొంటున్న నాగోతి లక్ష్మణరావు అనే వ్యక్తి విజయవాడకు చెందిన నాగోతి మొగ్గయ్య సత్యనారాయణ, చలపతిరావు, తొత్తడి కనకలక్ష్మిలతో కలిసి ఈ భూమిని దస్తావేజు నెం.5053/2007తో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీగా రిజిస్ట్రీ చేయించుకున్నట్టు రికార్డులు సృష్టించారు. పనిలో పనిగా అదే సర్వే నెంబరులో ఉన్న పిళ్లా కుటుంబీకుల భూమిని కాజేయాలనుకున్నారు. ఆ భూమి వారసుల్లో ఒకడైన పిళ్లా రమేష్‌ను లోబర్చుకొని తప్పుడు దృవపత్రాలతో మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు నెం.609/2009తో జనరల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ పత్రాల ఆధారంతో ఆ భూమిని హైదరాబాద్‌కు చెందిన ఎస్పి సాప్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన సాగిరెడ్డి పుల్లారెడ్డి పేరిట అమ్మేసి దస్తావేజు నెం.716/2011గా రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. పిళ్లా కుటుంబీకుల అభ్యంతరం : ఆ భూమిని సొంతం చేసుకున్న సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు.. వెంటనే రంగంలోకి దిగారు. భూమిలో ఉన్న షెడ్లను తొలగించి చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. అప్పుటికి గానీ పిళ్లా వారసులకు విషయం తెలియలేదు. తమ ప్రమేయం లేకుండా తమ సోదరుడు రమేష్ ఉమ్మడి ఆస్తిని అమ్మేసినట్లు గుర్తించారు. తమ భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆస్తిని ఎలా కొనుగోలు చేస్తారని నిలయదీయడంతో వీరితో ఇబ్బంది తప్పదని గుర్తించిన సాప్ట్వేర్ కంపెనీ యజమాని ఆ భూమిని తనకు అమ్మిన వ్యక్తులను ఆశ్రయించారు. పిళ్లా వారసులతో కూడా హక్కు విడుదల పత్రాలపై సంతకాలు చేయించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పట్లో మధురవాడ ఏసీపీగా పని చేస్తున్న దాసరి రవిబాబుకు ఈ వివాదం గురించి తెలిసింది. రవిబాబు రంగప్రవేశం : వెంటనే రంగంలోకి దిగిన రవిబాబు వివాదాన్ని సెటిల్ చేస్తానని సాప్ట్వేర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి పీఎంపాలెం సీఐ అప్పలరాజు, ఎస్సై దివాకర్లపై ఒత్తిడి తెచ్చి.. పిళ్లా వారసులపై వేధింపులు ప్రారంభించాడు. అంతేకాకుండా ఏసీపీ తరఫున దళారులుగా వ్యవహరించిన పట్నాయక్, శ్రీనులు కూడా రెచ్చిపోయారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏజెంట్లలో ఒకరైన కాటుపల్లి అప్పారావుతో పీఎంపాలెంలో తప్పుడు ఫిర్యాదు చేయించి కేసులు బనాయించారు. పిళ్లా వారసులైన ఈశ్వరరావు, హిమాలయ, కనకరాజుల ఇళ్లకు చీటికిమాటికి వెళ్లి బెదిరించడం.. స్టేషన్‌కు పిలిపించి చితకబాదడం చేసేవారు. అయినా సరే సంతకాలు పెట్టేందుకు వారు అంగీకరించలేదు. లొంగకపోవడంతో కొత్త స్కెచ్ : వారసులు లొంగకపోవడం.. సాప్ట్వేర్ కంపెనీ నుంచి ఒత్తిడి పెరగడంతో రవిబాబు మరో స్కెచ్ వేశాడు. నాగోతి లక్ష్మణరావు చేయించుకున్న మొదటి రిజిస్ట్రేషన్ (దస్తావేజు. 5053 / 2007)ను 2015 ఏప్రిల్ 9న రద్దు చేయించి, మళ్లీ అదే వ్యక్తులతో విశాఖకు చెందిన కొల్లి కృష్ణచౌదరికి దస్తావేజు నెం.2487/ 2015తో జనరల్ పవర్ రిజిస్ట్రీ చేయించాడు. ఆయన ద్వారా సాప్ట్వేర్ కంపెనీకి కట్టబెట్టాలన్నది ఆయన ప్లాన్. ఈ దస్తావేజులో కనీసం సాక్షులుగానైనా సంతకాలు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. చివరికి భర్తలేని పిళ్లా వెంకటలక్ష్మిపై మూడు కేసులు బనాయించి జైలు పాల్జేశారు. పోతిన భారతిపై రెండు, పిళ్లా హిమాలయపై మూడు కేసులు నమోదు చేశారు. అయినా వారు బెదరలేదు. తన మాట చెల్లలేదన్న అక్కసుతో హిమాలయ, కనకరాజులపై రవిబాబు ఏకంగా రౌడీషీట్ తెరిచాడు. బదిలీ అయినా ఆగని వేధింపులు : రవిబాబు బదిలీ అయిన తర్వాత కూడా వీరిపై వేధింపులు ఆగలేదు. తన అనుచరులైన పట్నాయక్, శ్రీనుల ద్వారా రవిబాబు వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రహరీ నిర్మించిన సాప్ట్వేర్ కంపెనీ కానీ, ఆ తర్వాత రవిబాబు ప్రోద్భలంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న కొల్లి కృష్ణచౌదరి గానీ ఏనాడు ఈ స్థలంలో అడుగు పెట్టలేదు. కానీ పట్నాయక్ మాత్రం ఈ స్థలంలోకి చొరబడి ఏకంగా తన పేరిట విద్యుత్ మీటర్ కూడా వేయించేసేకున్నాడు. స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేకపోయినా మామూళ్లు ముట్టజెప్పి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ క నెక్షన్ వేయించుకున్నాడు. ఎప్పటికైనా ఈ స్థలం తమదేనన్న భావనతో తరచూ వీర్ని వేధింపులకు గురిచేస్తూనే ఉన్నాడు. హత్య కేసులో రవి బాబు అరెస్ట్ కావడంతో ఇప్పటికైనా తమకు విముక్తి క ల్పించాలని, తమ భూమి తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించాం హక్కు విడుదల పత్రాలపై సంతకాలు పెట్టలేదన్న అక్కసుతో నాపైన, నా సోదరుడిపైన రౌడీషీట్ తెరిచారు. చిత్రహింసలకు గురి చేశారు. ఎన్నోసార్లు రవిబాబే నేరుగా మమ్మల్ని పిలిపించి వార్నింగ్‌లు ఇచ్చేవారు. సంతకాలు చేయకపోతే అంతు చూస్తానని బెదిరించేవారు. దాంతో ఏసీపీ, సీఐ, ఎస్సైలపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు కూడా చేశాం.– పిళ్లా హిమాలయ నిద్రలేని రాత్రులెన్నో గడిపాం కోట్ల విలువైన మా స్థలాన్ని కొట్టేయాలని రవిబాబు యత్నించాడు. సాప్ట్వేర్ కంపెనీ నుంచి రూ.కోటి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు తెలిసింది. ఎలాగైనా కాజేసి సాప్ట్వేర్ కంపెనీకి కాకపోతే మరో కంపెనీకి అమ్మేయాలని ప్రయత్నించాడు. ఆ ఒత్తిళ్లతో నిద్రలేని రాత్రులెన్నో గడిపాం. నిత్యం మానసిక క్షోభకు గురవుతున్నాం. – పిళ్లా కనకరాజు -
రాజీతో ఇరువర్గాలకు విజయం
సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి శ్రీసుధ సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల్లో రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే ఇరువర్గాలు విజయం సాధించినట్లేనని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి శ్రీసుధ అన్నారు. ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వై.వీర్రాజులతో కలసి శనివారం ఆమె విలేకరుల తో మాట్లాడారు. కుటుంబ వివాదాలు, సివిల్ కేసులతోపాటు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, చిట్‌ఫండ్, ప్రమాద బీమా, రుణాల రికవరీ కోసం బ్యాంకులు వేసిన దాదాపు 2 వేల కేసుల్లో ఇరువర్గాలను ఒప్పించడం ద్వారా సమస్యలు పరిష్కరిం చనున్నామని తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష 26కు వాయిదా 19న జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు మెయిన్స్ పరీక్ష ఉండటంతో సిటీ సివిల్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం జరగనున్న రాత పరీక్ష 26కి వాయిదా పడిందని శ్రీసుధ తెలిపారు. -
సివిల్ కేసులను సత్వరమే పరిష్కరించాలి
నల్లగొండ రూరల్: జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో వున్న సివిల్ వివాదాల పరిష్కారానికి న్యాయమూర్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి బి.శివశంకర్‌రావు అన్నారు. శనివారం నల్లగొండలోని కోర్టు భవనాల సముదాయంలో సివిల్ చట్టాలపై జరిగిన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు కృషి చేయాలన్నారు. కక్షిదారుకు ధనం, సమయం వృథా కాకుండా, సకాలంలో న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందన్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో వున్న కేసుల వివరాలను పరిశీలించి, పెండింగ్ కేసులను పరిష్కరించాలన్నారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సీతాపతి మాట్లాడుతూ సివిల్ వివాదాల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలను, వాటి అధిగమించే పద్ధతులను వివరించారు. అంతకుముందు ఆయనకు జిల్లా జడ్జి డాక్టర్ జి.రాధారాణి, కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, న్యాయమూర్తులు ఐ.శైలజాదేవి, ఊట్కూరు సత్యనారాయణ, ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్‌లు స్వాగతం పలికారు. అదే విధంగా స్థానిక ఆర్అండ్బి అతిథి గృహంలో నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కల్లూరి యాదయ్య, కొండ శ్రీనివాస్, అసోసియేషన్ ప్రతినిధులు నూకల నర్సింహరెడ్డి, ఎం.లెనిన్‌బాబు, నిమ్మల భీమార్జున్‌రెడ్డి, ఎస్పి. ప్రవీణ్‌కుమార్, కె.అనంతరెడ్డి, ఎం.ప్రమీలు, కోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మారెడ్డి, అజహారుద్దీన్, నరేందర్, నర్సింహారెడ్డి, రవికుమార్, జంగయ్య, శ్రీనివాస్ స్వాగతం పలికారు. -
సోనియాపై కేసు కోర్టు బయటే పరిష్కారం
తిరువనంతపురం: కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై నమోదైన సివిల్ కేసును కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) కోర్టు బయటే పరిష్కరించుకుంది. రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్(ఆర్‌జీఐడీఎస్) నిర్మాణానికి సంబంధించిన రూ. 2.80 కోట్లను చెల్లించలేదని ఓ నిర్మాణ సంస్థపై కేసు పెట్టడం తెలిసిందే. సివిల్ కేసును కోర్టు బయట సెటిల్ చేసుకున్నామని, ఈ విషయాన్ని ఇరు పక్షాలు కోర్టుకు తెలియజేశాయని ఆర్‌జీఐడీఎస్ డెరైక్టర్, కేసీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి హిదుర్ ముహమద్ తెలిపారు. సోనియాను ఇందులోకి లాగడం ద్వారా స్వార్థ ప్రయోజనాల కోసం కుట్ర జరిగిందని ఆరోపించారు. ఆర్‌జీఐడీఎస్.. సొసైటీ చట్టం ప్రకారం రిజిస్టరైన సొసైటీ అని, సోనియా ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగా గానీ సభ్యులు కాదని పేర్కొన్నారు. సోనియాకు ఆర్జీఐడీఎస్కు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. -
సోనియాపై సివిల్ కేసు
తిరువనంతపురం: కేరళలో హీదర్ అనే నిర్మాణ కంపెనీ తమ బకాయిలను చెల్లించనందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మరికొంతమందిపై సివిల్ కేసు దాఖలుచేసింది. నెయ్యర్‌లో తాము నిర్మించిన రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ కాంప్లెక్స్‌కు రూ.2.8 కోట్లు బకాయిలు చెల్లించలేదని పేర్కొంది. పిటిషనర్ తరఫు న్యాయవాది బాబూరాజ్ స్థానిక కోర్టులో ఇటీవల ఈ సివిల్ దావా దాఖలుచేశారు. కేపీసీసీ అధ్యక్షుడు వీఎం సుధీరన్, మాజీ సీఎం ఊమెన్ చాందీ, విపక్ష నేత రమేశ్ చెన్నితల, ఇన్స్టిట్యూట్ డెరైక్టర్ హిదుర్ ముహమ్మద్‌లను కూడా ఈ దావాలో చేర్చినట్లు బాబూరాజ్ చెప్పారు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
విజయనగరం క్రైం: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తాను. ముందుగా జిల్లాలో పరిస్థితులపై అవగాహన ఏర్పర్చుకునేందుకు కృషి చేస్తాను. భూదందాలు, సివిల్ తగాదాల్లో సంబంధమున్న పోలీసులపై, పోలీసు స్టేషన్ల వారీగా అక్రమ వసూలు చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోడానికి వెనుకాడను. సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుంటే ఉపేక్షించం సివిల్ తగాదాల్లో పోలీసు అధికారులు జోక్యం చేసుకుంటున్నారని, ఎక్కువగా భూదందాలు జరుగుతున్నాయని, ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని వస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎస్.కోట, భోగాపురం, కొత్తవలసప్రాంతాల్లోనే కాదు జిల్లా లో ఎక్కడైనా పోలీసులు, ఉద్యోగవిరమణచేసిన అధికారులు భూ వ్యవహారాల్లో, సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకుంటే బాధితులు, ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు, వెంటనే తగిన చర్యలు తీసుకుంటాను. అలాగే స్టేషన్ మామూళ్లని, ఇతర చందాలని పోలీసులెవరైనా చేయి చాపితే సహించేదిలేదు. భూముల విషయాల్లో ప్రజలను మోసగించడం వంటివి క్రైమ్ కిందకు వస్తాయి. అటువంటి విషయాల్లో మాత్రం పోలీసులు జోక్యం చేసుకుంటారు. త్వరలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అసాంఘిక శక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాను. దొంగతనాలు, పేకాట, వ్యభిచారం తదితర కార్యకలాపాల నివారణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాను. ప్రత్యేక గస్తీలు, దాడులు నిర్వహించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. వీటిని అరికట్టేం దుకు త్వరలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తాను. నెల్లూరులో పనిచేసిన కాలంలో తానీ వ్యవస్థను ఏర్పాటు చేశాను. మంచి ఫలితాలొచ్చాయి. అలాగే అనుమతి లేని దుకాణాలు, దాబాల్లో మద్యం అమ్మినా ఊరుకోం, మద్యం తాగి వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందువల్ల దాబాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. చిట్స్ విషయంలో జరభద్రం అనధికార చిట్స్, గుర్తింపులేని బ్యాంకులు, బోగస్ ఫై నాన్స్ సంస్థల విషయంలో ప్రజలు అప్రమత్తంగా వ్య వహరించాలి. సంస్థల పూర్తి వివరాలను తెలుసుకుని, రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థల్లో మాత్రమే సభ్యులుగా చేరాలి. బోగస్ ఫైనాన్స్ సంస్థల విషయాల్లో పోలీసులు జోక్యం ఉంటే ఏమాత్రం సహించం. అవగాహన ఏర్పర్చుకున్న తరువాతే... జిల్లా పరిస్థితులపై ముందుగా అవగాహన పెంచుకుని, తరువాత నా ఆలోచనలు అమలు చేస్తాను. నేరాల నిరోధంతో పాటు ట్రాఫిక్ పై కూడా దృష్టి సారిస్తాను. ప్రస్తుతం జిల్లాలో ట్రాఫిక్ ఎలా ఉందో పరిశీలించి, ఆమేరకు చర్యలు తీసుకుంటాను. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం పోలీసుల విధి. సిగ్నల్స్ తదితర ఇంజినీరింగ్ పనులను మున్సిపల్ అధికారులు చూడాలి. మున్సిపల్ అధికారుల సహకారంతో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. అతివేగం వల్లే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని నిరోధించేందుకు ప్రత్యేకంగా దృష్టిసారిస్తాను. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇతరత్రా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రతిరోజూ ఫిర్యాదుల స్వీకరణ ఇకపై నుంచి ఒక్క సోమవారమే కాదు ప్రతిరోజూ ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తాం. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించి ప్రజల మన్ననలు పొందుతాం. అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం.