జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి సెటిల్‌మెంట్‌లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రౌడీగ్యాంగ్‌లను ప్రోత్సహిస్తూ యథేచ్ఛగా సివిల్ పంచాయితీలు చేస్తున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా వస్తున్నాయి. జిల్లాకు చెందిన కీలక నేత, రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారి అండదండలతోనే ఆయన చెలరేగిపోతున్నారని పలువురు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయినా వెళ్లకుండా తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ తెచ్చుకున్నారంటే ఆ అధికారి ఏ స్థాయి వ్యవహారపరుడో అర్థం చేసుకోవచ్చు.
సాక్షి, అమరావతిబ్యూరో : జిల్లాలోని రెండు నియోజకవర్గాలను ఓ పోలీసు అధికారి హడలెత్తిస్తున్నారు. రాజకీయ అండతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నిత్యం సెటిల్‌మెంట్లు..ఇసుకదందాలు..అక్రమ కేసులు..రౌడీ గ్యాంగ్‌లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. బదిలీ అయిన రెండేళ్లకే మళ్లీ అక్కడికే పోస్టింగు తెచ్చుకునేంత లాబీయింగ్ నడపగల స్థాయి ఆ అధికారిది. జిల్లా ఉన్నతాధికారినే ఆయన ఖాతరు చేయడం లేదు. ఓ పోలీసు అధికారికి ఓ స్థానం ఒకసారి పనిచేసిన తరువాత మళ్లీ ఆదే హోదాతో అక్కడ సహజంగా పోస్టింగు ఇవ్వరు. కానీ ఈ మధ్యస్థాయి ఉన్నతాధికారి ఆ నిబంధనకు అతీతుడు. ఆయనకు జిల్లా కీలక నేత అండదండలున్నాయి.
పోలీసు అధికారి అండ....
అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లూ, చెవులుగా పనిచేసే రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారి దన్ను పుష్కలంగా ఉంది. అందుకే ఆయన ఒకే హోదాతో ఒకే స్థానంలో నాలుగేళ్లలో రెండుసార్లు పోస్టింగు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన జిల్లాలో కీలకమైన పోస్టింగు దక్కించుకున్నారు. ఆయన పరిధిలోకి రెండు నియోజకవర్గాలు వస్తాయి. అందులో ఒకటి జిల్లా కీలక నేత సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. ఆ స్థానంలో దాదాపు రెండేళ్లు ఆయన యథేచ్చగా చెలరేగిపోయారు. అనంతరం హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఏడాదిన్నరలోనే జిల్లాలోని తన పాత స్థానానికే ఆయనకు పోస్టింగు తెప్పించుకోవడం పోలీసువర్గాలనే విస్మయపరిచింది.
అంతగా రాజకీయ అండ ఉన్న ఆయనకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఆయన యవ్వారాలకు సంబంధించిన కొన్ని ఉదంతాలు ఇవిగో..
♦ ఆయన పనిచేసే కేంద్రంలోఓ వ్యాపారి కుటుంబ వివాదంలో ఈ అధికారి సెటిల్‌మెంట్ దందాకు తెరతీశారు. పెట్రోల్ బంకు, క్వారీలు, భూములు ఇలా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులపై బాబాయి, అబ్బాయిల మధ్య ఆస్తి వివాదం చెలరేగింది. అబ్బాయికి అనుకూలంగా కేసును సెటిల్ చేసేందుకు ఆ పోలీసు అధికారి డీల్ కుదుర్చుకున్నారు. ఆ సివిల్ కేసును కాస్తా క్రిమినల్ కేసుగా మలచారు. బాబాయిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తాను చెప్పినట్లు సెటిల్ చేసుకోవాలని వేధించారు. బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించారు. ఆ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించినట్లు నిగ్గుతేలిందని సమాచారం. కానీ ఆ అధికారి రాజకీయ పరపతికి తలొగ్గి ఉన్నతాధికారులు చర్య తీసుకోనేలేదు.
♦ ఆ పోలీసు అధికారి సెటిల్‌మెంట్ల కోసం ఏకంగా ఓ గ్యాంగ్‌నే ఏర్పాటు చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఆయన రెండోసారి ఆ స్థానంలో పోస్టింగ్ తెచ్చుకున్న తరువాత పలువురిపై రౌడీషీట్లు తొలగించారు. వారు ఓ ముఠాగా తయారై సెటిల్‌మెంట్లు చేస్తూ హల్‌చల్ చేస్తుండటం గమనార్హం. ఆ పోలీసు అధికారి అండతోనే ఇదంతా సాగుతోందన్నది నియోజకవర్గంలో బహిరంగ రహస్యంగా మారింది.
♦ ఈ అధికారి గతంలో తెలంగాణలో పని చేశారు. అప్పట్లో పోలీసుల అండతో నయిం గ్యాంగ్ చేసిన దందాలపై ఆయనకు అవగాహన ఉంది. అదే రీతిలో జిల్లాలో గ్యాంగ్ సంస్కృతికి ఈయన తెరతీశారు. హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధించిన ఓ రౌడీని కూడా ఇక్కడకు రప్పించారు.
♦ ఓ మహిళను మాయమాటలతో మోసం చేసి ఆమెకు చెందిన భూమిని రాయించుకోవడంతోపాటు దాదాపు రూ.కోటి వరకు నగదు తీసుకున్నారని సమాచారం. మోసపోయానని గ్రహించిన ఆమె తన భూమి, నగదు వెనక్కి ఇవ్వమని ఎంతగా అడిగినా ససేమిరా అన్నారు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది.
♦ జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఇసుక అక్రమరవాణాకు ఆయన అండదండలున్నాయి. ఆయన పరిధిలోని నియోజకవర్గాల నుంచే రోజుకు వందలసంఖ్యలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తన మాట వినడం లేదని ఓ సర్కిల్ స్థాయి అధికారిపై ఆయన ఈయన బహిరంగంగానే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటారు. ఈ విషయంలో ఆయన్ని కట్టడి చేయడం జిల్లా ఉన్నతాధికారితరం కూడా కావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment