Vijayawada Crime News
-
‘మహేష్ మర్డర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’
సాక్షి, విజయవాడ: మహేష్ మర్డర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హత్య, దోపిడి(మర్డర్ ఫర్ గెయిన్)తో పాటు మరణాయుధాల చట్టం ప్రకారం నిందితులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. అయితే నిందితులు ఇద్దరు ఆటోలో వచ్చినట్టు గుర్తించామని మహేష్ హత్య తర్వాత నిందితులు కారు వదిలిన ప్రాంతంలో సీసీ ఫుట్టేజ్‌లను పరిశీలిస్తున్నామని చెప్పారు. (చదవండి: బెజవాడ మహేష్ హత్య కేసులో కొత్త కోణం) కాల్పుల సమయంలో మహేష్‌తో పాటు స్పాట్లో ఉన్న నలుగురినీ విచారిస్తున్నామని తెలిపారు. మహేష్ కుటుంబ సభ్యుల అనుమానాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, మహేష్‌పై నిందితులు మొత్తం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపారని, అయిదు రౌండ్లు కాదని డీసీపీ స్ఫష్టం చేశారు. బులెట్ల ఆధారంగా నిందితులు 7.5 ఎమ్ఎమ్ బుల్లెట్లు వాడినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేగవంతం చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదం: కల్వర్టును ఢీకొట్టిన అంబులెన్స్
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న అంబులెన్స్ ఇబ్రహీంపట్నం కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో 67 ఏళ్ల వృద్ధుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయలయ్యాయి. వివరాలు.. కరోనా రోగులను తీసుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరిన అంబులెన్స్ ఈరోజు(శుక్రవారం) తెల్లవారు జామున సత్యనారాయణపురం వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఘటన స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా పాడేరుకు చెందిన గ్రంధి రంగ నాయకుడుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వివాహితపై సామూహిక లైంగిక దాడి
తెనాలి రూరల్: తెలిసీ తెలియని వయసులో పెళ్లి, తెలియనితనంతో వేసిన తప్పటడుగు ఓ బాలిక జీవితాన్ని అంధకారం చేసింది. ప్రియుడితో కలసి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకునే సమయం మించిపోవడంతో స్నేహితురాలి ఇంటికి వెళ్లే క్రమంలో మరో ఇద్దరు మృగాళ్లకు చిక్కి రెండు వారాలకుపైగా నరకం అనుభవించింది. చివరకు వారి నుంచి తప్పించుకుని బయటపడి పోలీసులను ఆశ్రయించింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా తెనాలి సబ్–డివిజనల్ కమాండ్ కంట్రోల్లో మంగళవారం డీఎస్పీ కె.శ్రీలక్ష్మి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని ముత్తెంశెట్టిపాలేనికి చెందిన 14 ఏళ్ల బాలికకు తండ్రి మరణించడంతో ఏడాదిన్నర క్రితం కర్లపాలెం మండలం కట్టవాద గ్రామానికి చెందిన యువకుడితో తల్లి వివాహం జరిపించింది. అక్కడ బాలికకు భర్త ఇంటి సమీపంలో ఉండే నూతలపాటి నవీన్‌కుమార్ అలియాస్ నవీన్ పరిచయమయ్యాడు. జూలై 25న బాలికను ఆమె భర్త తెనాలిలోని పుట్టింట్లో వదిలి వెళ్లాడు. మరుసటి రోజు మధ్యాహ్నం తెనాలి వచ్చిన నవీన్, బాలికను తన మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని, అమృతలూరు మండలం యలవర్రు సమీప పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి, రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తెనాలి వైకుంఠపురం వద్దకు తీసుకొచ్చి వదిలి వెళ్లాడు. అప్పటికే ఆలస్యమైందన్న భావనతో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు అర్ధరాత్రి ప్రాంతంలో బాలిక ఆటోలో పేరేచర్లకు చేరుకుంది. ఆటో దిగిన ఆమెను గుంటూరుకు చెందిన హోంగార్డు (గుంటూరు అర్బన్ జిల్లా డాగ్ స్క్వాడ్) అశోక చక్రవర్తి, అతని మిత్రుడు దుర్గారావు గమనించారు. బాధితురాలి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఆమె నిరాకరించింది. దీంతో తాను హోంగార్డునని అశోకచక్రవర్తి తన ఐడీ కార్డు చూపించి వివరాలు తెలుసుకున్నాడు. ఆమెకు ఆశ్రయం కల్పిస్తామని ఇద్దరూ చెప్పి తమ వెంట గుంటూరు తీసుకెళ్లి, దుర్గారావు ఇంట్లో కొద్ది రోజులు, మరో అద్దెకు తీసుకున్న గదిలో మరికొన్నాళ్లు ఆమెను నిర్బంధించి, సుమారు రెండు వారాలకు పైగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కుమార్తె ఆచూకీ తెలియని ఆమె తల్లి ఈ నెల 11న తెనాలి వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. మృగాళ్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక తెనాలి చేరుకుని, ఈ నెల 13న పోలీసులను ఆశ్రయించి, తనకు జరిగిన ఘోరాన్ని వివరించింది. అప్పటికే వివాహిత అదృశ్యం కేసును వన్‌టౌన్ పోలీసులు నమోదు చేయగా, బాలిక ఫిర్యాదుతో దాన్ని కిడ్నాప్, లైంగిక దాడి సెక్షన్ల కింద మార్చి డీఎస్పీ శ్రీలక్ష్మి దర్యాప్తు చేశారు. సీఐ ఎం.రాజేష్‌కుమార్, మహిళా ఎస్ఐ అనంతకృష్ణ నిందితుల అచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల్లో ఒకడైన నవీన్‌ను పెదరావూరు జంక్షన్ వద్ద 17న, మరో ఇద్దరు నిందితులు అశోకచక్రవర్తి, దుర్గారావును గుంటూరు బీఆర్ స్టేడియం వద్ద మంగళవారం అరెస్టుచేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. -
కరోనాను క్యాష్ చేసుకుంటున్న మెడికల్ మాఫియా!
సాక్షి, అమరావతిబ్యూరో: ఒకవైపు కరోనా మహమ్మారి కృష్ణా,గుంటూరు జిల్లాలను గడగడలాడిస్తుంటే.. మరోవైపు బాధితుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా పేరుతో రూ.వేలల్లో దండుకుంటున్నారు. ఆయా మాత్రలు, సూది మందులను తయారీ కంపెనీల నుంచి మెడికల్ ఏజెన్సీల పేర్లతో తీసుకుని మందుల దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో ఇటీవల ఈ అక్రమ దందాల వ్యవహారాలు జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని ముఠాలు కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి భారీగానే సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ నుంచి దిగుమతి.. ♦ రసాయన సంస్థలు, కొన్ని కార్పొరేటు ఆస్పత్రులు మహారాష్ట్ర, గుజరాత్‌లోని భావనగర్, జునాగఢ్ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించుకుంటున్నాయి. ♦ అక్కడి కిందిస్థాయిఉద్యోగుల అత్యాశ కారణంగా అవి అక్రమార్కులకు చేరుతున్నాయి. ♦ 10 కిలోల ఆక్సిజన్ సిలిండర్ రూ.4,500 అసలు ధర కాగా.. కిందిస్థాయి ఉద్యోగులు రూ.5,500 నుంచి రూ.6,500 వరకూ విక్రయిస్తున్నారు. ♦ వీటిని తీసుకున్న అక్రమార్కులు రూ.10 వేల నుంచి రూ.11 వేలకు అమ్మేస్తున్నారు. ♦ రోజూ ఒక్కో కంపెనీకి నాలుగైదు లారీల ఆక్సిజన్ సిలిండర్ల లోడ్లు వస్తుండటం, వాటి లెక్కలు చూసేవారు కిందిస్థాయి ఉద్యోగులకు బాధ్యత అప్పగించడంతో ఇదంతా జరుగుతోందని సమాచారం. ♦ అయితే ఇలా చేస్తున్న వారికి ఒక్కరికి కూడా ఆక్సిజన్ సిలిండర్లు విక్రయించేందుకు ప్రభుత్వ అనుమతి లేదని తెలుస్తోంది. ఆస్పత్రుల వద్ద గుట్టుచప్పుడు కాకుండా.. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రెమ్డిసివెర్ తదితర మందులు తక్షణం అందజేస్తామంటూ కొందరు దుకాణాల నిర్వాహకులు, ఏజెన్సీల ప్రతినిధులు ప్రభుత్వ, కార్పొరేట్ కోవిడ్ ఆస్పత్రుల సమీపంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఢిల్లీ, ముంబైల నుంచి తెప్పించామని.. అందుకే బిల్లులు ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. ఒక్కో డోసు అమ్మినందుకు వీరికి రూ.10 వేల నుంచి రూ.20 వేలకు వరకూ లాభం వçస్తుంది. ఫ్యాబిఫ్లూ మందుల్లో మాత్రం రూ.వందల్లో గిట్టుబాటు అవుతుందని ఔషధ రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా మందులు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు.. టొసిలీజుమాబ్ ఇంజెక్షన్ అత్యవసర పరిస్థితుల్లో కరోనా రోగులకు వినియోగిస్తుంటారు. వీటి ఖరీదెక్కువు. విదేశాల నుంచి ముంబైకు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వీటిని దిగుమతి చేసుకుంటారు. ప్రతి ఇంజెక్షన్ వివరాలు మా శాఖ వద్ద ఉంటాయి. మెడికల్ ఏజెన్సీలకు, కార్పొరేట్ ఆస్పత్రులకు ఎనెన్ని ఇంజక్షన్లు సరఫరా చేశారు.. ఎన్నింటిని వినియోగించారు అన్న దానిపై నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. ఎవరైనా వీటిని అధిక ధరకు విక్రయిస్తుంటే ఔషధ నియంత్రణ శాఖకు సమాచారం ఇస్తే అక్రమార్కుల ఆట కట్టిస్తాం. – రాజాభాను, అసిస్టెంట్ డైరెక్టర్,ఔషధ నియంత్రణ శాఖ, కృష్ణా జిల్లా బ్లాక్ మార్కెట్లో ఇలా.. ♦ విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. అయితే అతనికి వైరస్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో బంధువులు అతన్ని గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రిలో చేర్పించారు. ♦ చికిత్సలో భాగంగా వైద్యులు ఆ రోగికి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే టొసిలీజుమాబ్ 400 మిల్లీగ్రాముల ఇంజెక్షన్‌ను రాసిస్తూ.. అది తమ వద్ద లేదని, బయట నుంచి తీసుకురావాలని సూచించారు. ♦ రోగి బంధువులు గుంటూరు నగరంలోని ఒక దుకాణంలో ఈ మందును తీసుకొచ్చారు. ♦ అయితే దీని ఎంఆర్పీ ధర రూ.35 వేలుగా ఉండగా ఆ దుకాణంలో రూ.90 వేలకు కొనుగోలు చేశారని తెలిసింది. ♦ అయితే సాధారణంగా ఈ మందు ప్రభుత్వ అనుమతలు పొందిన డ్రగ్ డీలర్లు.. స్పెషలిస్ట్ వైద్యుల ప్రిస్కిప్షన్ ఉంటేనే రోగులకు విక్రయిస్తారు. అయితే రోగుల అవసరాన్ని బట్టి వీటిని అధిక ధరలకు మాత్రం విక్రయించరాదు. -
చిట్టీ వ్యాపారం.. పరారీలో కుటుంబం.?
అమరావతి,గుడివాడ: చిట్టీ వ్యాపారం పేరుతో మోసం చేసి సుమారు రూ. 4 కోట్లతో పరారీ అయిన దంపతుల ఉదంతం గుడివాడ పట్టణంలో శుక్రవారం వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుడివాడ పట్టణం 35వ వార్డు కొత్తవారి వీధిలో నివాసం ఉండే సింహాద్రి లక్ష్మణరావు, అతని భార్య సత్యవతిలు చిట్టీలు, వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. స్థానికంగా ఉన్న వారితో సఖ్యతగా మెలుగుతూ వారి వద్ద చిట్టీలు కట్టించుకుంటూ ఉండేవారు. వీరు సొంతంగా రూ. 2 లక్షలు, రూ.5 లక్షలు, రూ. 3 లక్షలు చిట్టీలు వేయగా.. సత్యవతి సమీపంలోని వారి వద్ద ఈమె కూడా చిట్టీలు వేసి పాడుకుంది. రెండు నెలలుగా చిట్టీలు కట్టించుకుని పాడుకున్న వారికి నగదు ఇవ్వడం లేదు. అధిక వడ్డీ ఆశ చూపి... సత్యవతి వద్ద చిట్టీలు వేసిన వారు పాడుకుంటే మీ డబ్బుకు ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశ చూపేదని బాధితులు చెబుతున్నారు. దీంతో ఆశపడిన వారు పాడిన చిట్టీ సొమ్ము మొత్తాన్ని సత్యవతికి ఇచ్చేవారు. అలాగే సత్యవతి బయట వేసిన చిట్టీలు ముందే పాడుకుని కట్టటం లేదు. అనుమానం వచ్చిన బాధితులు లక్ష్మణరావు ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండటంతో అవాక్కయ్యారు. బాధితులంతా ఏకమై శుక్రవారం స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులను ఆశ్రయించారు. రాత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. కనిపించడం లేదని ఫిర్యాదు కాగా తమ అక్కా,బావ, ఇద్దరు పిల్లలు ఈ నెల 16 నుంచి కనిపించడం లేదని, ఫోన్ చేసినా స్పందన లేదని సత్యవతి సోదరుడు కరుణ్‌కుమార్ స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పడమట గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురి అరెస్టు
సాక్షి, విజయవాడ: బెజవాడ పడమట గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు మరో నలుగురిని మంగళవారం అరెస్టు చేశారు. వారిలో పండు గ్రూప్‌కు చెందిన రౌడీ షీటర్ అనంత్ కుమార్, అజయ్, శంకర్, మస్తాన్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల వెల్లడించారు. అయితే ఇప్పటికే పండు గ్యాంగ్‌లోని 26 మందిని, సందీప్ గ్రూప్‌లోని 24 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే పండు గ్రూప్‌కు చెందిన రౌడీ షీటర్ అనంత్ కుమార్‌పై సీపీ బత్తిన శ్రీనివాసులు నగర బహిష్కరణ వేటు వేశారు. అదే గ్యాంగ్‌లోని మరో 18 మందిని సస్పెక్ట్ చేస్తూ.. మరో 8 మందిపై పడమటి పోలీసులు రౌడీ షీట్ కేసులు తెలిచారు. మరోసారి స్ట్రీట్ ఫైట్లకు దిగి బెజవాడ ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. చదవండి: విశాఖలో మరో గ్యాంగ్‌వార్ కలకలం -
నేడు పోలీస్ కస్టడీకి ‘మోకా’ నిందితులు
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసు దర్యాప్తులో బందరు పోలీస్‌లు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఓ మైనర్‌తో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. నిందితులిచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఈ హత్యలో కుట్రదారునిగా పేర్కొంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను తుని వద్ద అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. కొల్లుతో సహా నిందితులందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 6న మచిలీపట్నం సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఈ కేసు దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేడు మచిలీపట్నం కోర్టుకు ఏ–1, ఏ–2 నిందితులు ఇందుకోసం ఈ కేసులో ఏ–1గా ఉన్న చింతా నాంచారయ్య (చిన్న), ఏ–2గా ఉన్న చింతా నాంచారయ్య (పులి)లను మూడు రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ జిల్లా కోర్టులో ఆర్ పేట పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన కోర్టు పోలీసుల అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది. మూడు రోజుల కస్టడీ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చింతా చిన్న, చింతా పులిలను శనివారం మచిలీçపట్నం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హత్య ఘటనలో చింతా నాంచారయ్య (పులి) పాల్గొనగా, హత్యానంతరం అతడిని తన బులెట్‌పై ఎక్కించుకుని చిన్న పరారైనట్లు వీడియో పుటేజ్ ఆధారంగా ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో కీలకమైన ఈ ఇరువుర్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు. కస్టడీకి తీసుకుంటున్న నిందితులిద్దర్ని రానున్న మూడు రోజులూ వివిధ కోణాల్లో విచారించనున్నారు. లోతుగా విచారణ మోకా హత్యకు ఎప్పటి నుంచి పథక రచన చేశారు? ఎన్నిసార్లు భేటీ అయ్యారు? ఎక్కడ భేటీ అయ్యారు? ఆ భేటీలో మాజీ మంత్రి కొల్లు ఎన్నిసార్లు పాల్గొన్నారు. హత్య విషయంలో ఎలాంటి సూచనలు చేశారు. అనంతరం ఆయనకు ఏ విధంగా సమాచారం చేరవేశారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారితో పాటు ఇంకా ఎవరెవరు సహకరించారు. ఈ హత్య విషయంలో ఆర్థిక లావాదేవీలు ఏ మేరకు జరిగాయి. ఎంత చేతులు మారాయి? ఇలా వివిధ కోణాల్లో నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు లోతుగా విచారించనున్నారు. వారి స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నారు. సయ్యద్ ఖాజాను విచారించిన పోలీసులు ఇదిలా ఉండగా హత్యకు సరిగ్గా పదిహేను రోజుల క్రితం టీడీపీ కార్యాలయంలో నిందితుడు చిన్నాతో కలిసి ప్రెస్మీట్లో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఖాజాను కూడా శుక్రవారం ఆర్ పేట పోలీసులు విచారించారు. హత్య జరిగిన తర్వాత పరారీలో ఉన్న ఖాజా అరెస్ట్‌ల పర్వం పూర్తి కాగానే నగరానికి చేరుకున్నారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. ‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి..పిచ్చిపిచ్చిగా మాట్లాడకండి..ఒక్కొక్కడికి తాట తీస్తాం. మోకా బాచీ (మోకా భాస్కరరావు)..!నీకు కరెక్ట్ మొగుడు మ్ఙాచింతా చిన్న యే..ఇక్కడే ఉన్నాడు కంగారు పడకు..నీ సంగతి చూస్తాడు..గుర్తించుకో’అంటూ ఆ ప్రెస్మీట్లో ఖాజా చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం దాగి ఉందని అనుమానంతో పోలీసులు ఖాజాను సుమారు ఐదు గంటల పాటు విచారించారు. తనకే పాపం తెలియదని, రాజకీయంగా విమర్శలు చేసేనే తప్ప ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. నగరం విడిచి వెల్లేందుకు వీల్లేదని షరతు విధిస్తూ ఆయన్ని పంపారు. 3 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నాం మోకా హత్య కేసులో కీలక నిందితులైన చిన్నా, పులిలను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నాం. కోర్టు అనుమతితో శనివారం మచిలీపట్నం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వీరిని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నాం.– ఎం.రవీంద్రనాథ్‌బాబు, జిల్లా ఎస్పీ -
మదమెక్కిన తాతయ్య మృగాడిగా మారాడు..
మనవరాలని ఆప్యాయంగా దగ్గరకు తీయాల్సిన వృద్ధుడు.. మదమెక్కిన మృగాడిగా మారాడు. తాతయ్యా అనే పిలుపుతో ఆనందాన్ని పొందాల్సిన వయసు.. పసిమొగ్గపై పైశాచికంగా ప్రవర్తించాడు. కమ్మని కథలు చెప్పి పిల్లల స్వచ్ఛమైన నవ్వుల్లో సంతోసాన్ని వెతుక్కోవాలిసిన మదిమిలో కామపిశాచి అయ్యాడు. తేలప్రోలు గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఉంగుటూరు(గన్నవరం): మండలంలోని తేలప్రోలు గ్రామానికి చెందిన బాలిక(5) తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన వృద్ధుడు చిన్నారులను ఆటలతో దగ్గర చేసుకున్నాడు. ఇంతలో వృద్ధుడి మృగాడు బయటి వచ్చాడు. ఆటలు ఆడిస్తున్నట్లు నటించాడు. దగ్గర ఉన్న ఇసుక గుట్ట వద్దకు తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు సమీపంలో ఉన్న కొందరు స్థానికులు చూశారు. ఇంతలో పాపకు ఏమి జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. లైంగిక దాడికి ప్రయత్నించినట్లు నిర్ధారించుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ వి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యాంకర్లు బస చేసిన హోటల్స్‌పై దృష్టి
సాక్షి, మచిలీపట్నం: ‘బందరులో హైటెక్ వ్యభిచారం’ అనే శీర్షకన సాక్షిలో ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ తరహా విష సంస్కృతి విస్తరిస్తుందన్న కథనం రాజకీయ, పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సీరియస్‌గా తీసుకున్నారు. లోతైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బందరు డివిజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన చిలకలపూడి పోలీసులు నగరంలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. యాంకర్లు బస చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన హోటల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎంత కాలం క్రితం వచ్చారు. ఎందుకొచ్చారు. ఎన్ని రోజులున్నారో ఆరా తీశారు. మరొక వైపు పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఉన్న అపార్టుమెంట్లలో కూడా సోదాలు నిర్వహించారు. విచారణ జరుపుతున్నాం: రవీంద్రనాథ్‌బాబు, జిల్లా ఎస్పీ ప్రశాంతమైన బందరు నగరంలో హైటెక్ వ్యభిచారం జరిగే అవకాశాలు లేవు. సాక్షిలో వచ్చిన కథనంపై సమగ్ర విచారణ జరపుతున్నాం. ప్రత్యేక బృందాలతో నగరంలోని లాడ్జీలు, అపార్టుమెంట్లు సోదాలు చేస్తున్నారు. -
కలకలం రేపిన వృద్ధురాలి హత్య
కోడూరు(అవనిగడ్డ): డబ్బు, బంగారం కోసం వృద్ధురాలిని దుండగులు వారం రోజుల క్రితం హత్య చేసి డ్రెయిన్ పక్కన తాటిబొందల్లో పడవేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూడటంతో దివిసీమలో తీవ్ర కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగారెడ్డిపాలెం శివారు నక్కవానిదారి గ్రామానికి చెందిన మట్టా వీరమ్మ (65) భర్త, ఇరువురు కుమారులు గతంలోనే మృతిచెందడంతో వ్యవసాయ పనులకు వెళ్తూ మరో కుమారుడు బసవమాణిక్యాలరావు వద్ద్ద ఉంటోంది. కూలి పనులకు వెళ్లిగా వచ్చిన డబ్బులను కుదవపెట్టి వీరమ్మ ఇరుగుపొరుగు వారికి వడ్డీకి ఇస్తోంది. వీరమ్మకు గ్రామ సమీపంలోని పొలాల్లో అడపాదడపా జరిగే పేకాట శిబిరాల వద్దకు వెళ్లే అలవాటు ఉంది. అక్కడ పేకాటరాయుళ్లకు కూడా వీరమ్మ నగదును పెట్టుబడి పెడుతుందని గ్రామస్తులు చెప్పారు. ఈ నేపథ్యంలో వీరమ్మ వారం రోజుల నుంచి కనిపించకుండా పోగా.. గురువారం రాత్రి గ్రామ సమీపంలోని రత్నకోడు (తాలేరు) డ్రెయిన్ పక్క తాటిబొందల్లో శవమై కనిపించింది. హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు.. గురువారం మధ్యాహ్నం డ్రెయిన్ గట్టు వెంట ఉన్న తాటిబొందల ఆకులను నరికేందుకు గ్రామస్తులు వెళ్లగా అక్కడ తీవ్రమైన దుర్వాసన రావడంతో వెళ్లి పరిశీలించడంతో మహిళ మృతదేహం కనిపించింది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామ వీఆర్వో మేడికొండ బాబురావు ఫిర్యాదు మేరకు తొలుత గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం వీరమ్మ కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి వచ్చి మృతదేహాన్ని గుర్తుపట్టడంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. వీరమ్మ వారం రోజుల కితం పేకాట శిబిరం వద్దకు వెళ్లగా అక్కడ పేకాటరాయళ్లు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరమ్మ మెడలో ఉన్న బంగారపు నానతాడు, చెవిదిద్దులతో పాటు పెద్దమొత్తంలో డబ్బును దుండగులు అపహరించి, ఎవరికి తెలియకుండా హత్య చేసి ఇలా తాడిబొందల్లో పడేశారనే కోణంతో దర్యాప్తు జరుపుతున్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం తనిఖీలు వీరమ్మ హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. మచిలీపట్నం నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను తీసుకువచ్చి ఘటనాస్థలంలో సోదాలు చేశారు. డాగ్‌స్క్వాడ్ గ్రామంలోని పలువురు గృహాల వద్దకు వెళ్లగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అవనిగడ్డ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే కుళ్లిపోయిన వీరమ్మ మృతదేహాన్ని శవపంచనామా అనంతరం ఘటనాస్థలంలోనే అవనిగడ్డ ప్రభుత్వ వైద్యాధికారి కృష్ణదొర పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని సీఐ చెప్పారు. ఎస్ఐ రమేష్, సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
సొంత బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్
-
సొంత బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్
సాక్షి, కృష్ణా: నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో బుధవారం ఘరానా మోసం బట్టబయలైంది. హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న గుండ్ర రవితేజ కోట్ల రూపాయలను ఖాచేసి సొంత బ్యాంకుకే కన్నం వేశాడు. రూ. 1,56,56,897 కోట్ల ఖాతాదారుల నగదును బ్యాంక్ నుంచి కాచేసి చేతి వాటం చూపించాడు. దీనిపై బ్యాంక్ చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ.. రవీతేజ 2017లో నుంచి బ్యాంక్‌లో పనిచేస్తున్నాడని చెప్పాడు. కాగా ఖాతాదారుల నగదును, ఫిక్సిడ్ డిపాజిట్లను తన అకౌంట్‌కు బదిలీ చేసుకున్నట్లు క్యాష్ తనిఖీలో వెల్లడైందని ఆయన తెలిపారు. వెంటనే నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. కాగా రవీతేజకు ఆన్లైన్లో రమ్మీ, కాసినో ఆటలకు అలవాడు పడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణతో తెలింది. బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు రవీతేజపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అమ్మా.. నేనూ నీవెంటే!
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): నవ మాసాలు కనిపెంచిన తల్లి దూరమైందనే ఆవేదన... ఇన్ని నాళ్లు తన ఆలనా పాలనా చూసిన తల్లి విగత జీవిగా పడి ఉండటం ఆ బాలుడిని కలచి వేసింది. తల్లి లేని జీవితం వద్దనుకుని ఇంటిలోకి వెళ్లి బంగారం శుద్ధి చేసే రసాయనాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో వారం రోజులలో పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్న ఆ కుటుంబంలో ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. రోజు వ్యవధిలోనే తల్లీ, బిడ్డ ఆత్మహత్యకు పాల్పడటంతో కాలనీలో విషాదం నెలకొంది. ఈ ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్సార్ కాలనీ బ్లాక్ నెం: 134కు చెందిన షేక్ షంషుద్దీన్, కరీమా భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు నూరుద్దీన్ (16) భవానీపురం నేతాజీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆర్థిక పరిస్థితులు, లాక్‌డౌన్‌కు ముందు పెద్ద కుమార్తె రుకియాకు వివాహం చేయడం, రెండు నెలలుగా పనులు లేకపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కరీమా ఆందోళన చెందుతూ వస్తుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆమె బంగారం మెరుగు పెట్టే రసాయనాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడింది.(ఎంత పనిచేశావు తండ్రీ!) తల్లి మరణం తట్టుకోలేక... తల్లితో ఎంతో ప్రేమగా, అప్యాయతగా ఉండే నూరుద్దీన్ తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయాడు. సోమవారం తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించగా.. తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యాడు. తెల్లవార్లు కన్నీరుమున్నీరుగా విలపించాడు. మంగళవారం ఉదయం తల్లి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండటంతో తండ్రి, ఇతర బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఇంట్లో తన ఇద్దరు అక్కలతో ఉన్న నూరుద్దీన్‌కు మధ్యాహ్నం సమయంలో తల్లి మృతదేహం ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువస్తున్నారనే విషయం తెలిసింది. దీంతో ఇంటిలోని బాత్రూంలోకి వెళ్లి తల్లి తాగిన రసాయనాన్ని తాను కూడా తాగి బయటకు వచ్చాడు. కొద్దిసేపటికే నూరుద్దీన్ నోటి నుంచి నురగలు రావడంతో ఇంటిలో ఉన్న ఇద్దరు అక్కలు వెంటనే తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్పటికే మార్గమధ్యంలో ఉన్న వారు కరీమా మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వచ్చే సరికి నూరుద్దీన్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే నూరుద్దీన్‌ను భవానీపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే నూరుద్దీన్ మృతిచెందాడు. (సడలింపులు.. ‘తొలి’ కేసు ) తల రాతను మార్చిన ప్రమాదం.. ముగ్గురు పిల్లలు, చేతి నిండా పని, ఎంతో సంతోషంగా ఉండే ఆ కుటుంబాన్ని గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం వారి గతినే మార్చేసింది. గత ఏడాది షంషుద్దీన్ భార్యతో కలిసి మచిలీపట్నం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో భార్యభర్తలిద్దరికి గాయాలు కావడంతో చికిత్స చేయించుకున్నారు. ప్రమాదం కారణంగా భార్యకు మానసిక పరిస్థితి సరిగా ఉండకపోవడంతో వైద్యం చేయిస్తున్నారు. అప్పటి నుంచి అప్పులు, మానసిక ఆందోళనలు పెరిగిపోయాయి. ఇటీవల పెద్ద కుమార్తెకు రుకియాకు వివాహం చేశారు. వివాహానికి అప్పు చేయడం, మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పాటు రెండు నెలలుగా పనులు లేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో కుటుంబ పరిస్థితిపై ఆందోళన చెందుతూ వస్తోంది. ఇప్పుడు రెండు మరణాలు ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మిత్ర ద్రోహి.. స్నేహితుడి సోదరిని..
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. ప్రియురాలితో మాట్లాడేందుకు అడ్డు వస్తున్నాడన్న కోపంతో ఓ యువకుడు తన ప్రియురాలి అన్నను హతమార్చిన ఘటన మచిలీపట్నంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మచిలీపట్నం అమృతపురం జెండాసెంటర్‌కు చెందిన యర్రంశెట్టి సాయి (21) అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ యాసిన్లు స్నేహితులు. యాసిన్ పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. సయ్యద్ యాసిన్ సాయి కోసం ప్రతిరోజు ఇంటికి వెళుతుంటాడు. అలా యాసిన్ సాయి సోదరిని ప్రేమలోకి దింపాడు. విషయం తెలిసిన సాయి యాసిన్‌ను తన చెల్లెలితో తిరగవద్దని, మాట్లాడవద్దని పలుమార్లు హెచ్చరించినా మానలేదు. ఈ విషయమై ఇరువురి మధ్యా పలుమార్లు గొడవలు, కొట్లాటలూ జరిగాయి. తన ప్రేమ వ్యవహారానికి సాయి అడ్డు వస్తున్నాడని పగ పెంచుకున్న సయ్యద్ యాసిన్ మంగళవారంమధ్యాహ్నం సాయిని పార్టీ పేరుతో ఆంధ్ర జాతీయ కళాశాల వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ఆహ్వానించాడు. అక్కడ ఇరువురూ కలసి మద్యం సేవిస్తుండగా పథకం ప్రకారం యాసిన్ సాయి గ్లాసులో సైనెడ్‌ను కలిపి సాయికి ఇచ్చాడు. విషయం తెలియని సాయి మందును సేవించి కొద్దిసేపటికి అపస్మారకస్థితికి చేరుకుంటుండగా యాసిన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా విషయాన్ని గ్రహించిన స్థానికులు ఎండ దెబ్బకు నీరసంపడి ఉంటాడని భావించారు. సమీపంలోని ఆటోలో వైద్యం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా సాయి మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. సాయి తల్లి ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. -
హవాలా హవా!
బెజవాడలో హవాలా, జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. వన్‌టౌన్, కొత్తపేట, భవానీపురం, గవర్నర్‌పేట, లబ్బీపేట, మొగల్రాజపురం, కృష్ణలంక ప్రాంతాల్లో ఇలాంటి వ్యాపారం చేసే ఏజెంట్లు లెక్కలేనంత మంది ఉన్నారు. ఈ అక్రమ దందా బాగోతం జీఎస్టీ అధికారులకు, ఆదాయపన్ను శాఖాధికారులకు, పోలీసులకుతెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విజయవాడ కొత్తపేట పరిధిలోని గణపతిరోడ్డులో కేఆర్ ఫ్యాషన్ వరల్డ్ అనే వస్త్ర దుకాణం ఉంది. దీనిని రాజస్థాన్‌కు చెందిన జగదీష్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. అయితే బుధవారం రాత్రి అతను షాపులో డబ్బు లెక్కిస్తుండగా రూ. 35లక్షల నగదును కొత్తపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదుకు షాపు లావాదేవీలకుఎలాంటి ఆధారాలు దొరకలేదు. విచారిస్తే ఈ మొత్తం డబ్బు హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు తెలిసింది. సాక్షి, అమరావతిబ్యూరో: ఎందుకు.. ఏమిటీ అన్న వివరాలు అవసరం లేదు.. బ్యాంకు ఖాతాతో పనేలేదు... ఇన్‌కంట్యాక్స్ బాధా లేదు. ఆ రూట్లో అంతా నోటిమాటపైనే పని జరుగుతుంది. గుట్టుచప్పుడు కాకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా డబ్బు పంపిస్తారు.. అదే హవాలా దందా..! ముంబై తర్వాత వాణిజ్య నగరంగా పేరుగాంచిన విజయవాడలో ఈ దందా యథేచ్ఛగా సాగుతుంది. నగరంలో బంగారం, వస్త్ర, చెప్పులు తదితర వ్యాపారాలు జోరుగా సాగుతుంటాయి. రూ. కోట్లల్లో లావాదేవీలు జరుగుతుండటంతో వ్యాపారులు కేంద్ర, రాష్ట్రాలకు కట్టాల్సిన పన్నుల చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. వివిధ నగరాల నుంచి దుకాణాలకు తెప్పించుకునే సరుకులో సగానికి మాత్రమే బిల్లులు చూపుతూ.. మిగిలిన సగం సరుకును ‘జీరో’కింద ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే వ్యాపారులకు ఇచ్చే డబ్బును సైతం హవాలా మార్గం ద్వారా యథేచ్ఛగా చెల్లింపులు చేస్తున్నారు. పైనే పేర్కొన్న రెండు ఉదంతాలు ఆకాశరామన్నలు పోలీసులకు పక్కా సమాచారం ఇవ్వడంతోనే వెలుగులోకి వచ్చాయి. ఐరన్ వ్యాపారం మాటున.. నగరంలో బంగారం జీరో దందా ఒక ఎత్తయితే.. ఐరన్ వ్యాపారం మరో ఎత్తు. ఈ వ్యాపారానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఐరన్ చానళ్లు, షీట్లు, యాంగ్లర్లు తదితరాలను లారీల్లో దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఈ సరుకును తెచ్చే సమయంలో ఐరన్ ముడి సరుకును సరఫరా చేసే వ్యాపారులు రెండు రకాల బిల్లులను లారీ డ్రైవర్లకు ఇచ్చి పంపుతున్నారు. లారీలో తచ్చే స్టాకు వివరాలు తెలుపుతూ ఒరిజినల్ బిల్లును సీల్డ్ కవర్లో డ్రైవర్‌కు అందజేస్తారు. రెండో బిల్లులో స్టాకుకు.. వాటి విలువలో భారీ వ్యత్యాసం ఉంటోంది. వాణిజ్య ఇతరత్రా చెక్‌పోస్టు తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడకుండా సాఫీగా సాగిపోతే.. డ్రైవర్ తెచ్చిన ఒరిజినల్ బిల్లును మళ్లీ తిరిగి సరఫరా దారుడికి అందజేస్తాడు. రెండో బిల్లు విజయవాడలోని వ్యాపారికి అందజేసి సరుకు దించేస్తారు. ఉదాహరణకు రూ. 12 లక్షల సరుకును విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి పంపితే.. ఎక్కడా తనిఖీల్లో చిక్కకుండా సాఫీగా దుకాణానికి సరుకు చేరుకుంటే.. ఒరిజినల్ బిల్లు రూ. 12 లక్షల స్థానంలో రూ. 1.20 లక్షల బిల్లును తిరిగి పంపి.. పాత బిల్లులను కంప్యూటర్లో డీలిట్ చేసేస్తారు. ఇలా రూ. 12 లక్షల సరుకు సంబంధించి సరఫరాదారుడికి రూ. 1.20 లక్షలు వ్యాపారం జరిగినట్లు లెక్కల్లో చూపుతాడు. అలాగే వ్యాపారి నుంచి మిగితా మొత్తం రూ. 10.80 లక్షలు హవాలా మార్గం ద్వారా తీసుకుంటాడు. ఇక్కడ విజయవాడలో కూడా ఇదే తరహాలో వ్యాపారులు దందా సాగిస్తున్నారు. ఈ తరహా దందా వన్‌టౌన్, కొత్తపేట, భవానీపురం, ఆటోనగర్ ప్రాంతాల్లో ఉండే ఐరన్ దుకాణాల్లో నిత్యకృత్యమైందనే ఆరోపణలున్నాయి. -
‘గొల్లాస్ గ్యాంగ్’ అరెస్ట్
సాక్షి, అమరావతిబ్యూరో: పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం దోపిడీ దొంగలు జన నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రిపూట ఆ ఇళ్ల తలుపులు పగులగొట్టి ఇంట్లో నిద్రిస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేసి దోపిడీలకు పాల్పడేవారు. ఇలాంటి దోపిడీలకు పాల్పడే ముఠాల్లో పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్ ముందువరుసలో ఉంటుంది. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో ఈ ముఠాలు దోపిడీలకు తెగబడేవి. సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత ఆ ముఠా తరహాలోనే విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉయ్యూరు మండలం కాటూరులో ఈ నెల 10న అర్ధరాత్రి ఓ ఇంట్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు 62 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.వెయ్యి నగదుతోపాటు ఓ సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు విచారణ చేసి తెనాలికి చెందిన పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు దోపిడీ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉయ్యూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. తలుపులు పగలగొట్టి బీభత్సం.. ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగ రజనీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి ఆరుగురు వ్యక్తులు ముఖానికి ముసుగులు, చేతులకు గ్లౌజులు, నిక్కర్లు ధరించి ఇంటి తలుపును గునపాలు, బండరాయితో ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు బద్ధలవుతున్న శబ్దం విన్న రజనీకాంత్ అతని భార్య హాలులోకి వచ్చేసరికి దోపిడీ దొంగలు వారిని కత్తులు, గునపాలతో బెదిరించి చేతులు కట్టేశారు. ఇంట్లో విలువైన వస్తువులు ఇవ్వాలని బెదిరించారు. తమ వద్ద ఉన్న 62 గ్రాముల బంగారు ఆభరణాలు ఇవ్వగా.. కోళ్లఫారం వ్యాపారివి నీ వద్ద ఇంతేనా ఉండేదని ప్రశ్నించగా.. రజనీకాంత్ తనకు కోళ్లఫారం లేదని.. పక్కింట్లోని వ్యక్తిదని పేర్కొనడంతో దొంగలు కొంత శాంతించారు. తర్వాత బంగారు ఆభరణాలతోపాటు ఒక ఐఫోన్‌ను రూ. వెయ్యి నగదును తీసుకెళ్లిపోయారు. చివరగా దొంగల సృష్టించి భయోత్పాతానికి రజనీకాంత్ దంపతులు తమ వద్ద ఉన్న వెండి ఆభరణాలు ఇవ్వగా వాటిని తిరిగి వారికే ఇచ్చేశారు. ఆధారాలు సేకరించి.. బాధితుల ఫిర్యాదు మేరకు ఉయ్యూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలానికి వెళ్లి దోపిడీ జరిగిన తీరు పరిశీలించారు. ఘటనా స్థలం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సేకరించిన వివరాలను విశ్లేషించారు. దొంగల పాద ముద్రలు దొరికాయి. బాధితుల చెప్పిన వివరాల మేరకు దోపిడీకి వచ్చిన నేరగాళ్లు వచ్చిరాని తెలుగులో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో అంతరాష్ట్ర ముఠా పనేనని అనుమానించారు. మిర్యాలగూడ దోపిడీతో కేసు కొలిక్కి.. కాటూరులో దోపిడీ ఏ ముఠా చేసిందనే కోణంలో దర్యాప్తు చేస్తుండగా.. అచ్చం ఈ తరహా దోపిడీనే డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో జరిగినట్లు తెలిసింది. వెంటనే సీసీఎస్ పోలీసులు అక్కడకు వెళ్లి బాధితులతో మాట్లాడగా.. అక్కడ కూడా నలుగురు వచ్చీరాని తెలుగులో మాట్లాడారని, ఒక్కడు మాత్రం కోస్తా యాసలో స్పష్టమైన తెలుగు మాట్లాడినట్లు వారు తెలిపారు. దీంతో ఈ తరహా దొంగతనాలు చేసే ముఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని దర్యాప్తు చేపట్టి.. చివరకు ఈ దోపిడీకి పాల్పడింది తెనాలికి చెందిన పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్ అని గుర్తించారు. తాత ముత్తాల నుంచి ఇదే వృత్తి.. దీంతో ఈ ముఠా సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారు? అని పరిశోధించగా చివరకు తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామంలో పాల శివ, అతని కుమారుడు పాల వేణు, తమ్ముడు పాల లక్ష్మినారాయణ, పెనుమాక మహేష్, మేకల ఏసు, దొడ్డి పోతురాజులు అద్దెకు ఇల్లు తీసుకుని జీవిస్తున్నట్లు గుర్తించారు. దోపిడీ వీరి పనేని తేలడంతో పోలీసులు వారిలో ఐదుగురిని అరెస్టు చేయగా పాల లక్ష్మినారాయణ పరారీలో ఉన్నాడు. పాల శివపై 35 వరకు దోపిడీ కేసులు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పక్కా రెక్కీ.. అనంతరమే దోపిడీ.. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి సమయాల్లో కోళ్లు, గొర్రెలు, మేకలు, బడ్డీ కొట్లు వంటి చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడే ఈ ముఠాకు పాల శివ నేతృత్వం వహిస్తాడు. కాటూరు గ్రామంలో నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రజనీకాంత్ ఇంటిని టార్గెట్‌గా చేసుకున్నారు. రెక్కీ నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో అందరూ పాల శివ ఆటోలో బయలుదేరి వెళ్లారు. ఆటోను రజనీకాంత్ ఇంటి సమీపంలో ఉన్న కోళ్లఫారం దగ్గర ఉన్న వెంచర్లో పార్క్ చేశారు. ఆ తర్వాత రజనీకాంత్ ఇంటి ప్రహరీ గోడను దూకి మొదట గునపంతో తలుపు తీయడానికి యత్నించారు. సాధ్యపడకపోవడంతో ఇంటి వెనుకవైపు ఉన్న పెద్ద బండరాయితో తలుపును బద్ధలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. -
గుట్టుగా గం‘జాయ్’!
ఎక్కడో పుడుతుంది.. ఎక్కడో పెరుగుతుంది.. ఊరిలోకి వస్తుంది.. తైతక్కలాడిస్తోంది! అదే గ‘మ్మత్తు’ గంజాయి. మన్యం ప్రాంతాల్లో సాగవుతూ రాష్ట్రం అంతటా రవాణా అవుతూ.. యువతను తనకు బానిసలుగా మార్చేసుకుంటోంది. దీనిని అరికట్టాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండటంతో తేలిగ్గా పాగా వేస్తోంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో గంజాయి దందా మూడు దమ్ములు.. ఆరు కిక్కులు అన్న చందంగా సాగిపోతోంది. అంతేకాక ఇతర ప్రాంతాల రవాణాకూ నగరమే అడ్డాగా మారుతుండటం ఆందోళన కల్గిస్తోంది. సాక్షి, అమరావతిబ్యూరో: ఉత్తరాంధ్ర, తెలంగాణలోని దండకారణ్యం నుంచి గంజాయి బెజవాడను ముంచెత్తుతోంది. నగరంలో అనూహ్యంగా పట్టుబ డుతున్న గంజాయి పోలీసులను ఉలికిపాటుకు గురిచేస్తోంది. ఇన్నాళ్లు గుట్కా, నకిలీ నెయ్యి, కాల్‌మనీ కేసుల విచారణకే పరిమితమైన సిటీ పోలీసులకు గంజాయి మాఫియా సవాల్‌గా మారింది. కృష్ణలంక, వన్‌టౌన్, టూటౌన్, రైల్వేస్టేషన్, బస్టాండు ప్రాంతాల్లో పనిపాటలేనివాళ్లు గంజాయి సేవనం నిత్యకృత్యం. రూ. పాతిక ఇస్తే చిటికెడు గంజాయిని పొట్లాల్లో విక్రయిస్తుంటారు. చెత్త ఏరేవారు, యాచకులు, రిక్షా, ముఠాకూలీ కార్మికులు, నదిగట్లపై బైరాగులు గంజాయికి నిత్య వినియోగదారులు. వివిధ రూపాల్లో దీనిని వినియోగిస్తూ మత్తులో తేలిపోతుంటారు. యువత చిత్తు.. సాధారణ యువత, విద్యార్థులు సైతం ఇటీవల సంవత్సరాల్లో గంజాయికి దాసోహమవుతున్నారు. గతేడాది కాలంలో నగరంలో గంజాయి కొనుగోలు చేస్తూ కొందరు.. గంజాయిని విక్రయిస్తూ కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులకు నగర పోలీసులకు పట్టుపడ్డారు. అలాగే ఇటీవల ఇద్దరు పోలీసు అధికారుల కుమారులు విశాఖ నుంచి గంజాయి తెస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఇలా నగర శివార్లలో ఉన్న కళాశాలల్లో చాలా మంది విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు సమాచారం. దీంతో గంజాయి విక్రేతలు నగరంలోని కాలేజీల వద్దే విక్రయాలు సాగిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా పోలీసులు పెద్దగా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. నగరంలో జరిగే చెల్లర నేరాలకు గంజాయే కారణం. బ్లేడుబ్యాచ్లకు ప్రధాన మత్తు ఆదాయ వనరు ఇదే. విశాఖపట్నం అటవీ ప్రాంతాల నుంచి తక్కువ రేటుకు తెప్పించి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తుంటారు. ఇందులో ఆధిపత్య పోరు తరచూ కొట్లాటలు, కొన్నిసార్లు హత్యలకు దారితీస్తోంది. జాతీయ రహదారిపై దర్జాగా.. తాజాగా పట్టుబడిన గంజాయి.. నగరం దీని రవాణాకు ఒక కేంద్రంగా మారిందనేది చెబుతోంది. ఏలూరు మీదుగా విజయవాడ, గుంటూరుకు, అటు నుంచి హైదరాబాద్‌కు, బెంగళూరు, చెన్నైలకు గంజాయి నిత్యం పెద్ద మొత్తాల్లో అక్రమ రవాణా అవుతోంది. పండ్లు, కూరగాయలు, కొబ్బరికాయలు, ఇతరత్రా వస్తువుల లోడ్ల కింద గంజాయిని దాచి జిల్లాలను దాటిస్తున్నారు. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి పొడవునా ఉన్న రవాణా, పోలీసు, వాణిజ్య పన్నుల చెక్‌పోస్టుల్లో నిర్లక్ష్యం, అవినీతి వల్ల పట్టుబడడం చాలా తక్కువ. గంజాయి ఘాటైన వాసన వస్తుంది. కాబట్టి దానిని పకడ్బందీగా ప్యాక్ చేసి ట్రక్కులు, మినీ లారీల్లో సరుకుల కింద ఉంచుతారు. అంత లోతుగా తనిఖీ చేసే ఓపిక లేక, లేదా భారీ ముడుపులకు లొంగిపోయిన సిబ్బంది వీటిని వదిలేస్తున్నారు. ఉత్తరాంధ్ర అడవుల్లో గంజాయి అక్రమంగా సాగవుతోంది. అక్కడ కిలో రూ. ఐదు వేలు పలికే గంజాయి మెట్రో నగరాల్లో రూ. 60 వేలకు చేరుతుంది. స్థావరంగా బెజవాడ! మెట్రో నగరాల సంగతి పక్కన పెడితే విజయవాడ గంజాయి నెట్వర్క్ సురక్షిత స్థావరంగా ఉందన్నది తాజా ఘటనల సారాంశం. వన్‌టౌన్, భవానీపురం, ఇబ్రహీపట్నం, లారీ టెర్మినల్, పటమట, పెనమలూరు ప్రాంతాల్లో గంజాయి మాఫియా గోదాములు నిర్వహిస్తోన్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో గోదాములపై ఎలాంటి నిఘా లేదు. వివిధ సరుకుల మాటున తెప్పించే గంజాయిని ఇక్కడే నిల్వ చేసి కావలసిన వ్యక్తులకు, ప్రదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసు వర్గాల అనుమానం. ముడి గంజాయిని ఇక్కడ శుభ్రంగా ప్రాసెస్ చేసి చిన్న చిన్న ప్యాకెట్లలో ఇతర ఉత్పత్తుల మాటున నగరాలకు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇక నిత్య రైళ్లు, బస్సుల్లో ఉత్తరాంధ్ర నుంచి ట్రావెల్బ్యాగుల్లో తెచ్చి విక్రయించే వ్యక్తులకు లెక్కలేదు. నిఘా పెట్టాం.. విజయవాడలో గంజాయి విక్రయ ముఠాల కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టాం. ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇక్కడకు గంజాయి సరఫరా అవుతోంది. అక్కడి మూలాల్ని గుర్తించే పనిలో ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ విక్రయదారులను కట్టడి చేసే పనిలో ఉన్నాం. విజయవాడ కేంద్రంగా హైదరాబాద్, చెన్నై నగరాలకు గంజాయి సరఫరా అవుతోందని గుర్తించాం. సిటీ పోలీసులకు అందుతున్న సమాచారం మేరకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ గంజాయిని పట్టుకుంటున్నారు. శనివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆర్టీసీ బస్టాండ్‌లో రెండు బ్యాగుల ద్వారా తరలిస్తున్న 15 కిలోల గంజాయిని పట్టుకున్నారు. శుక్రవారం సైతం 27 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.– ద్వారకా తిరుమలరావు,నగర పోలీసు కమిషనర్, విజయవాడ -
పద్మావతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో భవానీపురం పోలీసుస్టేషన్ పరిధిలో హత్యకు గురైన యేదుపాటి పద్మావతి హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. గత నెల 31వ తేదీన పట్టపగలే ఆమెను హత్య చేసి నగలు దొంగతనం చేయడాన్ని సవాలుగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ నాలుగు పోలీసు ప్రత్యేక బృందాలను దర్యాప్తుకు ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణా ల్లో జల్లెడ పట్టి చివరకు హంతకుడి ఆచూకీ కనుగొన్నట్లు సమాచారం. పక్కా ప్రొఫెషనల్.. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు లభించకుండా కారం చల్లడం.. చేతి వేలిముద్రలు కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి గమనించిన ఇది పక్కా ప్రొఫెషనల్ పనిగా భావించి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు సాగించారు. దొంగతనానికి వచ్చిన ఆగంతకుడు క్షణాల వ్యవధిలో పని ముగించుకొని వెళ్లడానికి వచ్చాడని తెలుస్తోంది. అందువల్లే ఆమె మెడలో ఉన్న గొలుసు, నల్లపూసల దండ, చేతికి ఉన్న నాలుగు గాజులను మాత్రమే తీసుకెళ్లడం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పెనుగులాటతో హత్య.. పక్కాగా రెక్కీ చేసికుని దొంగతనానికి వచ్చిన ఆగంతకుడికి.. మృతురాలు పద్మావతికి మధ్య తీవ్ర పెనుగులాట జరిగినట్లు ఆధారాలు చెబుతున్నాయి. జనవరి 31వ తేదీన చివరగా మృతురాలు, ఆమె భర్త వెంకటేశ్వర్లు స్థానికంగా ఉన్న అమ్మపాద అపార్ట్మెంట్ జరిగిన ఫంక్షన్‌కు హాజరై ఇంటికొచ్చారు. ఆ తర్వాత ఆమె భర్త పనిపై బయటకు వెళ్లిపోయారు. ఈ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగను చూసిన పద్మావతి తీవ్రంగా ప్రతిఘటించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. చివరకు ఆమె అరుపులతో చుట్టుపక్కల వారు వస్తే తన పనైపోతుందనే కారణంతోనే దొంగ పద్మావతిని హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు వినియోగించిన ఆయుధం కూడా అతనిదేనని పోలీసు లు అంచనాకు వచ్చినట్లు సమాచారం. పక్క జిల్లాలకు పరారీ.. సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర సాంకేతిక అంశాల ఆధారంగా పోలీసులు నిందితుడి ఆచూకీని కనుగొన్నట్లు సమాచారం. అతనిది విజయవాడేననీ.. హత్య చేసి నగలు దోచుకున్న వెంటనే నగరాన్ని వీడి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతాల్లోనూ తలదాచుకున్నట్లు సమాచారం. ఆ తరువాత ఏలూరు తదితర ప్రాంతాల్లోనూ తిరిగినట్లు పోలీసులు గుర్తించారు.సాంకేతిక అంశాల ఆధారంగా చివరకు నిందితుడిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఏమార్చి.. రూటు మార్చి..
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో లిక్కర్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ దుకాణం నుంచే లిక్కర్ తరలించుకుపోతోంది. ఆదివారం విజయవాడ నగరంలో ప్రభుత్వ మద్యం షాపు నుంచి ఓ ప్రైవేటు బార్ యాజమాన్యం సరుకును తరలించింది. పట్టపగలే ఈ తంతు జరిగినా ఆ ప్రభుత్వ మద్యం షాపుకు కూతవేటు దూరంలో ఉన్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఇటువంటి ఘటనలు జరుగుతున్నా.. ఎక్సైజ్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో బెజవాడలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతోందన్న విమర్శలున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం ఎక్సైజ్ యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లావ్యాప్తంగా గతంలో ఉన్న 344 షాపులను కుదించి వాటి స్థానంలో 275 మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అందులో విజయవాడ పరిధిలో 135 ప్రభుత్వ షాపులు.. మచిలీపట్నం పరిధిలో 140 ప్రభుత్వ మద్యం షాపులు ఉన్నాయి. ఇవే కాకుండా మరో 148 బార్ అండ్ రెస్టారెంట్లను ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వమే ఏపీఎస్‌బీసీఎల్ గోదాముల నుంచి మద్యం విక్రయిస్తోంది. అయితే ప్రభుత్వ మద్యం షాపులకు, బార్ అండ్ రెస్టారెంట్లకు విక్రయించే మద్యం ధరల్లో వ్యత్యాసం చాలా ఉంది. దీంతో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు కొందరు ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే వారితో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమంగా తరలింపు.. విజయవాడ నగరం టిక్కిల్ రోడ్డులో గత నెల 21న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని(06449) ఎక్సైజ్ అధికారులు ప్రారంభించారు. గతంలో ఇక్కడ హాంగోవర్ పేరిట సూపర్ మార్కెట్ తరహాలో ఓ ప్రైవేటు మద్యం దుకాణం ఉండేది. ఆ షాపు నిర్వాహకులకు నగరంలో పలు బార్లు కూడా ఉన్నాయి. గతంలో హాంగోవర్లో పనిచేస్తున్న సిబ్బందినే ప్రస్తుత ప్రభుత్వ మద్యం దుకాణంలో నియమించారు. వీరందరూ కుమ్మక్కై ఆదివారం మధ్యాహ్నం 1.40 గంట సమయంలో 06449 నంబరు మద్యం షాపునకు సంబంధించిన బీరు, మద్యం బాటిళ్ల బాక్స్‌లను ఆటోలో లోడు చేస్తున్న దృశ్యం ‘సాక్షి’ కంట పడింది. అనుమానంతో సాక్షి ప్రతినిధి ఆ ఆటోను అనుసరించగా ఆ ఆటో నేరుగా పంట కాలువ రోడ్డులోని ‘చిల్లీస్ రెస్టారెంట్ అండ్ బార్’ వద్ద ఆగింది. అనంతరం ఆటోలో ఉన్న మద్యాన్ని దించి బార్లోకి తరలించారు. మద్యం షాపు వద్ద లోడు నింపిన దగ్గర నుంచి బార్ వద్ద లోడును దించిన దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. ఈ తరలింపు తంతు కేవలం అరగంటలోపు పూర్తి చేశారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ప్రభుత్వ మద్యం షాపు నుంచి సరుకును ఒక బార్ అండ్ రెస్టారెంట్‌కు తరలిస్తున్నా ఎక్సైజ్ అధికారులు గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కఠిన చర్యలు ఉంటాయ్.. ప్రభుత్వ మద్యం దుకాణంలో ఉన్న సరుకును ఎవరైనా బెల్టు షాపులకు కానీ, బార్ అండ్ రెస్టారెంట్లకు కానీ విక్రయించరాదు. అలా చేస్తే దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. అలాగే కొనుగోలు చేసిన బార్ యజమానులపై కఠినంగా వ్యవహరిస్తాం. బార్‌ను సీజ్ చేస్తాం. రూ.లక్ష వరకు జరిమానా విధిస్తాం. – మురళీధర్, ఎక్సైజ్ డీసీ, కృష్ణా జిల్లా -
చిన్నారిపై లైంగిక దాడికి యత్నం!
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): గొల్లపాలెంగట్టు జోడు బొమ్మల సెంటర్లో ఓ చిన్నారిపై యువకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సేకరించిన వివరాల ప్రకారం వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం జోడు బొమ్మల సెంటర్లో ఉన్న బంధువుల ఇంటికి వచ్చింది. మూడేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వెనుక నడుచుకుంటూ వస్తుండగా, జోడుబొమ్మల ప్రాంతానికి చెందిన ఎం. ఉదయ్కికణ్ ఆ చిన్నారిని ఆడిస్తున్నట్లు నటిస్తూ చీకటి సందులోకి తీసుకెళ్లాడు. తమతో పాటు వస్తున్న చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెనక్కి వెళ్లి చూశారు. అయితే, చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ యువకుడు కనిపించాడు. దీంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని కొత్తపేట సీఐ ఎండీ ఉమర్ తెలిపారు. -
ప్రియుడే కాల యముడయ్యాడా..?
కృష్ణాజిల్లా, కలిదిండి (కైకలూరు): కలిదిండి శివారు బరింకలగరువు గ్రామ నివాసి కటికతల కృపారాణి (25) హత్యోదంతంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు మౌనం వీడక పోవడంతో బంధువులు, గ్రామస్తులు, దళిత సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఉప్పుటేరులో శుక్రవారం శవమై తేలిన కృపారాణి హత్యకు గురైందని, నిందితులను పట్టుకుంటామని గుడివాడ డీఎస్పీ ఎన్. సత్యానందం ప్రకటించి రెండు రోజులు గడుస్తోంది. శనివారం రాత్రి కృపారాణి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా రాత్రివేళ ఖననం చేశారు. కాగా దీనిపై తల్లిదండ్రులు బుజ్జి, ఏసమ్మను ప్రశ్నించగా వారు కొన్ని వివరాలను అందించారు. ఆ వివరాల మేరకు.. భర్తకు దూరమైన తర్వాత ఇందిరాకాలనీకి చెందిన అజయ్ (30) అనే వివాహితుడితో కృపారాణి సహ జీవనం చేస్తోంది. అతను స్థానిక చికెన్ సెంటర్లో పని చేసేవాడు. ఇందిరా కాలనీలో నివసించే అతను భార్యపిల్లలను పట్టించుకోకపోవడంతో వారు విజయవాడ వెళ్లిపోయారు. కృపారాణి కూడా ఇందిరా కాలనీలో అద్దెకు ఉంటూ అతనికి దగ్గరైంది. ఏడాది కాలంగా వీరి పరిచయం కొనసాగింది. రెండు నెలలుగా అజయ్‌కి కృపారాణి దూరంగా ఉంటోంది. అయితే, కృపారాణి అత్తవారి గ్రామమైన కొత్తపల్లిలో అజయ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఇక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆమె తరచూ కృపారాణికి ఫోన్ చేసి అజయ్‌ని వదిలేయక పోతే నిన్ను భూమి మీద లేకుండా చేస్తానని హెచ్చరించేది. కృపారాణి హత్యకు ముందు మూడు రోజుల నాడు అంటే మంగళవారం కూడా కృపారాణి ఇంటికి అజయ్ వచ్చాడు. ఆ తర్వాత ఘటన జరగడంతో ఈ హత్యలో అజయ్ ప్రమేయం ఉంటుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలియజేసినట్లు చెప్పారు. మృతురాలి పిల్లలు, తల్లిదండ్రులు పలు అనుమానాలు.. ఇదిలా ఉండగా హత్యకు ముందు రోజు గురువారం సాయంత్రం కృపారాణి ఆటోలో ఏలూరుపాడు బట్టల షాపునకు వెళ్లిందని, అదే రాత్రి హత్యకు గురైందని, తన కుమార్తెను గ్యాంగ్ రేప్ చేసి, హత్యచేసి ఉంటారని తల్లి ఏసమ్మ ఆరోపించింది. ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ జీవిస్తున్న కృపారాణి దూరం కావడంతో పిల్లలు తట్టుకోలేక పోతున్నారని వాపోయింది. కృపారాణి కొంకేపూడిలో ఉద్యోగం చేస్తోంది. మూడు నెలల క్రితం కుమారుడు శ్యాంబాబు (20) (కృపారాణి తమ్ముడు) అనారోగ్యంతో మృతి చెందగా, పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి (బుజ్జి) ని, తననూ పోషిస్తున్న కృపారాణిని దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారని ఏసమ్మ విలపించింది. ‘హత్య చేయవలసినంత తప్పు కృపారాణి ఏమి చేసిందయ్యా, చిన్నారులకు ఎవరు దిక్కు’ అంటూ కన్నీటి పర్యంతమైంది. కృపారాణి పిల్లలకు, వృద్ధాప్యంలో ఉన్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఏసమ్మ వేడుకుంటోంది. కాగా, కృపారాణి హత్య కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని కలిదిండి ఎస్ఐ జనార్థన్ తెలిపారు. అయితే, ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న అజయ్ కూడా వీరిలో ఉన్నాడని తెలుస్తోంది. -
కొండ మృతదేహం లభ్యం
గుంటూరు, తంగెడ(దాచేపల్లి) : హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ద్విచక్రవాహనానికి కట్టి కృష్ణానదిలో పడవేశారు. మూడు రోజులుగా నదిలో మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు శుక్రవారం మృతదేహం లభ్యమైంది. లభించిన మృతదేహంను మాచవరం మండలం వేమవరానికి చెందిన మాగంటి కొండగా గుర్తించారు. సంఘటన స్థలంను పిడుగురాళ్ల సీఐ సురేంద్రబాబు, మాచవరం ఎస్ఐ లక్ష్మీనారాయణరెడ్డి సందర్శించారు. కొండ అదృశ్యంపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పలువురిని పోలీసులు విచారణ చేయగా కొండను హత్యచేసి తంగెడ కృష్ణానదిలో పడవేసినట్లు అంగీకరించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు కృష్ణానదిలో గత మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేసిన మృతదేహం ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో తంగెడలో ఉన్న మత్యకారుల సహకారాన్ని పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ తీసుకున్నారు. నదిలో ఉన్న మృతదేహంను గుర్తించేందుకు మత్యకారులు ప్రత్యేకంగా లంగర్లు తయారు చేయించారు. శుక్రవారం ఉదయం తంగెడ కృష్ణానది బ్రిడ్జికి తూర్పువైపు 65 అడుగుల లోతులో ఐదుసార్లు లంగర్లు వేసినా ఆచూకీ లభించలేదు. ఆరోసారి లంగరు నదిలోకి వదలటంతో తీగెలాగుతుండగా బరువు తగిలినట్టుగా గుర్తించారు. లంగరు జారిపొకుండా పటిష్టపరచి బయటకు తీశారు. మృతదేహంను గోతంలో పెట్టి మూటకట్టి ద్విచక్రవాహనంకు కట్టేసి ఉండటాన్ని గమనించారు. ద్విచక్రవాహనంను, మృతదేహంను బయటకు తీశారు. మూటలో కట్టిన మృతదేహం నుంచి తీవ్ర దుర్వాసన వచ్చింది. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు మృతదేహం, ద్విచక్రవాహనంను పరిశీలించారు. కృష్ణానది వద్ద మృతదేహంను శచపంచనామా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లు చుట్టి గోతంలో పెట్టారు. కృష్ణానది వద్దకు చేరుకున్న కొండ కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. -
‘కలసి బతకలేం.. విడిచి ఉండలేం..’
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్): ‘ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నాం.. మా పెళ్లిని సమాజం హర్షించదు. కలసి బతకలేం.. విడిచి ఉండలేం..’ అని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్‌లోని ఓ హోటల్లో చోటుచేసుకుంది. ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గన్నవరం మండలం తెంపల్లికి చెందిన నాగబోయిన గౌతమి (28), వెంట్రప్రగడకు చెందిన లోకేశ్(19) ఇద్దరు సుమారు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. గౌతమి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, లోకేశ్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఇద్దరి మధ్య వయసు తేడా ఉన్నా ప్రేమించుకున్నారు. ఇదిలా ఉండగా క్రిస్మస్కి దుస్తులు కోసమని చెప్పి గురువారం ఉదయం గాంధీనగర్‌లో ఒక హోటల్లో రూం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో షాపింగ్ వెళతామని హోటల్ నిర్వాహకులకు చెప్పి ఆ సమయంలో కాలింగ్ బెల్ పెట్టాలని కోరారు. రాత్రి అయినా వారు గదిలో నుంచి బయటికి రాకపోవడంతో నిర్వాహకులు అనుమానంతో సత్యనారాయణపురం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ బాలమురళీకృష్ణ, ఎస్ఐలు సత్యనారాయణ, విమల ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలకొట్టారు. లోపల వారు మంచంపై గౌతమి విగతాజీవిగా పడిఉండగా, యువకుడు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలం నుంచి యువతిని పోస్టుమార్టానికి తరలించగా లోకేశ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గౌతమి అంత్యక్రియలు పూర్తి తెంపల్లె (గన్నవరం రూరల్): మండలంలోని తెంపల్లెలో శుక్రవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామానికి చెందిన నాగబోయిన గౌతమి (28) విజయవాడలోని లాడ్జిలో విషం తీసుకుని మృతి చెందటం గ్రామస్తులను కలచివేసింది. గ్రామానికి చెందిన రైతు నాగనబోయిన వెంకటరావు కుమార్తె గౌతమి చిన్నతనం నుంచి అందరితో ఎంతో మర్యాదగా నడుచుకునేదని స్థానికులు బెబుతున్నారు. ఎంటెక్ చదివి ఉద్యోగం చేసుకుంటూ ఎంతో వినయంగా ఉండే గౌతమి మృతి చెందటాన్ని బంధువులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంకటరావుకు ఇద్దరు సంతానం కాగా గౌతమి కుమార్తె. ఆమెకు అన్నయ్య ఉన్నాడు. గత నవంబరు నెలలో ఆమెకు నిశ్చితార్ధం జరిగింది. వచ్చే నెల వివాహం చేసేందుకు నిర్ణయించారు. ఇంతలో ఈ విధంగా జరగటంతో గ్రామంలో విషాదం నెలకొంది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో గౌతమి విషం తీసుకుని చనిపోయిందని పోలీసుల ద్వారా తెలుసుకున్న గ్రామస్తులు నివ్వెరపోయారు. హుటాహుటిన విజయవాడకు వెళ్లారు. తెంపల్లెకు సమీపంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోంది. అయితే వివాహం విషయంలో తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులకు నచ్చకపోవటమే గౌతమి మృతికి కారణమైందని పోలీసులు భావిస్తున్నారు. గౌతమి మృతదేహానికి శుక్రవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
బాలికపై రౌడీషీటర్ లైంగికదాడి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాలికపై ఓ రౌడీషీటర్ లైంగిక దాడి చేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయవాడకు చెందిన బాలిక ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి బీసెంట్ రోడ్డుకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఏలూరు రోడ్డులోని రాజ్ టవర్స్ వద్ద ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న గుణదలకు చెందిన రౌడీషీటర్ చిన్నిరాజా(వరుణ్‌కుమార్) బాలికను తన బైక్‌పై ఎక్కించుకు వెళ్లాడు. గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ వెనుక భాగంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి స్నేహితులను ఆరా తీశాడు. బైక్‌పై వెళ్లిందని తెలుసుకుని వెతకడం ఆరంభించాడు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద ఆమె ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆయన అక్కడకు వెళ్లడంతో బాలిక జరిగిన విషయం ఆమె తండ్రికి వివరించింది. బాలిక తండ్రి నేరుగా గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడిపై మాచవరం పోలీసుస్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు, రూ.16 లక్షలు స్వాధీనం
సాక్షి, విజయవాడ: జిల్లాలోని మారుతినగర్ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను విజయవాడ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ... ఈ ముఠాను ప్రసాదరావు అనే వ్యక్తి నిర్వహిస్తుంటాడని తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడైన కళ్యాణ చక్రవర్తితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. మొత్తం 19 మంది ఉన్న ఈ ముఠాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ క్రమంలో వీరినుంచి లెన్త్ బాక్స్, 19 సెల్ఫోన్లు, 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా ఈ లెన్త్ బాక్స్ నుంచి అందరూ కాన్పరెన్స్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతూ.. ప్లేయింగ్, ఈటింగ్, ఫ్యాన్సీ, 48.. 50 అనే కోడ్ భాషతో బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెట్టింగ్‌కు సంబంధించిన మూలాలు పూర్తి స్థాయిలో దొరకలేదని అన్నారు. ఈ బెట్టింగ్ విజయవాడలోనే కాక హైదరబాద్, ముంబైలలో ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారమని అందినట్లు తెలిపారు. ఇక నగదు బదిలీ అంతా ఆన్లైన్ ద్వారా ఎక్కువగా జరుపుతూ చాలా పకడ్బందీగా ఈ బెట్టింగ్ వ్యవహరాన్ని నిర్వహిస్తున్నారని సీపీ తెలిపారు.