
విద్యార్థిని ఆరా తీస్తున్న ఎస్‌ఐ తిరుపతిరావు విద్యార్థి చేతిపై బ్లేడ్‌తో చేసిన గాయాలు
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): ఆడుతూ..పాడుతూ చదువుకోవాల్సిన వయసులో స్కూల్ విద్యార్థులు గ్యాంగులుగా ఏర్పడి తోటి వారిపై దాడిచేసి గాయపరచిన ఘటన విజయవాడ వన్‌టౌన్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్‌కు నాయకుడిగా చెప్పుకుంటున్న విద్యార్థి తన స్నేహితుల సాయంతో షార్ప్‌నర్ బ్లేడ్‌తో దాడిచేసి ఐదుగురు విద్యార్థుల చేతులను గాయపరిచాడు. వన్‌టౌన్ కేటీ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో ఈ ఘటన కొద్దిరోజుల కిందట చోటుచేసుకుంది. పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నానని స్నేహితుల వద్ద చెప్పాడు. ఆ మాట చివరకు స్కూల్‌లో అందరికీ తెలియడంతో బాలిక చదువుతున్న తరగతిలోని విద్యార్థులు ఆ బాలుడిని ప్రశ్నించారు. అంతే కాకుండా విషయాన్ని 9వ తరగతి స్కూల్ టీచర్‌కు తెలియజేశారు. ఈ విషయంపై విద్యార్థిని మందలిండచంతోపాటు మరో మారు ఇటువంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తన ప్రేమ వ్యవహారం బయటకు రావడానికి కారణమైన 8వ తరగతి విద్యార్థులపై కక్షతో 9వ తరగతి విద్యార్థి ఓ గ్యాంగ్‌ను తయారు చేశాడు. 8వ తరగతి విద్యార్థులను పట్టుకుని చేతులపై షార్ప్‌నర్ బ్లేడ్ సాయంతో గాయపరిచారు. విషయం ప్రిన్సిపాల్‌కు చేరడంతో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసిన విద్యార్థిని తల్లిదండ్రులను తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఓ విద్యార్థి తండ్రి ఘటనపై ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొత్తపేట ఎస్‌ఐ తిరుపతిరావు స్కూల్‌కు వచ్చి ఆరా తీశారు. అయితే ఘటనపై పోలీసులకు రాత పూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు రాకపోవడంతో మరో మారు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి తెలిపినట్లు కొత్తపేట సీఐ జె.మురళీకృష్ణ చెప్పారు
Comments
Please login to add a commentAdd a comment