
ఎమ్మెల్యే బోడె, ఎమ్మెల్సీ వైవీబీలతో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీకి చెందిన ఏఎంసీ వైస్‌చైర్మన్ జగరోతు నాగరాజు(సర్కిల్‌లో వ్యక్తి)
అధికార పార్టీ అండ చూసుకుని ఉయ్యూరులో ‘కాల్’ నాగులు రెచ్చిపోతున్నారు.. అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులిచ్చి ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ ప్రజల రక్తం పీలుస్తున్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ వికృత ఉదంతాలకు ప్రధాన కేంద్రంగా నిలిచిన పెనమలూరు నియోజకవర్గంలోనే మళ్లీ ఈ దందా ఊపందుకుంటోంది. అప్పట్లో ఈ వ్యవహారంలో ఈప్రాంత ప్రజాప్రతినిధి పేరు బాహాటంగా వినిపించడంతో సైలెంట్ అయిన ఆయన ఇప్పుడు అనుచరులతో దందాలు నడిపిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి...
కృష్ణా, ఉయ్యూరు: ఉయ్యూరులో కాల్ నాగులు కాటేస్తున్నాయి. అధికార పార్టీ ముసుగులో దందా సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఖాళీ ప్రామిసరీ నోట్లు.. తనఖాలు.. సేల్ డీడ్‌లు.. పెట్టుకుని వడ్డీలు కట్టలేక, తనువ చాలించేందుకు సిద్ధపడుతున్నా కనికరం లేకుండా తమ వద్ద ఉన్న ఆధార పత్రాలతో ఆస్తులను దిగమింగుతున్నారు. విజయవాడలో కాల్‌మనీ కలకలం కనుమరుగవ్వక ముందే ఉయ్యూరులో కాల్‌మనీ బాధలతో టెలీఫోన్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి రాంబాబు కుమార్తె ప్రశాంతి చెప్పిన పేర్లు, పోలీసులకు రాసిచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఒకప్పటి అనుచరుడు, ప్రస్తుతం ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఏఎంసీ మాజీచైర్మన్ వల్లభనేని నాని ముఖ్య అనుచరుడు ఏఎంసీ వైస్‌చైర్మన్‌గా ఉన్న జరగోతు నాగరాజుతో పాటు కొందరి టీడీపీ నేతల పేర్లు ఉండటంతో కాల్ మనీలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల బండారం మరోసారి బట్టబయలైంది. టీడీపీ నేతల దందాపైనే సర్వత్రా చర్చ నడుస్తుంది.
నూటికి రూ.20 వడ్డీ..
ఉయ్యూరు పట్టణం కేంద్రంగా వడ్డీ వ్యాపారం జోరుగా జరుగుతుంది. నూటికి ఏకంగా రూ.10ల నుంచి రూ.20ల వరకు నూటికి వడ్డీలు వసూలు చేస్తూ పేదలు, వ్యాపారులు, ఉద్యోగుల సొమ్ము కొల్లగొట్టేస్తున్నారు. దాదాపు 50 మందికిపైగా వడ్డీ వ్యాపారులు పట్టణంలో వ్యాపారం సాగిస్తూ కోట్లు గఢించారు. వీరిలో 20 మంది నలుగురు ముగ్గురు కలిసి ఒక సిండికేట్‌గా ఏర్పడి కాల్‌మనీకి డబ్బులిచ్చి సెక్యూరిటీ కింద ఆస్తుల్ని సేల్ డీడ్ చేయించుకుంటున్న భయానక పరిస్థితి. వడ్డీకి తీసుకున్న ఏ వ్యక్తి అయినా సరే జీవితాంతం వడ్డీ తీర్చడంతోనే సరిపోతుంది. ఎన్నేళ్లు చూసినా అసలు అలాగే మిగిలిపోతుంది. కొంతమంది అధికార పార్టీలో ముఖ్యనేతలకు వడ్డీ వ్యాపారులు నజరానాలు ముట్టచెబుతూ తమ అక్రమ సామ్రాజ్యానికి అడ్డంలేకుండా దారులు వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈకాల్ నాగుల వెనుక టీడీపీలోని ఒకరిద్దరు ముఖ్యనేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పోలీసులకు కూడా నెలవారీ మామూళ్లు ముట్టచెబుతూ ప్రసన్నం చేసుకుంటుండబట్టే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
మరకలు అంటకుండా..!
కాల్‌మనీ వ్యవహారం వేడెక్కడంతో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌లు తీవ్రంగా స్పందించారు. పోలీస్ అధికారులకు ఫోన్‌చేసి ఎవరు కాల్‌మనీ దందాకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఆదేశించారు. కాగా, కాల్‌మనీ మరకలు తమకు అంటకుండా ఉండేందుకే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారే తప్ప, చిత్తశుద్ధి లేదని ప్రజలు, ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment