షంషుద్దీన్ కుటుంబం (ఫైల్)
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): నవ మాసాలు కనిపెంచిన తల్లి దూరమైందనే ఆవేదన... ఇన్ని నాళ్లు తన ఆలనా పాలనా చూసిన తల్లి విగత జీవిగా పడి ఉండటం ఆ బాలుడిని కలచి వేసింది. తల్లి లేని జీవితం వద్దనుకుని ఇంటిలోకి వెళ్లి బంగారం శుద్ధి చేసే రసాయనాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో వారం రోజులలో పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్న ఆ కుటుంబంలో ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. రోజు వ్యవధిలోనే తల్లీ, బిడ్డ ఆత్మహత్యకు పాల్పడటంతో కాలనీలో విషాదం నెలకొంది. ఈ ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్సార్ కాలనీ బ్లాక్ నెం: 134కు చెందిన షేక్ షంషుద్దీన్, కరీమా భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు నూరుద్దీన్ (16) భవానీపురం నేతాజీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆర్థిక పరిస్థితులు, లాక్‌డౌన్‌కు ముందు పెద్ద కుమార్తె రుకియాకు వివాహం చేయడం, రెండు నెలలుగా పనులు లేకపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కరీమా ఆందోళన చెందుతూ వస్తుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆమె బంగారం మెరుగు పెట్టే రసాయనాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడింది.(ఎంత పనిచేశావు తండ్రీ!)
తల్లి మరణం తట్టుకోలేక...
తల్లితో ఎంతో ప్రేమగా, అప్యాయతగా ఉండే నూరుద్దీన్ తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయాడు. సోమవారం తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించగా.. తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యాడు. తెల్లవార్లు కన్నీరుమున్నీరుగా విలపించాడు. మంగళవారం ఉదయం తల్లి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండటంతో తండ్రి, ఇతర బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఇంట్లో తన ఇద్దరు అక్కలతో ఉన్న నూరుద్దీన్‌కు మధ్యాహ్నం సమయంలో తల్లి మృతదేహం ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువస్తున్నారనే విషయం తెలిసింది. దీంతో ఇంటిలోని బాత్‌రూంలోకి వెళ్లి తల్లి తాగిన రసాయనాన్ని తాను కూడా తాగి బయటకు వచ్చాడు. కొద్దిసేపటికే నూరుద్దీన్ నోటి నుంచి నురగలు రావడంతో ఇంటిలో ఉన్న ఇద్దరు అక్కలు వెంటనే తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్పటికే మార్గమధ్యంలో ఉన్న వారు కరీమా మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వచ్చే సరికి నూరుద్దీన్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే నూరుద్దీన్‌ను భవానీపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే నూరుద్దీన్ మృతిచెందాడు. (సడలింపులు.. ‘తొలి’ కేసు )
తల రాతను మార్చిన ప్రమాదం..
ముగ్గురు పిల్లలు, చేతి నిండా పని, ఎంతో సంతోషంగా ఉండే ఆ కుటుంబాన్ని గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం వారి గతినే మార్చేసింది. గత ఏడాది షంషుద్దీన్ భార్యతో కలిసి మచిలీపట్నం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో భార్యభర్తలిద్దరికి గాయాలు కావడంతో చికిత్స చేయించుకున్నారు. ప్రమాదం కారణంగా భార్యకు మానసిక పరిస్థితి సరిగా ఉండకపోవడంతో వైద్యం చేయిస్తున్నారు. అప్పటి నుంచి అప్పులు, మానసిక ఆందోళనలు పెరిగిపోయాయి. ఇటీవల పెద్ద కుమార్తెకు రుకియాకు వివాహం చేశారు. వివాహానికి అప్పు చేయడం, మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పాటు రెండు నెలలుగా పనులు లేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో కుటుంబ పరిస్థితిపై ఆందోళన చెందుతూ వస్తోంది. ఇప్పుడు రెండు మరణాలు ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment