వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీలక్ష్మి, పక్కన సీఐ రాజేష్‌కుమార్, సర్కిల్‌లో నిందితులు
తెనాలి రూరల్: తెలిసీ తెలియని వయసులో పెళ్లి, తెలియనితనంతో వేసిన తప్పటడుగు ఓ బాలిక జీవితాన్ని అంధకారం చేసింది. ప్రియుడితో కలసి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకునే సమయం మించిపోవడంతో స్నేహితురాలి ఇంటికి వెళ్లే క్రమంలో మరో ఇద్దరు మృగాళ్లకు చిక్కి రెండు వారాలకుపైగా నరకం అనుభవించింది. చివరకు వారి నుంచి తప్పించుకుని బయటపడి పోలీసులను ఆశ్రయించింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా తెనాలి సబ్–డివిజనల్ కమాండ్ కంట్రోల్‌లో మంగళవారం డీఎస్పీ కె.శ్రీలక్ష్మి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని ముత్తెంశెట్టిపాలేనికి చెందిన 14 ఏళ్ల బాలికకు తండ్రి మరణించడంతో ఏడాదిన్నర క్రితం కర్లపాలెం మండలం కట్టవాద గ్రామానికి చెందిన యువకుడితో తల్లి వివాహం జరిపించింది.
అక్కడ బాలికకు భర్త ఇంటి సమీపంలో ఉండే నూతలపాటి నవీన్‌కుమార్ అలియాస్ నవీన్ పరిచయమయ్యాడు. జూలై 25న బాలికను ఆమె భర్త తెనాలిలోని పుట్టింట్లో వదిలి వెళ్లాడు. మరుసటి రోజు మధ్యాహ్నం తెనాలి వచ్చిన నవీన్, బాలికను తన మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని, అమృతలూరు మండలం యలవర్రు సమీప పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి, రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తెనాలి వైకుంఠపురం వద్దకు తీసుకొచ్చి వదిలి వెళ్లాడు. అప్పటికే ఆలస్యమైందన్న భావనతో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు అర్ధరాత్రి ప్రాంతంలో బాలిక ఆటోలో పేరేచర్లకు చేరుకుంది.
ఆటో దిగిన ఆమెను గుంటూరుకు చెందిన హోంగార్డు (గుంటూరు అర్బన్ జిల్లా డాగ్ స్క్వాడ్) అశోక చక్రవర్తి, అతని మిత్రుడు దుర్గారావు గమనించారు. బాధితురాలి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఆమె నిరాకరించింది. దీంతో తాను హోంగార్డునని అశోకచక్రవర్తి తన ఐడీ కార్డు చూపించి వివరాలు తెలుసుకున్నాడు. ఆమెకు ఆశ్రయం కల్పిస్తామని ఇద్దరూ చెప్పి తమ వెంట గుంటూరు తీసుకెళ్లి, దుర్గారావు ఇంట్లో కొద్ది రోజులు, మరో అద్దెకు తీసుకున్న గదిలో మరికొన్నాళ్లు ఆమెను నిర్బంధించి, సుమారు రెండు వారాలకు పైగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
కుమార్తె ఆచూకీ తెలియని ఆమె తల్లి ఈ నెల 11న తెనాలి వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. మృగాళ్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక తెనాలి చేరుకుని, ఈ నెల 13న పోలీసులను ఆశ్రయించి, తనకు జరిగిన ఘోరాన్ని వివరించింది. అప్పటికే వివాహిత అదృశ్యం కేసును వన్‌టౌన్ పోలీసులు నమోదు చేయగా, బాలిక ఫిర్యాదుతో దాన్ని కిడ్నాప్, లైంగిక దాడి సెక్షన్ల కింద మార్చి డీఎస్పీ శ్రీలక్ష్మి దర్యాప్తు చేశారు. సీఐ ఎం.రాజేష్‌కుమార్, మహిళా ఎస్‌ఐ అనంతకృష్ణ నిందితుల అచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల్లో ఒకడైన నవీన్‌ను పెదరావూరు జంక్షన్ వద్ద 17న, మరో ఇద్దరు నిందితులు అశోకచక్రవర్తి, దుర్గారావును గుంటూరు బీఆర్ స్టేడియం వద్ద మంగళవారం అరెస్టుచేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment