మహిళలు, యువతుల రక్షణకు ఎన్ని చట్టాలు చేసినా ఆకతాయిల ఆగడాలు ఆగడంలేదు. వారు ఇంటా, బయటా,ఆఫీసులో, కళాశాలలో, అడుగడుగునా వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా
విజయవాడ నగరంలో పోకిరీల చేష్టలు మితిమీరిపోతున్నాయి. స్కూళ్లు, కళాశాలలకువెళ్లే యువతులే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. వీరినిఅదుపు చేసేందుకు పోలీసులుఅన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా.. పరిస్థితి అదుపులోకిరావడం లేదు. మరోవైపు ఈవ్‌టీజింగ్ కేసుల్లో ఎక్కువగామైనర్లే పట్టుబడుతుండటంఆందోళన కల్గించే అంశం.
సాక్షి, అమరావతి బ్యూరో : బెజవాడ నగరంలో ఆకతాయిల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. పోకిరీల ఆటకట్టించి, కటకటాల వెనక్కి నెట్టడానికి ఏపీ పోలీస్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘శక్తి’ బృందాలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ వేధింపులు జరుగుతూనే ఉన్నాయి.
మఫ్టీలో పోలీసులున్నా..
బస్టాపులు, రైల్వేస్టేషన్, స్కూల్స్, కాలేజీలు, మాల్స్ తదితర ప్రాంతాల్లో మహిళలను, అమ్మాయిలను వేధిస్తున్న పోకిరీలు, ఈవ్‌టీజింగ్ చేస్తున్న ఆకతాయిల బెడద ఇటీవల ఎక్కువైంది. దీంతో పోలీసులు మఫ్టీలో ఉంటూ ఇలాంటి ఆకతాయిలఆటకట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలో కమిషనరేట్ పరిధిలో వేధింపులకు గురవుతున్న మహిళలు వెంటనే పోలీసులను ఆశ్రయించడానికి, ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేక వాట్సాప్ నంబరు అమల్లోకి తెచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల శక్తి బృందాలు, పోలీసులు అరెస్టు చేస్తున్న పోకిరీలు, ఆకతాయిల్లో ఎక్కువగా మైనర్లే పట్టుబడుతున్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న పోలీసులు తల్లిదండ్రులను స్షేషన్‌కు పిలిపించి వారి సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
బాలికలను టీజింగ్ చేస్తున్న మైనర్లు..
బెంజి సర్కిల్ సమీపంలోని ప్రైవేటు కళాశాల ల విద్యార్థినులు సాయంత్రం అక్కడి బస్టాపులో ఇళ్లకు వెళ్లేందుకు వేచి ఉంటున్నారు. ఈ సమయంలో అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద కొందరు పోకిరీలు అమ్మాయిలను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటీవల కొందరు అమ్మాయిలు ధైర్యం చేసి వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. క్షణంలో తప్పించుకుని బైక్‌పై ఉడాయించారు. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, మొగల్రాజపురం, వన్‌టౌన్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి పోకిరీల బెడద రోజు రోజుకూ పెరుగుతోంది. వీరి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు వేడుకుంటున్నారు.
‘శక్తి’కి ఇటీవల వచ్చిన ఫిర్యాదులు..
⇔ కళాశాలకు వచ్చి, వెళ్లే సమయాల్లో కొందరు అబ్బాయిలు మమ్మల్ని టీజింగ్ చేస్తున్నారంటూ బీఆర్‌టీఎస్ రహదారిలో పెట్రోలింగ్ చేస్తున్న ‘శక్తి’ టీం సిబ్బందికి శారదా కళాశాల విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. మరుసటి ఉదయం కళాశాల వద్ద ‘శక్తి’ బృంద సభ్యులు కాపు కాసి అమ్మాయిలకు ఇబ్బంది కల్గిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకుని.. కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
⇔ సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్‌వద్ద కొందరు పోకిరీలు అమ్మాయిలను వేధిస్తున్నారంటూ ఓ పౌరుడు వాట్సాప్‌కు మెస్సెజ్ చేశాడు. దీనికి స్పందించిన ‘శక్తి’ బృందం సభ్యులు మఫ్టీలో స్కూల్‌వద్ద నిఘా పెట్టి ఈవ్‌టీజింగ్ చేస్తున్న 5 మంది మైనర్లను అదుపులోకి తీసుకుని.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.
626 మందికి కౌన్సెలింగ్
ఆరు నెలల కాలంలో మహిళ రక్షణ విభాగం పోలీసులు 626 మంది ఈవ్‌టీజర్లకు కౌన్సిలింగ్ ఇవ్వగా.. గత ఏడాది డిసెంబర్ 12న నుంచి శక్తి బృందాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ఈ బృందా లు వచ్చాక విజయవాడలో సినిమా హాల్స్, పార్కు లు, బస్టాపులు, కృష్ణానది ఘాట్‌లవద్ద తిరుగుతూ మహిళలను ఈవ్‌టీజింగ్ చేస్తున్న 190 మందిని అదుపులోకి తీసుకుని వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది.
61 మంది కటకటాలు..
గత రెండేళ్లలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో మహిళలు, విద్యార్థినుల పట్ల, వేధింపులు, అసభ్యం, అశ్లీలంగా వ్యవహరించిన కేసులు 1,958 వరకు నమోదు అయ్యాయి. అయితే వీటిలో చాలా వరకు కేసులు భార్యభర్తల మధ్య గొడవలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కేసుల్లో 90 శాతం పైగా రాజీ అయ్యారు. వీటిలో ఈవ్‌టీజింగ్ కేసులు, ఫొక్సో చట్టం కింద నమోదైన కేసులు, రేప్ అనంతరం హత్య చేసిన కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో న్యాయస్థానం 61 మందికి జైలు శిక్ష విధించింది.
Comments
Please login to add a commentAdd a comment