కృష్ణాజిల్లా, కోడూరు (అవనిగడ్డ) : కోడూరు 14వ నెంబర్ పంట కాల్వలో కనిపించిన గుర్తు తెలియని మృతదేహం విజయవాడకు చెందిన గాదె బాజిరెడ్డి (35) దిగా కుటుంబసభ్యులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం బాజిరెడ్డి మృతదేహం కాల్వ వెంట కోడూరుకు కొట్టువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పత్రికల్లో కథనాలు చూసిన బంధువులు ఇక్కడకు వచ్చి మృతుడు బాజిరెడ్డిగా వారు నిర్థారించారు.
ఫైనాన్స్ దగ్గర మొదలైన వివాదం..
కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. విజయవాడ రాణిగారితోటకు చెందిన రామలింగారెడ్డి – తిరుపతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న వాడైన బాలకిషోర్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, బాజిరెడ్డి గుంటూరులోని వెంకట ధనలక్ష్మి ఆటో ఫైనాన్స్‌లో పదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. బాజిరెడ్డికి 11 ఏళ్ల క్రితం బాలకోటేశ్వరితో వివాహం కాగా, వీరికి వెంకటసాయి మణిదీప్‌రెడ్డి (7) అనే కుమారుడు ఉన్నాడు. రెండు నెలల కితం బాజిరెడ్డి ఆటో ఫైనాన్స్ ద్వారా తమ గ్రామానికి చెందిన కుర్రా లక్ష్మణరావుకు ఫైనాన్స్‌లో ఆటోను ఇప్పించాడు. అయితే లక్ష్మణరావు కిస్తీలు సక్రమంగా జమ చేయలేదు. దీంతో లక్ష్మణరావును ఆటో తిరిగి ఇచ్చేయాలని బాజిరెడ్డి కోరాడు. లక్ష్మణరావు ససేమిరా అనడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం లక్ష్మణరావు నేరుగా బాజిరెడ్డి ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. ఆ సమయంలో వీరి మధ్య పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. అడ్డు వచ్చిన బాజిరెడ్డి తల్లి తిరుపతమ్మకు కూడా గాయాలయ్యాయి.
వివాహేతర సంబంధం కూడా కారణమేనా?..
బాజిరెడ్డికి యనమలకుదురు లాకులు సమీపంలోని లక్ష్మీదుర్గాభవానితో వివాహేతర సంబంధం ఉన్నట్లు బంధువులే చెబుతున్నారు. అయితే ఆమెకు రాణిగారి తోటకు చెందిన జినుపల్లి దుర్గారావుతో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్లు బాజిరెడ్డి కుటుంబసభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో బాజిరెడ్డి, దుర్గారావు తరచూ ఘర్షణ పడేవారు. అయితే 15 రోజుల క్రితం బాజిరెడ్డి తనని కొడుతున్నాడంటూ దుర్గాభవాని యనమలకుదురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదంతా జరుగుతుండగా ఈ నెల 25న బాజిరెడ్డి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు కృష్ణలంక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
హత్య చేశారంటూ బంధువుల ఆరోపణ..
ఆటో ఫైనాన్స్ డబ్బులు కట్టమని అడిగినందుకు లక్ష్మణరావు, అతని తల్లి ఆవులమ్మ, లక్ష్మీదుర్గాభవాని, దుర్గారావు సహాయంతో బాజిరెడ్డిని హత్య చేసి కాల్వలో పడవేశారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘర్షణ జరిగినప్పుడు పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీం తో తమ కుమారుడు హత్యకు గురయ్యాడంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. అభం శుభం తెలియని తన కుమారుడికి తండ్రి లేకుండా చేశారంటూ బాలకోటేశ్వరి ఘటనా స్థలిలో రోదించిన తీరు చూపరులను కలచివేసింది.
ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం..
బాజిరెడ్డి మృతదేహాన్ని కోడూరు వీఆర్వో వేణగోపాలరావు ఫిర్యాదు మేరకు కాల్వలో నుంచి పోలీస్ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. ఘటన కృష్ణలంక పీఎస్‌కు సంబంధించింది కావడంతో వారికి కేసును రిఫర్ చేసినట్లు ఇక్కడి ఎస్‌ఐ ప్రియకుమార్ చెప్పారు. దీంతో కృష్ణలంక ఎస్‌ఐ శ్రీనివాస్ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రి సూపరింటెం డెంట్ కృష్ణదొర ఘటపా స్థలంలోని మృతదేహా నికి పోస్టుమార్టం నిర్వహించారు. కొన్ని అవయవ భాగాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిం చారు. అనుమానాస్పద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. కాగా, మృతుడి బైక్ యనమలకుదురు లాకుల వద్ద ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment