సాక్షి, అమరావతి : సైబర్ నేరాల్లో సరికొత్త బురిడీ విజయవాడ కమిషనరేట్ పరిధిలో బహిర్గతమైంది. ‘ఎనీ డెస్క్’ యాప్‌తో బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టే నేరాలు ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భవానీపురం వాసిని సైబర్ నేరస్తులు ఇదే తరహాలో మోసం చేసి రూ.68 వేలు కొల్లగొట్టారు. బాధితుడి చరవాణిలోకి చొరబడి బ్యాంకు ఖాతాల వివరాలను తస్కరించి ఈ నేరానికి పాల్పడ్డారు.
నకిలీ కస్టమర్ కేర్ నంబరుతో వల
విజయవాడ భవానీపురానికి చెందిన ఓ యువకుడు గత ఫిబ్రవరి 25వ తేదీన తన ఎస్ బ్యాంక్ అకౌంట్ నుంచి వెయ్యి రూపాయలు ఆంధ్రా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసేందుకు ప్రయత్నించాడు. అందులో విఫలం కావడంతో ఇంటర్నెట్‌లో ఎస్ బ్యాంక్ కస్టమర్ కేర్ ఫోన్ నంబరు కోసం వెతికాడు. సైబర్ నేరగాళ్లు నకిలీ కస్టమర్‌కేర్ నంబరును ఇంటర్నెట్‌లో నమోదు చేసిన విషయం తెలియని బాధితుడు.. ఆ నంబర్‌కు ఫోన్ చేశాడు. అదే అదనుగా బాధితుడికి ఎస్ బ్యాంక్ కస్టమర్ కేర్ 9939017073 నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అకౌంట్ నుంచి డబ్బు బదిలీ కాలేదని ఫిర్యాదు చేశారా?’ అని ప్రశ్నించగా భవానీపురం వాసి ‘అవును’ అని సమాధానం ఇవ్వగా.. ‘మీకు ఫోన్‌పే, గూగుల్‌పే యాప్స్ ఉన్నాయా?’ అని అటు నుంచి మళ్లీ అడిగారు.
‘గూగుల్‌పే లేదు నా ఫోన్‌లో ఫోన్‌పే మాత్రమే ఉంది’ అని వివరించాడు. అయితే ఆ సమయంలో బాధితుడి ఫోన్‌లో సిగ్నల్స్ సరిగా లేకపోవడం అతడి తమ్ముడి ఫోన్‌లో నుంచి కస్టమర్‌కేర్ సభ్యుడితో మాట్లాడుతూ అతడు చెప్పినట్లు ఫోన్‌పే ఆపరేట్ చేస్తుండగా.. ‘మీకు ఆపరేట్ చేయడం సరిగా రావడం లేదు’ అంటూ బాధితుడి ఫోన్‌లో ‘ఎనీ డెస్క్’ యాప్‌ను నిక్షిప్తం చేయాలని అవతలి వ్యక్తి సూచించాడు. ఆ తరువాత ఎనీడెస్క్ యాప్ ద్వారా వచ్చే కోడ్‌ను చెప్పమని నేరస్తుడు చెప్పడంతో అలాగే చేశారు. అనంతరం ఐదు నిమిషాలకే బాధితుడికి చెందిన యాక్సిస్, ఆంధ్రాబ్యాంకుల ఖాతాల నుంచి డబ్బు మాయమైపోయింది. యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.43 వేలు, మళ్లీ నిమిషానికి ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నుంచి రూ.20 వేలు, మరొకసారి రూ.5 వేలు మోసగాడి బ్యాంకు ఖాతాకు బదిలీ అయ్యాయి. విషయం గ్రహించిన బాధితుడు విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యాప్ చొరబడితే అంతే..
అంతర్జాల సదుపాయం కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎనీడెస్క్ యాప్‌ను నిక్షిప్తం చేస్తే ఇక అంతే సంగతులు అని సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్ ఏ ఫోన్‌లో ఉంటుందో.. అందులోని సమస్త సమాచారాన్ని సైబర్ నేరస్తులు వీక్షించే వీలు కలుగుతుంది. ఈ క్రమంలో బాధితుల ఫోన్‌లోని బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు ఆన్‌లైన్ బ్యాంకు లావాదేవీల క్రమంలో చరవాణికి వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లూ నేరస్తులకు కనిపిస్తాయి. అందుకే ఆ యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ చరవాణిలో నిక్షిప్తం చేయరాదని పోలీసులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment