vijayawada commissionerate
-
విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. మళ్లింపులు
సాక్షి, ఎన్టీఆర్: విజయవాడ నగరంలో రేపు(08-08-2023) మంగళవారం ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ప్రకటించింది. సామాన్య ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. ఉదయం 05. గంటల నుండి సాయంత్రం 06.గంటలు ఈ క్రింది ట్రాఫిక్ రూట్లలో మళ్ళింపులు, ఆంక్షలు అమలులో అమలు కానున్నాయి. ఆంక్షలు 🚧 చుట్టుగుంట నుండి రామవరప్పాడు వైపుకు పడవలరేవు మీదుగా ఎటువంటి వాహనములు అనుమతించబడవు. 🚧 మధురా నగర్ జంక్షన్ నుండి రామవరప్పాడు వైపుకు పడవలరేవు మీదుగా ఎటువంటి వాహనములు అనుమతించబడవు. 🚧 రామవరప్పాడు నుండి పడవలరేవు(ఏలూరు రోడ్) వైపు ఎలాంటి వాహనములు అనుమతించబడవు. 🚧 గుణదల పోస్ట్ ఆఫీస్ జంక్షన్ నుండి ESI కటింగ్(ఏలూరు రోడ్) వైపు ఎలాంటి వాహనములు అనుమతించబడవు. డైవర్షన్లు 🚧 చుట్టుగుంట నుండి రామవరప్పాడు వెళ్ళవలసిన వాహన దారులు చుట్టూ గుంట జంక్షన్ నుండి నైస్ బార్ జంక్షన్ – మధు చౌక్ – జమ్మి చెట్టు సెంటర్ – సిద్దార్ధ జంక్షన్ – అమ్మ కళ్యాణ మండపం జంక్షన్ వద్ద కుడి వైపుకు -రమేష్ హాస్పిటల్ జంక్షన్ మీదుగా వెళ్ళవలెను. 🚧 రామవరప్పాడు నుండి ఏలూరు రోడ్ మరియు BRTS రోడ్ కు వెళ్ళవలసిన వాహన దారులు రామవరప్పాడు నుండి మహానాడు జంక్షన్ – రమేష్ హస్పిటల్ జంక్షన్ వద్ద కుడి వైపుకు – అమ్మ కళ్యాణ మండపం వద్ద ఎడమ వైపుకు – సిద్దార్ధ కాలేజీ జంక్షన్ – జమ్మి చెట్టు సెంటర్ – మధు చౌక్ – నైస్ బార్ జంక్షన్ – పుష్ప హోటల్ జంక్షన్ – దీప్తి జంక్షన్ మీదుగా వెళ్ళవలెను. 🚧 ESI కటింగ్ (ఏలూరు రోడ్ ) నుండి రామవరప్పాడు కు విద్యుత్ సౌద మీదుగా ఎలాంటి వాహనములు కానీ పాద చారులు కానీ అనుమతి లేదు. కనుక వాహన దారులు ప్రజలు సహకరించాలని.. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను అనుసరించి తమ తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు యత్నించాలని సీపీ సదరు ప్రకటనలో పేర్కొంది. -
ఎయిర్ పోర్టు పరిధిలో 144 సెక్షన్
సాక్షి, విజయవాడ: కమిషనరేట్ పరిధిలో గన్నవరం ఎయిర్‌పోర్టు ఏరియాలో శుక్రవారం నుంచి నవంబర్ 18వ తేదీ వరకు 55 రోజుల పాటు 144వ సెక్షన్ అమలులో ఉంటోందని నగర పోలీసు కమిషనర్ సి.హెచ్.ద్వారకా తిరుమల రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్‌పోర్టు ఏరియాలో 250 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకు మించి ఎక్కువ మంది జనం గుమిగూడరాదని, కర్రలు రాళ్లు వంటి వాటిని పట్టుకుని తిరగరాదని ఆయన పేర్కొన్నారు. -
కిలాడీ ‘యాప్’తో జర జాగ్రత్త!
సాక్షి, అమరావతి : సైబర్ నేరాల్లో సరికొత్త బురిడీ విజయవాడ కమిషనరేట్ పరిధిలో బహిర్గతమైంది. ‘ఎనీ డెస్క్’ యాప్‌తో బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టే నేరాలు ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భవానీపురం వాసిని సైబర్ నేరస్తులు ఇదే తరహాలో మోసం చేసి రూ.68 వేలు కొల్లగొట్టారు. బాధితుడి చరవాణిలోకి చొరబడి బ్యాంకు ఖాతాల వివరాలను తస్కరించి ఈ నేరానికి పాల్పడ్డారు. నకిలీ కస్టమర్ కేర్ నంబరుతో వల విజయవాడ భవానీపురానికి చెందిన ఓ యువకుడు గత ఫిబ్రవరి 25వ తేదీన తన ఎస్ బ్యాంక్ అకౌంట్ నుంచి వెయ్యి రూపాయలు ఆంధ్రా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసేందుకు ప్రయత్నించాడు. అందులో విఫలం కావడంతో ఇంటర్నెట్లో ఎస్ బ్యాంక్ కస్టమర్ కేర్ ఫోన్ నంబరు కోసం వెతికాడు. సైబర్ నేరగాళ్లు నకిలీ కస్టమర్‌కేర్ నంబరును ఇంటర్నెట్లో నమోదు చేసిన విషయం తెలియని బాధితుడు.. ఆ నంబర్‌కు ఫోన్ చేశాడు. అదే అదనుగా బాధితుడికి ఎస్ బ్యాంక్ కస్టమర్ కేర్ 9939017073 నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అకౌంట్ నుంచి డబ్బు బదిలీ కాలేదని ఫిర్యాదు చేశారా?’ అని ప్రశ్నించగా భవానీపురం వాసి ‘అవును’ అని సమాధానం ఇవ్వగా.. ‘మీకు ఫోన్‌పే, గూగుల్‌పే యాప్స్ ఉన్నాయా?’ అని అటు నుంచి మళ్లీ అడిగారు. ‘గూగుల్‌పే లేదు నా ఫోన్లో ఫోన్‌పే మాత్రమే ఉంది’ అని వివరించాడు. అయితే ఆ సమయంలో బాధితుడి ఫోన్లో సిగ్నల్స్ సరిగా లేకపోవడం అతడి తమ్ముడి ఫోన్లో నుంచి కస్టమర్‌కేర్ సభ్యుడితో మాట్లాడుతూ అతడు చెప్పినట్లు ఫోన్‌పే ఆపరేట్ చేస్తుండగా.. ‘మీకు ఆపరేట్ చేయడం సరిగా రావడం లేదు’ అంటూ బాధితుడి ఫోన్లో ‘ఎనీ డెస్క్’ యాప్‌ను నిక్షిప్తం చేయాలని అవతలి వ్యక్తి సూచించాడు. ఆ తరువాత ఎనీడెస్క్ యాప్ ద్వారా వచ్చే కోడ్‌ను చెప్పమని నేరస్తుడు చెప్పడంతో అలాగే చేశారు. అనంతరం ఐదు నిమిషాలకే బాధితుడికి చెందిన యాక్సిస్, ఆంధ్రాబ్యాంకుల ఖాతాల నుంచి డబ్బు మాయమైపోయింది. యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.43 వేలు, మళ్లీ నిమిషానికి ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నుంచి రూ.20 వేలు, మరొకసారి రూ.5 వేలు మోసగాడి బ్యాంకు ఖాతాకు బదిలీ అయ్యాయి. విషయం గ్రహించిన బాధితుడు విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాప్ చొరబడితే అంతే.. అంతర్జాల సదుపాయం కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎనీడెస్క్ యాప్‌ను నిక్షిప్తం చేస్తే ఇక అంతే సంగతులు అని సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్ ఏ ఫోన్లో ఉంటుందో.. అందులోని సమస్త సమాచారాన్ని సైబర్ నేరస్తులు వీక్షించే వీలు కలుగుతుంది. ఈ క్రమంలో బాధితుల ఫోన్లోని బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల క్రమంలో చరవాణికి వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లూ నేరస్తులకు కనిపిస్తాయి. అందుకే ఆ యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ చరవాణిలో నిక్షిప్తం చేయరాదని పోలీసులు సూచిస్తున్నారు. -
ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధానిలో కిరాయి హంతక ముఠాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. చాప కింద నీరులా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై పోలీసు శాఖ నిఘా పెట్టడంలో ఉదాసీనత ప్రదర్శిస్తుండటంతో వీరి ఆగడాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో వ్యాపారి రాంప్రసాద్‌ను హత్యలో గుంటూరు, విజయవాడకు చెందిన రౌడీషీటర్ల హస్తం ఉండటం రాజధానిలో కలకలం రేపుతోంది. పోలీసుల వైఫల్యం.. వ్యాపారి రాంప్రసాద్ హత్య వ్యవహారంలో విజయవాడ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రౌడీషీటర్లపై నిఘా పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. గుంటూరు, విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో వెయ్యి మందికిపై రౌడీషీటర్లు ఉన్నారు. ఈ నగరాల్లో ఏ కేటగిరీ వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. వీరి కదలికలపై కమిషనర్ టాస్క్‌ఫోర్స్, సంబంధిత స్టేషన్ల అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. విజయవాడ నగరంలో.. ముఖ్యంగా విజయవాడ నగరంలో పలుకుబడి కలిగిన రౌడీషీటర్లు చాలా మంది నెలల తరబడి సంబంధిత స్టేషన్లకు రాకపోయినా పోలీసులు స్పందించడం లేదు. ‘ఏ’ కేటగిరీ రౌడీషీటర్ల విభాగంలో ఉన్న కోగంటి సత్యం ఈ ఏడాది జనవరి నుంచి పటమట స్టేషన్‌కు రాకపోయినా పట్టించుకోలేదు. నేరాభియోగాలు ఎదుర్కొంటూ రౌడీషీట్ ఉన్న వ్యక్తి చాలా కాలం నుంచి స్టేషన్‌కు ఎందుకు రావడం లేదన్న దానిపై కనీసం దృష్టి కూడా పెట్టలేదు. ఇన్నాళ్లు రాకపోతే ఏదైనా కుట్రకు పాల్పడుతున్నాడా? అన్న కోణంలో కూడా చూడలేదు. సత్యం కదలికలపై కూడా నిఘా పెట్టలేదు. ఇన్నాళ్లు రాకుండా ఉండడానికి ఏమైనా మినహాయింపు తీసుకున్నారా? అన్న విషయాన్ని పోలీసులు బయటపెట్టడం లేదు. ఈ సమయంలో ఎక్కడ ఉన్నారు? ఎవరిని కలిశారు? అన్న అంశాలపై హైదరాబాద్ పోలీసులు పరిశీలిస్తే కానీ అసలు విషయం బయటపడలేదు. శ్యామ్ సుందర్‌పైనా నిఘా లేదు.. రాంప్రసాద్‌ను తానే చంపానని హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయిన శ్యామ్, బెజవాడ వాసి. గతంలో రాజరాజేశ్వరీపేటలో కేబుల్ ఆపరేటర్‌గా పని చేశాడు. ఇతడితో కోగంటి సత్యం కృష్ణలంకలోని బందరు లాకుల ఎదుట తన కార్యాలయం ప్రాంగణంలోనే ‘కె వాటర్‘ పేరుతో నీటి ప్లాంటు పెట్టించాడు. ఆయనపై విజయవాడలోని నున్న పోలీసు స్టేషన్లో రౌడీషీట్ ఉంది. 2013లో రాంప్రసాద్ హత్యాయత్నం, కిడ్నాప్ కేసు నమోదు అయింది. ఈ కేసులో అప్పట్లో కోగంటి సత్యంతో పాటు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. రాంప్రసాద్ హత్యకు ఉపయోగించిన కత్తులను ఈ ప్లాంటులోనే తయారు చేయించాడు. గత కొన్ని నెలలుగా శ్యామ్ కూడా బయటకు రాకుండా ఉన్నాడు. రౌడీషీట్ ఉన్న వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లాడంటే ఏదో కుట్రకు ప్రణాళిక రచిస్తున్నాడేమోనన్న అనుమానం కూడా పోలీసులకు రాకపోవడం గమనార్హం. తనపై ఎలాంటి పోలీసుల నిఘా లేకపోవడంతో రాంప్రసాద్ హత్యకు ప్లాన్ చేసి అమలు చేశాడు. అందరూ విజయవాడ వాసులే.. కేసులో ఏ2గా ఉన్న టెక్కం శ్యామ్ సుందర్‌తో పాటు రాంప్రసాద్ హత్యలో పాల్గొన్న నిందితుల్లో చాలా మంది విజయవాడ వాసులే. రాంప్రసాద్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఏ3గా ఉన్న పులివర్తి బాల నాగాంజనేయ ప్రసాద్, ఏ4 మండే ప్రీతం, ఏ5 పులివర్తి రాములుది గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామం. వీరు ప్రస్తుతం ఉపాధి నిమిత్తం కృష్ణలంకలో నివాసం ఉంటున్నారు. ఏ6 తిరుపతి సురేష్ భవానీపురం నివాసి. ఇతడిపై భవానీపురం స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతడు కోగంటి అనుచరుడు. 2003లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పట్లో వన్‌టౌన్ స్టేషన్లో షీట్ తెరిచారు. ఈ స్టేషన్ నుంచి భవానీపురం స్టేషన్‌ను విడగొట్టడంతో ఇక్కడికి బదిలీ అయింది. సురేష్‌కు అనుచరుడిగా ఏ10 పత్తిపాటి నరేష్ కొనసాగుతున్నాడు. ఏ7 చండిక ఆనంద్, ఏ8 శ్రీరామ్ రమేష్, ఏ9 షేక్ అజారుద్దీన్ అలియాస్ చోటు, ఏ11 వెంకట్ రాంరెడ్డిలు కూడా విజయవాడకు చెందిన వారిగా హైదరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. -
కమిషనరేట్‌లో మళ్లీ ఖాళీలు
54 రోజుల్లో వెళ్లిపోయిన అదనపు సీపీ కొత్తగా జాయింట్ కమిషనర్ పోస్టు భర్తీ జాయింట్ సీపీగా హరికుమార్ నియామకం డీసీపీ లాండ్ ఆర్డర్ పోస్టు కూడా ఖాళీ విజయవాడ : విజయవాడ పోలీస్ కమిషనరేట్ అభివృద్ధి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. కమిషనరేట్ స్థాయిని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రెండేళ్లకు కొత్త పోస్టులు మంజూరుచేసింది. అవి మొత్తం భర్తీ కాకముందే ఖాళీ అవుతున్నాయి. అసలే సిబ్బంది, అధికారుల కొరతతో సతమతమవుతున్న కమిషనరేట్‌కు ఒక అధికారిని నియమించి ఇద్దర్ని బదిలీ చేయడం సమస్యాత్మకంగా మారింది. కేవలం 54 రోజుల వ్యవధిలోనే అదనపు పోలీస్ కమిషనర్‌గా ఉన్న మహేష్‌చంద్ర లడ్హాను పదోన్నతిపై హైదరాబాద్‌కు బదిలీ చేశారు. కొత్తగా వచ్చే పోస్టుల సంఖ్యను పక్కన పెడితే ఉన్న ఐపీఎస్ పోస్టుల్లోనే రెండు ఖాళీ అయ్యాయి. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు రెండేళ్ల క్రితం వరకు డీఐజీ క్యాడర్ అధికారి కమిషనర్‌గా ఉండేవారు. ప్రభుత్వం ఈ పోస్టును ఏకకాలంలో డీఐజీ క్యాడర్ నుంచి అదనపు డీజీ క్యాడర్‌గా అప్‌గ్రేడ్ చేసింది. అదనపు డీజీని కమిషనర్‌గా నియమించారు తప్ప దానికి అనుగుణంగా సిబ్బందిని మాత్రం పెంచలేదు. ఎట్టకేలకు గత నెలలో ఐపీఎస్ పోస్టులతో కలిసి సిబ్బంది సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. ఐజీ క్యాడర్లో ఉన్న మహేష్చంద్రలడ్హా అదనపు పోలీస్ కమిషనర్‌గా మార్చి 11న విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా సిటీ సెక్యూరిటీ వింగ్‌ను ఏర్పాటుచేసి దానికి ఒక ఐపీఎస్ అధికారిని, డీఐజీ క్యాడర్ అధికారితో జాయింట్ కమిషనర్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇవేవీ పూర్తిస్థాయిలో భర్తీకాకముందే అదనపు కమిషనర్‌ను బదిలీ చేయడం పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌కు ఇంటెలిజెన్స్ ఐజీగా పదోన్నతిపై లడ్హా వెళ్ళారు. వాస్తవానికి విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో జాయింట్ కమిషనర్ పోస్టును కొత్తగా ఏర్పాటుచేసి వెనువెంటనే డీఐజీ స్థాయి అధికారిని అక్కడ నియమించారు. కాని విజయవాడకు మాత్రం ఆ స్థాయి ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలోనే ఏ కమిషనరేట్‌కు లేని విధంగా విజయవాడను అప్‌గ్రేడ్ చేశారు. దాదాపు 2వేల మంది వరకు పోలీస్ కానిస్టేబుళ్ల అవసరముండగా 1100 మందిని నియమించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీచేశారు. ఇతర రేంజ్‌లు, ఏపీఎస్పీ బెటాలియన్ల నుంచి కానిస్టేబుళ్లు రావాల్సి ఉంది. కొత్తగా మంజూరైనవాటితో కలిపి ఆరు వరకు ఐపీఎస్ పోస్టులు ఉన్నాయి. తాజా బదిలీలతో ఐపీఎస్‌ల సంఖ్య మూడుకు పడిపోవడం గమనార్హం. ముగ్గురితోనే అన్ని పనులు రాజధాని నగరమైన విజయవాడలో వారంలో సగటున ఐదురోజుల పాటు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, వీఐపీల పర్యటనలు జరుగుతుంటాయి. ఇవి కాకుండా రాజధాని అభివృద్ధి పనుల నిమిత్తం విదేశీ ప్రతినిధులు సైతం తరచూ నగరానికి వస్తున్నారు. దీంతోపాటు నగరంలో కొంత కాలంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉన్న కొద్దిపాటి సిబ్బందితోనే వీటన్నింటినీ నడిపించాల్సి వస్తోంది. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్, అడ్మిన్‌కు ఇద్దరు డీసీపీలు, అదనపు సీపీ ఉన్నారు. బదిలీల్లో లా అండ్ ఆర్డర్ సీపీని విజయనగరం ఎస్పీగా బదిలీ చేసి ఆ పోస్టును ఖాళీగా ఉంచారు. అదనపు డీసీ పోస్టును ఖాళీ చేసి జాయింట్ కమిషనర్ పోస్టును భర్తీచేశారు. దీంతో ఆరుగురు ఐపీఎస్‌లు ఉండాల్సిన నగరంలో ముగ్గురితోనే అన్ని కార్యకలాపాలు నడిపించాల్సి రావడం కొంత సమస్యాత్మకంగా మారింది. -
కమిషనరేట్‌పై 'అధికార' పెత్తనం
ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పోలీస్స్టేషన్లు కేసుల్లో పెరుగుతున్న అధికార పార్టీ నేతల జోక్యం సీఐకే న్యాయం చేయలేని మరో సీఐ సీపీ సీరియస్ అయ్యాకే కేసు నమోదు సాక్షి, విజయవాడ : నగర కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లపై అధికార పార్టీ నేతల పెత్తనం పెరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తాము చెప్పిందే చేయాలంటూ పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. పోలీస్స్టేషన్లలో హల్చల్ చేస్తూ దందాలు సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల పరిధిలోని పోలీస్స్టేషన్లలో ఈ పరిస్థితి నెలకొంది. పరిస్థితి తీవ్రమై నగర పోలీస్ కమిషనర్ దృష్టికి రావడం, ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్లపై సీరియస్ అయితే కానీ కేసులు నమోదు కాని పరిస్థితికి వచ్చింది. అడుగడుగునా జోక్యం... విజయవాడ నగరంలో అధికార పార్టీకి చెందిన ఒక అమాత్యుడు, ప్రజాప్రతినిధి జోక్యం బాగా పెరిగింది. ముఖ్యంగా పోలీస్స్టేషన్లల్లో అయితే సాధారణ ఫిర్యాదుల విషయాల్లో తరచూ వీరు జోక్యం చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో వివాదంగా మారుతోంది. పర్యవసానంగా పోలీసులు బాధితులకు న్యాయం చేయలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇటీవల స్థలవివాదంలో ఒక సీఐ మరో స్టేషన్ పరిధిలోని సీఐని ఆశ్రయిస్తే న్యాయం జరగని పరిస్థితి ఉందంటే అధికార పార్టీ ఒత్తిళ్ల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏడాదిన్నరగా పోలీసులపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు పెరిగాయి. అమాత్యుని ఒత్తిడి భవానీపురంలో ఈ నెల 22న ఒక కేసు నమోదైంది. అక్కడ ఐదు ఎకరాల విస్తీర్ణంలో కాంప్లెక్స్‌ను నగరంలోని వ్యాపారులు కొన్నేళ్ల కిత్రం నిర్మించారు. ఈ క్రమంలో దాని పక్కనే 1.5 ఎకరాల స్థలం యజమాని, గొల్లపూడి ఉప సర్పంచ్ తన స్థలానికి రోడ్డు కోసం అనుమతి లేకుండా 25 అడుగుల మేర కాంప్లెక్స్ గోడను ధ్వంసం చేశారు. ఈ ఘటన 21వ తేదీ అర్ధరాత్రి జరగ్గా 22న ఉదయం పది గంటలకు కాంప్లెక్స్ వ్యాపారులు భవానీపురం సీఐ గోపాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఉప సర్పంచ్‌కు మద్దతుగా ఓ అమాత్యుడు, కీలక ప్రజాప్రతినిధి జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఫిర్యాదును పట్టించుకోలేదు. సాయంత్రం వరకు స్టేషన్ వద్ద రాజీ హైడ్రామా నడిపించారు. చివరకు బాధితులు నగర పోలీసు కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించారు. దీనిపై సీపీ స్పందించడంతో సీఐ గోపాలకృష్ణ ఆఘమేఘాలపై కేసు నమోదు చేసి ఉపసర్పంచ్ చిగురుపాటి నాగరాజును అరెస్టు చేశారు. ఆ తర్వాత కూడా రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటంతో ఆయన్ను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. సీఐకీ దక్కని న్యాయం సాధారణంగా పోలీసులు అంటే తోటి పోలీసులకు గౌరవం ఉంటుంది. అలాంటిది ఒక సీఐ బాధితుడుగా మారి తన సమస్యపై స్టేషన్ వచ్చి మరో సీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కంకిపాడు సీఐ ఎం.రాజ్‌కుమార్‌కు విజయవాడలోని కేఎల్ రావు నగర్లో పూర్వీకుల ద్వారా వచ్చిన ఇల్లు ఉంది. అదే ప్రాంతానికి చెందిన తమ్మిన కృష్ణ, దుర్గాంబతో ఆ ఇంటి విషయమై వివాదాలు ఉన్నాయి. సీఐ రాజ్‌కుమార్ కోర్టును ఆశ్రయించి ఇంటిపై తనకే సర్వహక్కులు ఉండేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో తమ్మిన కృష్ణ, దుర్గాంబ ఇంటిని ఆక్రమించుకోవడానికి యత్నించడంతో సీఐ రాజ్‌కుమార్ కొత్తపేట సీఐ దుర్గారావుకు ఈ నెల 22న ఫిర్యాదు చేశారు. అయినా సీఐ దుర్గారావు స్పందించలేదు. తమ్మిన కృష్ణకు మద్దతుగా కీలక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి ఒత్తిడి తీసుకురావడంతో దుర్గారావు మౌనం వహించారు. చివరకు 23న ఈ విషయం కమిషనరేట్ వర్గాల ద్వారా సీపీకి తెలిసింది. దీంతో రాజ్‌కుమార్ ఫిర్యాదుకు కదలిక వచ్చి నిందితులు తమ్మిన కృష్ణ, దుర్గాంబతో పాటు మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదైంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ రెండు కేసులతో స్తబ్దు... గుట్కా సిండికేట్ వ్యవహారంలో వరుస అరెస్టులు, అందులోనూ అధికార పార్టీ నేతల అరెస్టులు జరిగాయి. ఆ తర్వాత కాల్‌మనీ కేసుల్లో పోలీసులు తొలుత రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. ఈ రెండు వరుస ఘటనల తర్వాత ప్రజాప్రతినిధులు కొంత కాలం స్తబ్దుగా ఉన్నారు. నెల నుంచి మళ్లీ సిఫార్సులు, అడ్డగోలు పంచాయితీలకు తెరతీస్తున్నారు. ఇటీవల భవానీపురం పోలీస్ స్టేషన్, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో ఈ తరహా వ్యవహారాలు సాగాయి. చివరకు రెండు కేసుల్లో నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యాకే కేసులు నమోదయ్యాయి. -
‘ఐ-టీమ్స్’ సంఖ్య పెంపు
సాక్షి, హైదరాబాద్: సీఆర్డీఏలో భాగం అయిన విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ (ఐ-టీమ్స్) సంఖ్యను పది నుంచి పదహారుకు పెంచారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రతి టీమ్‌కూ ఓ ఇన్స్పెక్టర్ను ఇన్చార్జ్గా ఏర్పాటు చేశారు. వీటిలో పని చేయడానికి నేర విభాగంలో అనుభవం ఉన్న సిబ్బందిని ఎంపిక చేస్తున్నారు. వీరు కేవలం హత్య కేసుల్ని మాత్రమే కాకుండా ఆయా పోలీసుస్టేషన్లలో నమోదయ్యే కీలక కేసులు, సంచలనాత్మక నేరాలను దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో పోలీసులపై అధికమవుతున్న శాంతిభద్రతల పరిరక్షణ డ్యూటీల ప్రభావం కేసుల దర్యాప్తుపై పడుతోంది. ఫలితంగా దర్యాప్తు దశలో ఉంటున్న కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే శాంతిభద్రతల విభాగం నుంచి దర్యాప్తు విభాగాన్ని వేరు చేయాలనే వాదనకు అనుగుణంగా విజయవాడ పోలీసు కమిషనర్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఏడాది జూలైలోనే కమిషనరేట్ పరిధిలో 10 ‘ఐ-టీమ్స్’ ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ లో ఐదు, ఈస్ట్ జోన్లో మూడు, వెస్ట్‌జోన్‌లో రెండింటిని అమలులోకి తీసుకువచ్చారు. వీటిని విస్తరించిన గౌతమ్ ఈ టీమ్స్ సంఖ్యను 16కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ‘ఐ-టీమ్స్’లో ఉన్న అధికారులు సిబ్బందికి ఇతర విధుల నుంచి విముక్తి కల్పించాలని నిర్ణయించారు. విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో అమలులోకి రానున్న ఈ విధానం సత్ఫలితాలనిస్తే రాష్ట్రంలో బందోబస్తు, భద్రతా విధులు ఎక్కువగా ఉండే అర్బన్ జిల్లాలతో పాటు కమిషనరేట్‌లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. -
విజయవాడ కమిషనరేట్ పరిధిలోనే తుళ్లూరు
డీజీపీ జేవీ రాముడు వెల్లడి విజయవాడ సిటీ : రాజధాని ప్రతిపాదిత ప్రాంతమైన తుళ్లూరు సబ్ డివిజన్ విజయవాడ కమిషనరేట్ పరిధిలోనే ఉంటుందని రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ జేవీ రాముడు తెలిపారు. కమిషనరేట్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో డీజీపీ పాల్గొన్నారు. రాజధాని పట్టణం స్మార్ట్ సిటీగా రూపొందించాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కమిషనరేట్ పరిధిలోకి ఆ ప్రాంతాన్ని తీసుకురావాల్సి ఉంటుందని చెప్పారు. ఏ ప్రాంతం ఏ కమిషనరేట్ పరిధిలో ఉండాలనేది మాత్రం ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు వివరించారు. సమావేశంలో అదనపు డీజీపీలు ఎన్వీ సురేంద్రబాబు, అనూరాధ, వీఎస్ కౌముది, ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.