54 రోజుల్లో వెళ్లిపోయిన అదనపు సీపీ
కొత్తగా జాయింట్ కమిషనర్ పోస్టు భర్తీ
జాయింట్ సీపీగా హరికుమార్ నియామకం
డీసీపీ లాండ్ ఆర్డర్ పోస్టు కూడా ఖాళీ
విజయవాడ : విజయవాడ పోలీస్ కమిషనరేట్ అభివృద్ధి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. కమిషనరేట్ స్థాయిని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రెండేళ్లకు కొత్త పోస్టులు మంజూరుచేసింది. అవి మొత్తం భర్తీ కాకముందే ఖాళీ అవుతున్నాయి.
అసలే సిబ్బంది, అధికారుల కొరతతో సతమతమవుతున్న కమిషనరేట్‌కు ఒక అధికారిని నియమించి ఇద్దర్ని బదిలీ చేయడం సమస్యాత్మకంగా మారింది. కేవలం 54 రోజుల వ్యవధిలోనే అదనపు పోలీస్ కమిషనర్‌గా ఉన్న మహేష్‌చంద్ర లడ్హాను పదోన్నతిపై హైదరాబాద్‌కు బదిలీ చేశారు. కొత్తగా వచ్చే పోస్టుల సంఖ్యను పక్కన పెడితే ఉన్న ఐపీఎస్ పోస్టుల్లోనే రెండు ఖాళీ అయ్యాయి.
విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు రెండేళ్ల క్రితం వరకు డీఐజీ క్యాడర్ అధికారి కమిషనర్‌గా ఉండేవారు. ప్రభుత్వం ఈ పోస్టును ఏకకాలంలో డీఐజీ క్యాడర్ నుంచి అదనపు డీజీ క్యాడర్‌గా అప్‌గ్రేడ్ చేసింది. అదనపు డీజీని కమిషనర్‌గా నియమించారు తప్ప దానికి అనుగుణంగా సిబ్బందిని మాత్రం పెంచలేదు. ఎట్టకేలకు గత నెలలో ఐపీఎస్ పోస్టులతో కలిసి సిబ్బంది సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులిచ్చారు.
ఐజీ క్యాడర్‌లో ఉన్న మహేష్‌చంద్రలడ్హా అదనపు పోలీస్ కమిషనర్‌గా మార్చి 11న విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా సిటీ సెక్యూరిటీ వింగ్‌ను ఏర్పాటుచేసి దానికి ఒక ఐపీఎస్ అధికారిని, డీఐజీ క్యాడర్ అధికారితో జాయింట్ కమిషనర్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇవేవీ పూర్తిస్థాయిలో భర్తీకాకముందే అదనపు కమిషనర్‌ను బదిలీ చేయడం పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌కు ఇంటెలిజెన్స్ ఐజీగా పదోన్నతిపై లడ్హా వెళ్ళారు.
వాస్తవానికి విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో జాయింట్ కమిషనర్ పోస్టును కొత్తగా ఏర్పాటుచేసి వెనువెంటనే డీఐజీ స్థాయి అధికారిని అక్కడ నియమించారు. కాని విజయవాడకు మాత్రం ఆ స్థాయి ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలోనే ఏ కమిషనరేట్‌కు లేని విధంగా విజయవాడను అప్‌గ్రేడ్ చేశారు. దాదాపు 2వేల మంది వరకు పోలీస్ కానిస్టేబుళ్ల అవసరముండగా 1100 మందిని నియమించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీచేశారు. ఇతర రేంజ్‌లు, ఏపీఎస్పీ బెటాలియన్‌ల నుంచి కానిస్టేబుళ్లు రావాల్సి ఉంది. కొత్తగా మంజూరైనవాటితో కలిపి ఆరు వరకు ఐపీఎస్ పోస్టులు ఉన్నాయి. తాజా బదిలీలతో ఐపీఎస్‌ల సంఖ్య మూడుకు పడిపోవడం గమనార్హం.
ముగ్గురితోనే అన్ని పనులు
రాజధాని నగరమైన విజయవాడలో వారంలో సగటున ఐదురోజుల పాటు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, వీఐపీల పర్యటనలు జరుగుతుంటాయి. ఇవి కాకుండా రాజధాని అభివృద్ధి పనుల నిమిత్తం విదేశీ ప్రతినిధులు సైతం తరచూ నగరానికి వస్తున్నారు. దీంతోపాటు నగరంలో కొంత కాలంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉన్న కొద్దిపాటి సిబ్బందితోనే వీటన్నింటినీ నడిపించాల్సి వస్తోంది. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్, అడ్మిన్‌కు ఇద్దరు డీసీపీలు, అదనపు సీపీ ఉన్నారు. బదిలీల్లో లా అండ్ ఆర్డర్ సీపీని విజయనగరం ఎస్పీగా బదిలీ చేసి ఆ పోస్టును ఖాళీగా ఉంచారు. అదనపు డీసీ పోస్టును ఖాళీ చేసి జాయింట్ కమిషనర్ పోస్టును భర్తీచేశారు. దీంతో ఆరుగురు ఐపీఎస్‌లు ఉండాల్సిన నగరంలో ముగ్గురితోనే అన్ని కార్యకలాపాలు నడిపించాల్సి రావడం కొంత సమస్యాత్మకంగా మారింది.