‘ఐ-టీమ్స్’ సంఖ్య పెంపు
సాక్షి, హైదరాబాద్: సీఆర్‌డీఏలో భాగం అయిన విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ (ఐ-టీమ్స్) సంఖ్యను పది నుంచి పదహారుకు పెంచారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రతి టీమ్‌కూ ఓ ఇన్‌స్పెక్టర్‌ను ఇన్‌చార్జ్‌గా ఏర్పాటు చేశారు. వీటిలో పని చేయడానికి నేర విభాగంలో అనుభవం ఉన్న సిబ్బందిని ఎంపిక చేస్తున్నారు. వీరు కేవలం హత్య కేసుల్ని మాత్రమే కాకుండా ఆయా పోలీసుస్టేషన్లలో నమోదయ్యే కీలక కేసులు, సంచలనాత్మక నేరాలను దర్యాప్తు చేయాల్సి ఉంటుంది.
ఇటీవల కాలంలో పోలీసులపై అధికమవుతున్న శాంతిభద్రతల పరిరక్షణ డ్యూటీల ప్రభావం కేసుల దర్యాప్తుపై పడుతోంది. ఫలితంగా దర్యాప్తు దశలో ఉంటున్న కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే శాంతిభద్రతల విభాగం నుంచి దర్యాప్తు విభాగాన్ని వేరు చేయాలనే వాదనకు అనుగుణంగా విజయవాడ పోలీసు కమిషనర్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఏడాది జూలైలోనే కమిషనరేట్ పరిధిలో 10 ‘ఐ-టీమ్స్’ ఏర్పాటు చేశారు.
సెంట్రల్ జోన్ లో ఐదు, ఈస్ట్ జోన్‌లో మూడు, వెస్ట్‌జోన్‌లో రెండింటిని అమలులోకి తీసుకువచ్చారు. వీటిని విస్తరించిన గౌతమ్ ఈ టీమ్స్ సంఖ్యను 16కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ‘ఐ-టీమ్స్’లో ఉన్న అధికారులు సిబ్బందికి ఇతర విధుల నుంచి విముక్తి కల్పించాలని నిర్ణయించారు. విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో అమలులోకి రానున్న ఈ విధానం సత్ఫలితాలనిస్తే రాష్ట్రంలో బందోబస్తు, భద్రతా విధులు ఎక్కువగా ఉండే అర్బన్ జిల్లాలతో పాటు కమిషనరేట్‌లోనూ అమలు చేయాలని నిర్ణయించింది.