సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ టెండర్లలో అక్రమాలు
రూ.818.03 కోట్లతో సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్
జీఎస్టీ, ఎన్‌ఏసీ, సీనరేజీ తదితరాల రూపంలో రూ.153.05 కోట్లు రీయింబర్స్
ఈ లెక్కన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు మొత్తం కాంట్రాక్టు విలువ రూ.971.08 కోట్లు
నేలపాడు వద్ద జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 ప్లాట్లతో నిర్మాణం
హ్యాపీ నెస్ట్ మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చదరపు అడుగులు
దీని ప్రకారం ఒక్కో చ.అడుగు నిర్మాణ వ్యయం రూ.4,511.76
అధునాతన సదుపాయాలతోనూ అంతా కలిపి చ.అడుగుకు రూ.2 వేలకు మించదంటున్న బిల్డర్లు
ప్రాజెక్టు పూర్తికి 24 నెలలు గడువు పెట్టిన సీఆర్‌డీఏ
టెండర్లలో జాయింట్ వెంచర్లకు అవకాశం లేదని నిబంధన
కానీ పనులు దక్కాక 25 శాతం సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించవచ్చని సడలింపు
ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్టు సంస్థకు అధిక ధరలకు కట్టబెట్టేందుకు ‘ముఖ్య’నేత ఎత్తుగడ
భారీ ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నాయంటున్న బిల్డర్లు
గతంలో టీడీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టును రూ.658 కోట్లకు కాంట్రాక్టర్‌కు అప్పగించిన సీఆర్‌డీఏ
ఇప్పుడు సర్కారు చెబుతున్న దాని ప్రకారమే ఇసుక ఉచితం.. నాటికీ నేటికీ నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు.. అయినా సరే ప్రాజెక్టు వ్యయం భారీగా పెంపు..
జాప్యంతో పెరిగిన అంచనా వ్యయం ఖజానా నుంచే చెల్లింపు
ఖజానా నుంచి కాంట్రాక్టర్‌కు దోచిపెట్టి కమీషన్లు రాబట్టుకునే ఎత్తుగడ
గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లకు జీ+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ప్లాట్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ టెండర్లు
ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మిత ప్రాంతం 27,24,080 చదరపు అడుగులు.. కాంట్రాక్టు విలువ రూ.492.04 కోట్లు
ఈ లెక్కన ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,806.29 మాత్రమే
హ్యాపీ నెస్ట్, ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణం దాదాపు ఒకే రీతిలోనే.. రెండూ షీర్ వాల్ టెక్నాలజీతోనే
హ్యాపీ నెస్ట్ టెండర్ల అక్రమాలను ఆఫీసర్ల క్వార్టర్ల పనుల టెండర్లే బహిర్గతం చేశాయంటున్న బిల్డర్లు
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం ముసుగులో అమరావతిని కూటమి ప్రభుత్వం కుంభకోణాల మయంగా మార్చేస్తోంది. అడుగడుగునా కమీషన్ల దందాతో ఖజానాకు చిల్లు పెడుతూ అమరావతిని అక్రమాల పురంగా తీర్చిదిద్దుతోంది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచేసిన ప్రభుత్వం ఆ భారాన్ని ఇప్పటికే అడ్వాన్సు చెల్లించి ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారిపై మోపితే వ్యతిరేకత వస్తుందని పసిగట్టి దాన్ని రాష్ట్ర ఖజానా నుంచే సర్దుబాటు చేస్తోంది. అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టి, వాటినే కమీషన్లు రూపంలో వసూలు చేసుకునేందుకు ‘ముఖ్య’నేత చక్రం తిప్పినట్లు స్పష్టమవుతోందని బిల్డర్లు చెబుతున్నారు.
ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారం ఎత్తి చేపట్టిన హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టు టెండర్లలో భారీ ఎత్తున జరిగిన అక్రమాలను గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు బహిర్గతం చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ రెండింటి డిజైన్లు, నిర్మాణ రీతి, సౌకర్యాలు ఒకటే అయినా హ్యాపీ నెస్ట్ నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.2,500కిపైగా అదనంగా ఉండటమే అక్రమాలకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు.
షెడ్యూళ్లకు 8వ తేదీ తుది గడువు
అమరావతిలో 2018లో నాటి టీడీపీ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసింది. నేలపాడు వద్ద 14.46 ఎకరాల్లో జీ+18 అంతస్తుల్లో 1,200 ప్లాట్లతో హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్నారైలు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజల నుంచి అడ్వాన్సులు సేకరించింది. హ్యాపీ నెస్ట్ పనులను అప్పట్లో రూ.658 కోట్లకు సీఆర్‌డీఏ కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. అయితే అది ముందుకు కదల్లేదు.
ఇప్పుడు అదే ప్రాజెక్టును టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టింది. గత టెండర్‌ను రద్దు చేసింది. తాజాగా రూ.818.03 కోట్ల వ్యయంతో 24 నెలల్లో పూర్తి చేయాలని గడువు నిర్దేశించింది. మూడేళ్ల పాటు నిర్వహించాలనే నిబంధనతో ఎల్‌ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో టెండర్లు పిలిచింది. టెండర్ల షెడ్యూళ్ల దాఖలుకు ఈనెల 8వ తేదీని తుది గడువుగా పేర్కొంది. అదే రోజు టెక్నికల్ బిడ్ తెరుస్తారు.
ఆర్థిక బిడ్‌లను పదో తేదిన తెరిచి తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించే దిశగా సీఆర్‌డీఏ అడుగులు వేస్తోంది. జీఎస్టీ, ఎన్‌ఏసీ, సీనరేజీ లాంటి పన్నులు రూ.153.05 కోట్లు రీయింబర్స్‌మెంట్ చేస్తామని పేర్కొంది. షీర్ వాల్ టెక్నాలజీతో అల్యూమినియం ప్రేమ్‌వర్క్, పోడియం, ఆర్కిటెక్చరల్ ఫినిషెస్.. బయట, లోపల విద్యుదీకరణ, ఎల్పీజీ లాంటి సౌకర్యాలతో హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లను నిర్మించాలని టెండర్లలో పేర్కొంది.
తగ్గిన ధరలు.. అంచనాల్లో వంచన
హ్యాపి నెస్ట్ ప్రాజెక్టుకు 2018లో తెరతీసిన ప్రభుత్వం.. అప్పట్లో పనులను కాంట్రాక్టర్‌కు రూ.658 కోట్లకు అప్పగించింది. కానీ.. ఆ ప్రాజెక్టు అప్పట్లో ముందుకు కదల్లేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. భవన నిర్మాణాల్లో వినియోగించే స్టీల్, సిమెంట్, కంకర తదితరాలతోపాటు విద్యుత్, శానిటరీ ఉపకరణాల దగ్గర నుంచి లిఫ్ట్‌ల వరకూ గతంతో పోలిస్తే ధరలలో పెద్దగా వ్యత్యాసం లేదు. నిజానికి 2018తో పోలిస్తే కొన్నిటి ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి.
ఇక ఇసుక పూర్తి ఉచితమని ప్రభుత్వమే చెబుతోంది. అలాంటప్పుడు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడానికి ఆస్కారమే ఉండదని ప్రముఖ బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. అలాంటిది హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కాంట్రాక్టు విలువను రూ.818.03 కోట్లుగా నిర్ణయించి తాజాగా సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం, రూ.153.05 కోట్లను పన్నుల రూపంలో రీయింబర్స్‌మెంట్ చేస్తామని పేర్కొనడంపై బిల్డర్లు విస్తుపోతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.971.08 కోట్లకు చేరుతోంది.
ప్రాజెక్టులో మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చ.అ. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణానికి రూ.4,511.76 చొప్పున వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన డిజైన్ కంటే మరిన్ని అధునాతన సదుపాయాలతో నిర్మాణం చేపట్టినా చదరపు అడుగుకు అన్ని పన్నులతో కలిపినా రూ.1,800 నుంచి రూ.2వేల లోపే నిర్మాణ వ్యయం అవుతుందని బిల్డర్లు చెబుతున్నారు. ప్రాజెక్టు అంచనాల్లో భారీగా అక్రమాలు జరిగాయని పేర్కొంటున్నారు.
అక్రమాలు ఇలా బహిర్గతం..
హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణ రీతిలోనే.. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో గెజిటెడ్ ఆఫీసర్లకు టైప్–1, టైప్–2 విధానంలో జీ+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణానికి రూ.492.04 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు మొత్తం నిర్మిత ప్రాంతం 27,24,080 చ.అ. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1,806.29 అవుతుంది.
ఇక సీనరేజీ, ఎన్‌ఏసీ, జీఎస్టీ పన్నుల రూపంలో రూ.93.2 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. ఇవన్నీ కలిపినా గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.2,148.45 దాటదు. దీన్ని బట్టి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్లు సీఆర్‌డీఏ పిలిచిన టెండర్ల సాక్షిగా బట్టబయలైందని బిల్డర్లు చెబుతున్నారు.
సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ టెండర్లలో అక్రమాలు
⇒ రాజధాని అమరావతిలో గెజిటెడ్ ఆఫీసర్ల కోసం జీ+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణానికి రూ.492.04 కోట్లతో సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1,806.29 మాత్రమే. ఇక హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఇక్కడ మాత్రం నిర్మాణ వ్యయం ఏకంగా చ.అ.కు రూ.4,511.76 చొప్పున నిర్దేశించారు. నిజానికి అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గాల్సింది పోయి ఇక్కడ అమాంతం పెరిగిపోయింది. హ్యాపీ నెస్ట్.. గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లు.. ఇవి రెండూ షీర్ వాల్ టెక్నాలజీతోనే నిర్మాణాలు చేపడతారు. వాటి డిజైన్లు, నిర్మాణ రీతి, సౌకర్యాలు ఒకటే. కానీ నిర్మాణ వ్యయం మాత్రం వేర్వేరు.
⇒ అధునాతన సదుపాయాలు, నాణ్యమైన నిర్మాణ సామగ్రి వినియోగించి కట్టే బహుళ అంతస్తుల భవనాల్లోనూ (టవర్స్) నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదని (జీఎస్టీ, సీనరేజీ లాంటి అన్ని పన్నులతో కలిపి) విజయవాడ–గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మక రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన పేరు మోసిన బిల్డర్లు చెబుతున్నారు. కానీ.. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి రాజధాని అమరావతిలో చేపట్టిన హ్యాపి నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టులో మాత్రం చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఏకంగా రూ.4,511.76 ఉంది. దీన్ని బట్టి ఒక్కో చ.అడుగుకు రూ.2,500కిపైగా అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు స్పష్టమవుతోందని బిల్డర్లు చెబుతున్నారు.
⇒ రెండు మూడు సంస్థలు జాయింట్ వెంచర్(జేవీ)గా ఏర్పడి షెడ్యూలు దాఖలు చేయడానికి వీల్లేదని హ్యాపీనెస్ట్ టెండర్ నోటిఫికేషన్‌లో సీఆర్‌డీఏ నిబంధన విధించింది. కానీ ఆ ప్రాజెక్టు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 25 శాతం పనులను సబ్ కాంట్రాక్టు కింద అప్పగించే వెసులుబాటు కల్పించింది. దీన్ని బట్టి ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్టు సంస్థకు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును అధిక ధరలకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునే వ్యూహంతో ‘ముఖ్య’నేత చక్రం తిప్పినట్లు వెల్లడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment