2018–19 నుంచి పెద్దగా పెరగని నిర్మాణ సామగ్రి ధరలు
అయినా.. భవన నిర్మాణాల వ్యయం 55 శాతం పెంపు
రోడ్లకు మరో 28 శాతం అధికం
ఉద్దేశపూర్వకంగా రివర్స్ టెండర్ల రద్దుతో దోపిడీకి బరితెగింపు
రూ.20,292 కోట్ల పనులకు అనుమతులు
ఇందులో లెక్కచూపేవి ఎన్నో?.. ఇంతలా పెంపుదల దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదంటున్న నిర్మాణరంగ నిపుణులు
సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను కూటమి నాయకులు తిరగరాస్తున్నారు. పదవిలో ఉండగానే డబ్బు దండుకోవాలన్న సూత్రంతో చెలరేగిపోతున్నారు. అందుకు అనుగుణంగానే అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చుకున్నారు. ఇందులో భాగంగా.. సీఆర్డీఏ ప్రాంతంలో చేపట్టే నిర్మాణల పనుల వ్యయాన్ని అడ్డగోలుగా పెంచి దోపిడీకి పెద్దస్కెచ్చే వేశారు. వ్యయాన్ని భారీగా పెంచడంతో పాటు టెండర్ల కాంట్రాక్టును కూడా పనుల ప్రకారం కాకుండా ఏకమొత్తంగా ఇచ్చేందుకు నిర్ణయించి ఆ మేరకు జీఓ కూడా విడుదల చేశారు.
ఇటీవల జరిగిన రెండు సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తం రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. పనులను బట్టి వీటి విలువను ఏకంగా 28 నుంచి 55 శాతం మేర పెంచింది. అంటే.. అనుమతులిచ్చిన పనుల్లో సరాసరి రూ.10 వేల కోట్ల మేర పెంపు చూపడంపై నిర్మాణరంగ నిపుణులే నోరెళ్లబెడుతున్నారు. ఐదేళ్లలో పనుల విలువ ఇంత భారీగా పెంచడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదంటున్నారు.
ధరలు పెద్దగా పెరగకపోయినా..
గత టీడీపీ ప్రభుత్వం సీఆర్డీఏలో 2017–18 మధ్య ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టింది. అప్పటికి ఇప్పటికీ నిర్మాణ సామాగ్రి ధరలు పెద్దగా పెరగకపోయినా పనుల వ్యయాన్ని మాత్రం అమాంతం పెంచడం ఆలోచించాల్సిన విషయమేనని వారంటున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పనుల్లో పారదర్శకత, వ్యయం తగ్గింపుపై ప్రత్యేక దృష్టిపెట్టి రివర్స్ టెండర్ల విధానం అమల్లోకి తెచ్చింది.
అయితే, ఈ విధానం కొనసాగితే తాము అనుకున్నట్లు సాగదని.. పైగా తమ లక్ష్యం నెరవేరదని భావించిన కూటమి సర్కారులోని పెద్దలు ఆ విధానాన్ని ఏకంగా రద్దుచేసి పారేశారు. అలాగే, గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చిన టెండర్లను సైతం రద్దుచేసి, ఇప్పుడు కొత్తగా తమ వారికి చెప్పిన రేటుకు కట్టబెట్టేందుకు వీలుగా లంప్సమ్ విధానం అనుసరించడం గమనార్హం.
రాజధాని ప్రాంతంలో 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రూ.5వేల కోట్ల మేర పనులు పూర్తిచేసినట్లు ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. తాజాగా.. 41, 42 సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్తగా రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చారు.
ఇందులో రూ.11,467.27 కోట్లతో పనులకు అనుమతినిస్తూ జీఓ సైతం జారీచేశారు. తాజాగా.. మరో రూ.8,821.44 కోట్ల మేర ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లకు అనుమతిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణ వ్యయాన్ని 28 శాతం వరకు పెంచగా, భవన నిర్మాణాల ఖర్చును ఏకంగా 35 నుంచి 55 శాతం పెంచడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment