నెలకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లింపు
అభివృద్ధి పనుల కోసం 63 మంది ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు
వీరికి రెండేళ్లలో రూ.62.36 కోట్లు చెల్లింపు
ప్రైవేటు భాగసామ్యం కోసం మరో ఐదుగురు
వీరికి మూడేళ్లలో రూ.8.28 కోట్ల
ప్రతిపాదనలను ఆహ్వానించిన సీఆర్‌డీఏ
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలన అంటేనే కన్సల్టెంట్లు, విదేశీ సంస్థలకు వందల కోట్లు దోచిపెట్టడమనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు గత పాలనంతా కన్సల్టెంట్ల మయం. ఇప్పుడూ అదే జరుగుతోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)లోనూ కన్సల్టెంట్ల రాజ్యానికి గేట్లు తెరుచుకున్నాయి. అభివృద్ధి పనుల కోసం ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్‌కు, అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఇలా రెండు రకాల కన్సల్టెంట్ల కోసం సీఆర్‌డీఏ వేర్వేరుగా రెండు ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఈ కన్సల్టెంట్లకు రూ.70.64 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించింది.
ఇందులో అభివృద్ధి పనుల ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కింద 63 మందికి రెండేళ్లలో రూ.62.36 కోట్లు చెల్లిస్తారు. అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగం భాగసామ్యాన్ని ప్రోత్సహించేందుకు నియమితులయ్యే ఐదుగురు కన్సల్టెంట్లకు మూడేళ్లలో రూ.8.28 కోట్లు చెల్లించనున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. ఒక్కో కన్సల్టెంట్‌కు నెలకు రూ. 2 అక్షల నుంచి రూ. 5 లక్షల వరకు చెల్లించనున్నట్లు ప్రతిపాదనల ఆహ్వాన పత్రంలో సీఆర్‌డీఏ తెలిపింది. పనుల్లో నాణ్యత, సాంకేతికతకు ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు సహకారం అందిస్తారు.
పనుల కాల వ్యవధిని ఏకీకృతం చేయడం, సమయానికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించడం, గడువులోగా బడ్జెట్ విడుదల ప్రణాళికను వీరు రూపొందిస్తారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో అమలు చేసే కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, పురోగతి నివేదికలను సమర్పించాలి. పనులకు అవసరమైన మెటీరియల్ సేకరణ కోసం ఐటీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలి. పర్యావరణ, సామాజిక పర్యవేక్షణ, ఆస్తి నిర్వహణ కార్యకలాపాలను నిర్వహించడం వీరి విధులని సీఆర్‌డీఏ తెలిపింది.
ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం కోసం
అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం, ప్రపంచంలో అగ్రశ్రేణి పెట్టుబడి గమ్యస్థానంగా రాజధానిని బ్రాండింగ్, ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మార్కెటింగ్, ఔట్‌రీచ్ వ్యూహం అమలు వీరి విధి. ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థిక వనరుల వినియోగంతోపాటు, ప్రైవేటు రంగాన్ని ప్రభావితం చేయడానికి పీపీపీ విధానంలో వినూత్న ఆర్థిక విధానాలతో పెట్టుబడులను తేవాలి. పారిశ్రామిక రంగంలో పోటీతత్వ పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించాలి. ఆర్థిక అభివృద్ధి వ్యూహం ఆధారంగా రోడ్ మ్యాప్‌ను రూపొందించాలి. ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాల కోసం అవసరమైన నిధులు, పద్ధతులను గుర్తించి, వీటి అమలుకు వ్యూహాన్ని అభివృద్ధి చేయాలని సీఆర్‌డీఏ ఆ పత్రంలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment