
రాజధానిలో జీ+1 పద్ధతిలో మంత్రులు, న్యాయమూర్తులకు 71 బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్
భూమి ప్రభుత్వానిదే.. ఇసుక కూడా ఉచితం.. మిగిలిన పనులకు ఈ స్థాయిలో వ్యయాన్ని నిర్ణయించడంపై బిల్డర్లు, ఇంజనీర్లలో తీవ్ర విస్మయం
విజయవాడ, గుంటూరు సమీపంలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో అధునాతన విల్లాలు భూమి విలువతో కలిపినా రూ.నాలుగు కోట్ల లోపే..
కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడానికే ముఖ్యనేతలు అంచనా వ్యయాన్ని పెంచేశారంటున్న బిల్డర్లు
ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీ ఎత్తున దోపిడీకి రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: అప్పు చేసి పప్పు కూడు తినకూడదంటారు పెద్దలు! ఎందుకంటే అది అప్పు కాబట్టి.. అసలు, వడ్డీతో తీర్చాలి కాబట్టి..! వృథా చేస్తే భారం అవుతుంది కాబట్టి..! పెద్దలే కాదు.. ఎవరైనా సరే చేసిన అప్పులో ఒక్క పైసా కూడా వృథా చేయడానికి ఇష్టపడరు. కానీ.. కూటమి ప్రభుత్వం ముఖ్యనేతలు మాత్రం తద్భిన్నం.
రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి తెచ్చిన అప్పులు.. హడ్కో లాంటి జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తేనున్న రుణాలతో చేపట్టే పనుల అంచనా వ్యయాన్ని కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీ ఎత్తున పెంచేసి దోచుకోవడానికి ప్రణాళిక రచించారు. రాజధానిలో మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 71 బంగ్లాల నిర్మాణానికి సీఆర్‌డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ దీనికి మరో తార్కాణం.
బిడ్‌లు దాఖలుకు 3వతేదీ తుది గడువు..
రాజధాని ప్రాంతంలో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం జీ+1 పద్ధతిలో 35 బంగ్లాలు నిర్మిస్తున్నారు. మరో 24.13 ఎకరాల్లో ఒకొక్కటి 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణాన్ని చేపట్టారు. వీటికోసం మొత్తం రూ.401,37,22,221 కాంట్రాక్టు విలువతో సీఆర్‌డీఏ కమిషనర్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
రహదారులు, తాగునీరు, విద్యుత్ సరఫరా, మురుగునీటి వ్యవస్థ, హోమ్ ఆటోమేషన్ లాంటి అధునాతన సదుపాయాలతో ఈ బంగ్లాలను నిర్మించాలని పేర్కొన్నారు. ఈ పనులను 18 నెలల్లోగా పూర్తి చేయాలని.. మరో రెండేళ్లు వాటిని నిర్వహించాలని షరతు విధించారు. టెండర్‌లో పాల్గొని బిడ్‌లు దాఖలు చేసేందుకు మార్చి 3వ తేదీ తుది గడువు కాగా అదే రోజు టెక్నికల్ బిడ్ తెరవనున్నారు. మార్చి 7న ఆర్థిక బిడ్ తెరిచి తక్కువ ధర (ఎల్–1)కు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించనున్నారు.
మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులకు నిర్మిస్తున్న 71 బంగ్లాలలో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులు అని టెండర్‌లో పేర్కొన్నారు. కానీ.. టెండర్‌లో పేర్కొన్న ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే.. మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే.. నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లు స్పష్టమవుతోంది.
ఇక సీనరేజీ, జీఎస్టీ తదితర పన్నుల రూపంలో రూ.76.59 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే 71 బంగ్లాల నిర్మాణ వ్యయం రూ.477.96 కోట్లు కానుంది. అంటే.. సగటున చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.10,042.86 అవుతోంది.
భూమితో కలిపి రూ.4 కోట్లకే అత్యంత అధునాతన విల్లాలు..
నిజానికి రాజధాని ప్రాంతంతో పోల్చితే విజయవాడ, గుంటూరు పరిసరాలు.. విజయవాడ–గుంటూరు హైవే సమీపంలో భూముల ధరలు అధికంగా ఉన్నాయి. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం సీఆర్‌డీఏ నిర్మించ తలపెట్టిన బంగ్లాల తరహాలోనే.. అత్యంత అధునాతనంగా, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భూమి విలువతో కలిపి విజయవాడ, గుంటూరు, విజయవాడ–గుంటూరు హైవే ప్రాంతాల్లో రూ.నాలుగు కోట్ల లోపే విల్లాలు అందుబాటులో ఉన్నాయని రియల్టర్లు, బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు.
సీఆర్‌డీఏ నిర్మిస్తున్న బంగ్లాలకు భూమి ఉచితం.. ఇసుక ఉచితం.. అయినా సరే నిర్మాణ వ్యయం ఒక్కో బంగ్లాకు ఏకంగా రూ.6.73 కోట్లుగా నిర్ణయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బంగ్లాల ముసుగులో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారుతున్నాయని పేర్కొంటున్నారు.
కాంట్రాక్టు విలువపై సర్వత్రా విస్మయం..
రాజధాని ప్రాంతంలో రహదారులు, ముంపు ముప్పు నివారణ పనుల నుంచి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల వరకూ అంచనా వ్యయాన్ని వాస్తవ ధరల కంటే రెండింతలు పెంచేసి సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తూ వస్తుండటంపై ఇంజనీర్లు, బిల్డర్లు, రియల్టర్లు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణ పనుల టెండర్‌లోనూ అదే ఆనవాయితీని కొనసాగించిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పటికే ఈ బంగ్లాల పునాది పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రూ.76.59 కోట్ల మేర రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చి.. రూ.401.37 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారమే కేవలం రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో ఇసుక ఉచితంగా, విస్తారంగా లభిస్తోందని గుర్తు చేస్తున్నారు. గత ఐదేళ్లుగా సిమెంటు, ఇనుము తదితర నిర్మాణ సామగ్రి ధరలలో పెద్దగా మార్పులేదు.
అయినా సరే అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయడాన్ని బట్టి చూస్తుంటే... ముఖ్యనేతలు అడిగినంత కమీషన్ చెల్లించే కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టేందుకేనని స్పష్టమవుతోందని బిల్డర్లు పేర్కొంటున్నారు. కాంట్రాక్టు విలువలో పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి.. అందులో తిరిగి ఎనిమిది శాతం కమీషన్‌గా వసూలు చేసుకుని.. నీకింత నాకింత అనే ధోరణిలో పంచుకుతింటున్నారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment