Bungalows
-
సింగపూర్‌లో భారీ కుంభకోణం.. రూ.4492 కోట్ల ఆస్తులు స్వాధీనం
సింగపూర్: సింగపూర్ అడ్డాగా చేసుకుని హవాలాకు పాల్పడుతున్న ఒక విదేశీ ముఠా అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టారు సింగపూర్ పోలీసులు. వారి నుంచి బంగ్లాలు, కార్లు, నగదు, నగలు, బంగారు బిస్కెట్లు అన్నీ కలిపి సుమారు 734.32 మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ. 4491 కోట్లు) ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సింగపూర్ పోలీసులు. సింగపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఆర్చార్డ్ రోడ్ షాపింగ్ బెల్ట్ నుండి సెంటోసా రిసార్ట్ ఐలాండ్ వరకు జరిపిన సోదాల్లో సుమారు 400 మంది పోలీసు బలగాలు పాల్గొన్నాయని ఈ ముఠా కోసం నగరమంతా జల్లెడ పట్టామని అన్నారు. ప్రధానంగా తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో 94 ఆస్తులు, 110 మిలియన్ సింగపూర్ డాలర్లు (రూ. 672 కోట్లు) ఉన్న బ్యాంక్ అకౌంట్లు, 50 లగ్జరీ వాహనాలు, 23 మిలియన్ సింగపూర్ డాలర్లు(140 కోట్ల) నగదు కట్టలు, వందలకొద్దీ హ్యాండ్ బ్యాగులు, నగలు బంగారు బిస్కెట్లు.. మొత్తంగా రూ. 4491 కోట్ల ఆస్తులు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఆయా దేశాలకు చెందిన 31 నుండి 44 వయస్సు మధ్యలో ఉన్న పది మంది ముఠాను పట్టుకున్నామని.. వారిని చైనా, కంబోడియా, సిప్రాస్, వణువతు ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. ఈ ముఠాలో సిప్రాస్ కు చెందిన వ్యక్తి తప్పించుకోబోయి తన బంగ్లా రెండో అంతస్తు నుంచి దూకగా అతడికి స్వల్ప గాయాలయ్యాయని ఆసుపత్రిలో చేర్పించామని చెప్పారు పోలీసులు. ఈ ముఠా ఆన్లైన్లో జూదం, విదేశీ మాఫియా, ఇతర స్కాముల తోపాటు ఇతర క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో సోదాలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. సింగపూర్ మానిటరీ అథారిటీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపింది. ఈ ముఠాకి సహకరించిన ఆర్ధిక సంస్థలను ఉపేక్షించేది లేదని తెలిపింది. ఈ సందర్బంగా పోలీసు శాఖలోని వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ డేవిడ్ చ్యు మాట్లాడుతూ మీరు దొరికితే మిమ్మల్ని అరెస్టు చేస్తాం, అక్రమంగా సంపాదించిన మీ ఆస్తులు దొరికితే వాటిని సీజ్ చేస్తామని అన్నారు. 2021 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 12% మాత్రమే విదేశీ నగదు వృద్ధి చెందగా కేవలం సింగపూర్ లోనే విదేశీ ధన ప్రవాహం 16% వృద్ధి చెందింది. అందుకే సింగపూర్ పోలీసులు అక్రమార్కులపై కొరడా ఝళిపించారు. ఇది కూడా చదవండి: భార్యను చంపిన జడ్జి.. ఇంట్లో 47 తుపాకులు, మందుగుండు సామాగ్రి.. -
ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయండి: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ వసతి గృహాలను ఖాళీ చేయాల్సిందిగా కళాకారులను కేంద్రం కోరింది. అందులో భాగంగా బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒడిస్సీ డ్యాన్సర్ గురు మాయాధర్ రౌత్(90)ను అధికారులు వసతి గృహం నుంచి బయటకు పంపించేశారు. దీంతో ఆయన నిరాశ్రయులయ్యారు. వివరాల ప్రకారం.. దశాబ్దాల క్రితం ప్రముఖ కళాకారుల కోసం కేంద్రం ఢిల్లీలో వసతి గృహాలను అందించింది. కాగా, వసతి గృహాల్లో వారు ఉండటాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2014లో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వారు ఇళ్లను ఖాళీ చేయాలని 2020లో నోటీసు జారీ చేసింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీ హైకోర్టు కూడా ఎనిమిది కళాకారులు బంగ్లాలను ఏప్రిల్ 25వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించుకుంటే చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో వారు ఖాళీ చేయకపోవడంతో గురు మాయాధర్ రౌత్‌ను వసతి గృహం నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా గురు మాయాధర్ రౌత్ కూతురు మధుమితా రౌత్ మాట్లాడుతూ.. ఆ ఇంటిని తన తండ్రికి 25 ఏళ్ల క్రితం కేటాయించారని చెప్పింది. బలవంతంగా తమను బంగ్లా నుంచి బయటకు పంపిచేశారని ఆరోపించింది. పోలీసులు తమ వస్తువులను బయటకు విసిరేశారని విమర్శించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘28 మంది కళాకారులలో దాదాపు ఎనిమిది మందికి అనేకసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ తమ ప్రభుత్వ వసతి గృహాల నుండి బయటకు వెళ్లలేదు. దీంతో వారికి నోటీసులు ఇచ్చాము.’’ అని అన్నారు. -
బచ్చన్ భవంతులకు భద్రత పెంపు
ముంబై: బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ఆయన భార్య, సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్‌కు ముంబైలో ఉన్న బంగళాలకు పోలీసుల రక్షణ పెంచారు. సినీ పరిశ్రమపై బురద చల్లవద్దంటూ జయాబచ్చన్ పార్లమెంట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తన ప్రసంగంలో కంగన, రవికిషన్ను జయాబచ్చన్ పరోక్షంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమితాబ్ ఎక్స్ కేటగిరీ భద్రత పొందుతున్నారని, జయాబచ్చన్ ప్రసంగానంతరం జుహులో వారి భవంతుల బయట భద్రతను, పెట్రోలింగ్‌ను పెంచామని పోలీసు అధికారులు చెప్పారు. జుహులో బచ్చన్ కుటుంబానికి జల్సా, జనక్, ప్రతీక్ష పేరిట మూడు బంగ్లాలున్నాయి. వీటిలో జల్సా, ప్రతీక్షల్లో అమితాబ్ కుటుంబం నివశిస్తోంది. -
27 మాజీ ఎంపీలకు షాక్
ఢిల్లీ: అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయాల్సిందిగా మాజీ ఎంపీలకు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోతోంది. దీంతో 27 మంది మాజీ పార్లమెంట్ సభ్యులకు మంగళవారం కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మాజీ ఎంపీలు పదవీ కాలం ముగిసినప్పకీ ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాలను ఖాళీ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీల ఇళ్లకు నీళ్లు, కరెంట్, గ్యాస్ కనెక్షన్లు వెంటనే నిలివేయాలని లోక్‌సభ హౌస్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే మాజీలు భవనాలను ఖాళీ చేయాలని హెచ్చరించింది. కాగా ల్యూటెన్స్ ఢిల్లీలోని ఎంపీల అధికారిక భవనాల నుంచి ఇంకా 82 మంది మాజీలు ఖాళీ చేయాల్సి ఉందని గతంలో అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయని ఎంపీల వైఖరిపై ప్రభుత్వం మండిపడింది. మాజీ ఎంపీల నివాసాలను ఖాళీ చేయకపోవడంతో ప్రస్తుత ఎన్నికైన ఎంపీలకు వేరేచోట్ల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చదవండి: బంగళాలు వీడని మాజీలు -
బంగళాలు వీడని మాజీలు
న్యూఢిల్లీ: ఎంపీల అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయాల్సిందిగా మాజీ ఎంపీలకు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోతోంది. ల్యూటెన్స్ ఢిల్లీలోని ఎంపీల అధికారిక భవనాల నుంచి ఇంకా 82 మంది మాజీలు ఖాళీ చేయాల్సి ఉందని అధికారులు ఆదివారం తెలిపారు. ఈ నేపథ్యంలో వారిపై పబ్లిక్ ప్రెమిసెస్ చట్టాన్ని ప్రయోగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ లోక్ సభకు కొత్తగా ఎంపికైన వారికి బంగళాలు కేటాయించాల్సి ఉండగా, మాజీ ఎంపీలు తమ నివాసాలను ఖాళీ చేయలేదు. దీంతో ప్రస్తుత ఎంపీలకు వేరే చోట్ల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు. త్వరలో నోటీసులు.. గడువు ముగిసినా నివాసాలు ఖాళీ చేయని దాదాపు 200 మంది మాజీ ఎంపీలకు గతనెల 19న సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ వారంలోగా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లోగా కరెంటు, నీరు, వంటగ్యాస్ నిలిపి వేస్తామని స్పష్టంచేసింది. దీంతో కొందరు నివాసాలను ఖాళీ చేయగా ఇంకా 82 మంది మాజీ ఎంపీలు అక్కడే తిష్ట వేశారు. ఖాళీ చేయనివారిపై కఠిన చర్యలుంటాయని లోక్‌సభ హౌసింగ్ కమిటీ పేర్కొంది. -
ఖాళీ చేస్తారా.. లేదా..!
సాక్షి, ముంబై: పదవులు ఊడినప్పటికీ ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేయకుండా సతాయిస్తున్న మాజీ మంత్రులకు ముకుతాడు వేయాలని సాధారణ పరిపాలన విభాగం నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణీత గడువులోగా బంగళాలు ఖాళీ చేయని మంత్రుల నుంచి ఐదు రెట్లు ఎక్కువ అద్దె వసూలు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాధారణ పరిపాలన విభాగం 2014 మార్చి ఒకటో తేదీన ఓ జీవోను జారీ చేసింది. అందులో పొందుపర్చిన వివరాలిలా ఉన్నాయి... మంత్రులు తమ పదవులకు రాజీనామ చేసినా... లేదా ఎన్నికల్లో ఓడిపోవడం, అనివార్య కారణాలవల్ల పదవి ఊడిపోయినా.... ఆ తేదీ నుంచి 15 రోజుల్లోగా వారికి అధికారికంగా కేటాయించిన బంగళాలను ఖాళీ చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. కాని అద్దె చాలా తక్కువ ఉండడం, వివిధ సౌకర్యాలు ఉచితంగా అనుభవించేందుకు అవకాశం ఉండటంతో అనేక మంది మంత్రులు బంగళాలను ఖాళీ చేయకుండా మొండికేస్తున్నారు. ప్రభుత్వం నోటీసులు జారీచేసినప్పటికీ తమ పలుకుబడిని ఉపయోగిస్తూ అందులో బలవంతంగా ఉంటున్నారు. కొత్తగా పదవులు లభించిన మంత్రులు తమ సొంత ఫ్లాట్లలో లేదా అతిథి గృహాలలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో మాజీ మంత్రుల ఆగడాలకు కళ్లెం వేయాలని సాధారణ పరిపాలన విభాగం నిర్ణయించింది. ఇక నుంచి నిర్ణీత గడువు (15 రోజులు) పూర్తయిన తరువాత నెలకు, ప్రతీ చదరపుటడుగుకు రూ.25 చొప్పున అద్దె, బంగళాలో సౌకర్యాలు అనుభవిస్తున్నందుకు పన్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కేవలం మూడు నెలల వరకు వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతిస్తే నెలకు ప్రతీ చదరపుటడుగుకు రూ.50 చొప్పున అద్దె చెల్లించాలి. అప్పటి గవర్నర్ కె.శంకర్నారాయణన్ ఆదేశాల మేరకు ఈ అద్దె పెంపు, సౌకర్యాల పన్నును రాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి బి.ఆర్.గావిత్ నిర్ణయించారు. ఇది వరకు ప్రభుత్వ బంగళాలో ఉంటున్న మాజీ మంత్రుల నుంచి నెలకు ప్రతీ చదరపుటడుగుకు కేవలం రూ.ఐదు అద్దె వసూలు చేసేవారు. ఇక నుంచి ఐదు రేట్లు అద్దె పెంచడంతో పదవులు పోయినవెంటనే మంత్రులు బంగళాలు ఖాళీ చేస్తారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు వెంటనే ప్రభుత్వం బంగళాలు కేటాయించేందుకు అవకాశముంటుందని వారు అంటున్నారు. -
తెలంగాణ మంత్రులకు క్వార్టర్స్ కేటాయింపు
హైదరాబాద్: తెలంగాణ మంత్రులకు నివాస భవనాలను కేటాయించారు. బంజారాహిల్స్ లోని మంత్రుల క్వార్టర్స్ లో ఇళ్లను కేటాయించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావుకు ఏడో క్వార్టర్స్ ను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్ రావు సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు.