సింగపూర్: సింగపూర్ అడ్డాగా చేసుకుని హవాలాకు పాల్పడుతున్న ఒక విదేశీ ముఠా అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టారు సింగపూర్ పోలీసులు. వారి నుంచి బంగ్లాలు, కార్లు, నగదు, నగలు, బంగారు బిస్కెట్లు అన్నీ కలిపి సుమారు 734.32 మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ. 4491 కోట్లు) ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సింగపూర్ పోలీసులు.
సింగపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఆర్చార్డ్ రోడ్ షాపింగ్ బెల్ట్ నుండి సెంటోసా రిసార్ట్ ఐలాండ్ వరకు జరిపిన సోదాల్లో సుమారు 400 మంది పోలీసు బలగాలు పాల్గొన్నాయని ఈ ముఠా కోసం నగరమంతా జల్లెడ పట్టామని అన్నారు. ప్రధానంగా తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో 94 ఆస్తులు, 110 మిలియన్ సింగపూర్ డాలర్లు (రూ. 672 కోట్లు) ఉన్న బ్యాంక్ అకౌంట్లు, 50 లగ్జరీ వాహనాలు, 23 మిలియన్ సింగపూర్ డాలర్లు(140 కోట్ల) నగదు కట్టలు, వందలకొద్దీ హ్యాండ్ బ్యాగులు, నగలు బంగారు బిస్కెట్లు.. మొత్తంగా రూ. 4491 కోట్ల ఆస్తులు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ దాడుల్లో ఆయా దేశాలకు చెందిన 31 నుండి 44 వయస్సు మధ్యలో ఉన్న పది మంది ముఠాను పట్టుకున్నామని.. వారిని చైనా, కంబోడియా, సిప్రాస్, వణువతు ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. ఈ ముఠాలో సిప్రాస్ కు చెందిన వ్యక్తి తప్పించుకోబోయి తన బంగ్లా రెండో అంతస్తు నుంచి దూకగా అతడికి స్వల్ప గాయాలయ్యాయని ఆసుపత్రిలో చేర్పించామని చెప్పారు పోలీసులు.
ఈ ముఠా ఆన్‌లైన్‌లో జూదం, విదేశీ మాఫియా, ఇతర స్కాముల తోపాటు ఇతర క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో సోదాలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. సింగపూర్ మానిటరీ అథారిటీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపింది. ఈ ముఠాకి సహకరించిన ఆర్ధిక సంస్థలను ఉపేక్షించేది లేదని తెలిపింది.
ఈ సందర్బంగా పోలీసు శాఖలోని వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ డేవిడ్ చ్యు మాట్లాడుతూ మీరు దొరికితే మిమ్మల్ని అరెస్టు చేస్తాం, అక్రమంగా సంపాదించిన మీ ఆస్తులు దొరికితే వాటిని సీజ్ చేస్తామని అన్నారు. 2021 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 12% మాత్రమే విదేశీ నగదు వృద్ధి చెందగా కేవలం సింగపూర్ లోనే విదేశీ ధన ప్రవాహం 16% వృద్ధి చెందింది. అందుకే సింగపూర్ పోలీసులు అక్రమార్కులపై కొరడా ఝళిపించారు.
ఇది కూడా చదవండి: భార్యను చంపిన జడ్జి.. ఇంట్లో 47 తుపాకులు, మందుగుండు సామాగ్రి..
Comments
Please login to add a commentAdd a comment