సాక్షి, ముంబై: పదవులు ఊడినప్పటికీ ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేయకుండా సతాయిస్తున్న మాజీ మంత్రులకు ముకుతాడు వేయాలని సాధారణ పరిపాలన విభాగం నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణీత గడువులోగా బంగళాలు ఖాళీ చేయని మంత్రుల నుంచి ఐదు రెట్లు ఎక్కువ అద్దె వసూలు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాధారణ పరిపాలన విభాగం 2014 మార్చి ఒకటో తేదీన ఓ జీవోను జారీ చేసింది.
అందులో పొందుపర్చిన వివరాలిలా ఉన్నాయి... మంత్రులు తమ పదవులకు రాజీనామ చేసినా... లేదా ఎన్నికల్లో ఓడిపోవడం, అనివార్య కారణాలవల్ల పదవి ఊడిపోయినా.... ఆ తేదీ నుంచి 15 రోజుల్లోగా వారికి అధికారికంగా కేటాయించిన బంగళాలను ఖాళీ చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. కాని అద్దె చాలా తక్కువ ఉండడం, వివిధ సౌకర్యాలు ఉచితంగా అనుభవించేందుకు అవకాశం ఉండటంతో అనేక మంది మంత్రులు బంగళాలను ఖాళీ చేయకుండా మొండికేస్తున్నారు.
ప్రభుత్వం నోటీసులు జారీచేసినప్పటికీ తమ పలుకుబడిని ఉపయోగిస్తూ అందులో బలవంతంగా ఉంటున్నారు. కొత్తగా పదవులు లభించిన మంత్రులు తమ సొంత ఫ్లాట్లలో లేదా అతిథి గృహాలలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో మాజీ మంత్రుల ఆగడాలకు కళ్లెం వేయాలని సాధారణ పరిపాలన విభాగం నిర్ణయించింది. ఇక నుంచి నిర్ణీత గడువు (15 రోజులు) పూర్తయిన తరువాత నెలకు, ప్రతీ చదరపుటడుగుకు రూ.25 చొప్పున అద్దె, బంగళాలో సౌకర్యాలు అనుభవిస్తున్నందుకు పన్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కేవలం మూడు నెలల వరకు వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతిస్తే నెలకు ప్రతీ చదరపుటడుగుకు రూ.50 చొప్పున అద్దె చెల్లించాలి. అప్పటి గవర్నర్ కె.శంకర్‌నారాయణన్ ఆదేశాల మేరకు ఈ అద్దె పెంపు, సౌకర్యాల పన్నును రాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి బి.ఆర్.గావిత్ నిర్ణయించారు. ఇది వరకు ప్రభుత్వ బంగళాలో ఉంటున్న మాజీ మంత్రుల నుంచి నెలకు ప్రతీ చదరపుటడుగుకు కేవలం రూ.ఐదు అద్దె వసూలు చేసేవారు. ఇక నుంచి ఐదు రేట్లు అద్దె పెంచడంతో పదవులు పోయినవెంటనే మంత్రులు బంగళాలు ఖాళీ చేస్తారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు వెంటనే ప్రభుత్వం బంగళాలు కేటాయించేందుకు అవకాశముంటుందని వారు అంటున్నారు.
ఖాళీ చేస్తారా.. లేదా..!
Published Fri, Nov 7 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement
Advertisement