
విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో ముంబై జట్టు ఎదురీదుతుంది. 406 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే చివరి రోజు మరో 323 పరుగులు చేయాలి. చేతిలో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. శివమ్ దూబే (12), తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఆకాశ్ ఆనంద్ (27) క్రీజ్‌లో ఉన్నారు. ఈ రంజీ సీజన్‌లో ముంబై ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. అదే, విదర్భ ఫైనల్‌కు చేరాలంటే డ్రా చేసుకున్నా సరిపోతుంది. తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భ ఫైనల్‌కు చేరుతుంది.
కీలక ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన రహానే
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ అజింక్య రహానే నిరాశపరిచాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదిలోనే ఔటయ్యాడు. రహానే లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి వికెట్ కోల్పోవడంతో ముంబై కష్టాల్లో పడింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ముంబై గెలవలేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ముంబైకి ఒరిగేదేమీ లేదు. కాబట్టి చివరి రోజు ముంబై గెలుపు కోసమే ఆడాలి. ఆ జట్టు ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్‌లపై గంపెడాశలు పెట్టుకుంది.
వీరి తర్వాత క్రీజ్‌లోకి వచ్చే సూర్యకుమార్ యాదవ్‌పై పెద్దగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. స్కై.. వేగంగా పరుగులు సాధించగలిగినా వికెట్ కాపాడుకుంటాడన్న గ్యారెంటీ లేదు. చివరి రోజు 90 ఓవర్ల ఆటకు ఆస్కారముంటుంది. దూబే, ఆకాశ్ ఆనంద్, సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే ముంబై సంచలన విజయం సాధించే అవకాశం ఉంటుంది.
దూబే, ఆకాశ్ ఆనంద్, సూర్యకుమార్ తర్వాత కూడా ముంబై బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. షమ్స్ ములానీ, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ కూడా బ్యాటింగ్ చేయగల సమర్థులే. అయితే లక్ష్యం భారీగా ఉండటంతో వీరిపై అంచనాలు పెట్టుకోలేని పరిస్థితి ఉంది.
అంతకుముందు విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులు చేసి ముంబై ముందు కొండంత లక్షాన్ని ఉంచింది. యశ్ రాథోడ్ 151 పరుగులు చేసి విదర్భ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. యశ్‌కు కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (52) సహకరించాడు. వీరిద్దరి నుంచి ఈ స్థాయి ఇన్నింగ్స్‌లు రాకపోయుంటే విదర్భ ముంబై ముందు ఇంత భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయేది. విదర్భను రెండో ఇన్నింగ్స్‌లో షమ్స్ ములానీ దెబ్బకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ములానీ ఆరు వికెట్లు తీశాడు. తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు.
దీనికి ముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (106) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీతో ముంబై పరువు కాపాడాడు. ఆకాశ్ ఆనంద్‌కు సిద్దేశ్ లాడ్ (35), శార్దూల్ ఠాకూర్ (37), తనుశ్ కోటియన్ (33) కాసేపు సహకరించారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే 4, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2, దర్శన్ నల్కండే, భూటే చెరో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించగా.. షమ్స్‌ములానీ, రాయ్‌స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment