
న్యూఢిల్లీ: ఎంపీల అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయాల్సిందిగా మాజీ ఎంపీలకు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోతోంది. ల్యూటెన్స్ ఢిల్లీలోని ఎంపీల అధికారిక భవనాల నుంచి ఇంకా 82 మంది మాజీలు ఖాళీ చేయాల్సి ఉందని అధికారులు ఆదివారం తెలిపారు. ఈ నేపథ్యంలో వారిపై పబ్లిక్ ప్రెమిసెస్ చట్టాన్ని ప్రయోగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ లోక్ సభకు కొత్తగా ఎంపికైన వారికి బంగళాలు కేటాయించాల్సి ఉండగా, మాజీ ఎంపీలు తమ నివాసాలను ఖాళీ చేయలేదు. దీంతో ప్రస్తుత ఎంపీలకు వేరే చోట్ల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు.
త్వరలో నోటీసులు..
గడువు ముగిసినా నివాసాలు ఖాళీ చేయని దాదాపు 200 మంది మాజీ ఎంపీలకు గతనెల 19న సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ వారంలోగా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లోగా కరెంటు, నీరు, వంటగ్యాస్ నిలిపి వేస్తామని స్పష్టంచేసింది. దీంతో కొందరు నివాసాలను ఖాళీ చేయగా ఇంకా 82 మంది మాజీ ఎంపీలు అక్కడే తిష్ట వేశారు. ఖాళీ చేయనివారిపై కఠిన చర్యలుంటాయని లోక్‌సభ హౌసింగ్ కమిటీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment