temporary allocations
-
27 మాజీ ఎంపీలకు షాక్
ఢిల్లీ: అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయాల్సిందిగా మాజీ ఎంపీలకు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోతోంది. దీంతో 27 మంది మాజీ పార్లమెంట్ సభ్యులకు మంగళవారం కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మాజీ ఎంపీలు పదవీ కాలం ముగిసినప్పకీ ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాలను ఖాళీ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీల ఇళ్లకు నీళ్లు, కరెంట్, గ్యాస్ కనెక్షన్లు వెంటనే నిలివేయాలని లోక్‌సభ హౌస్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే మాజీలు భవనాలను ఖాళీ చేయాలని హెచ్చరించింది. కాగా ల్యూటెన్స్ ఢిల్లీలోని ఎంపీల అధికారిక భవనాల నుంచి ఇంకా 82 మంది మాజీలు ఖాళీ చేయాల్సి ఉందని గతంలో అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయని ఎంపీల వైఖరిపై ప్రభుత్వం మండిపడింది. మాజీ ఎంపీల నివాసాలను ఖాళీ చేయకపోవడంతో ప్రస్తుత ఎన్నికైన ఎంపీలకు వేరేచోట్ల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చదవండి: బంగళాలు వీడని మాజీలు -
తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల ఎంపిక
సాక్షి, సిద్దిపేట: తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల నియామక ప్రక్రియ నేడు (శుక్రవారం) సంగారెడ్డిలో చేపడుతున్నట్లు సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్మోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ సంస్థలోని వివిధ సంఘాలు ఈ నెల 5వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్చినందున ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తాత్కలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపడుతున్నట్లు తెలిపారు. డ్రైవర్ల ఎంపిక ప్రక్రియ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సంగారెడ్డి ఆర్టీఓ కార్యాలయంలో ఉంటుందన్నారు. ఈ డ్రైవర్ పోస్టుకు 18నెలల కాల పరిమితి పూర్తయిన హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 25 నుంచి 50 ఏళ్ల వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు. అలాగే కండక్టర్లకు అదేరోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సంగారెడ్డి డిపో అవరణలో ఎంపిక ప్రక్రియ ఉంటుందని, దీనికి 10వ తరగతి పాసైన వారు అర్హులన్నారు. ఎంపికైన వారు 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్‌ను సంబంధిత డిపో మేనేజర్ వద్ద సమ్మె కాలంలో భద్రపరచవలసి ఉంటుందని తెలిపారు. రిటైర్డ్ అయిన సూపర్వైజర్లు, అధికారులు, మెకానిక్, క్లరికల్ స్టాఫ్ పనిచేయడానికి ఆసక్తిగల వారు రీజనల్ మేనేజర్ సంగారెడ్డి కార్యాలయంలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలలోపు సంప్రదించాలన్నారు. జీతం రిటైర్డ్ అధికారులు, సూపర్వైజర్లకు రోజుకు రూ.1,500, రిటైర్డ్ మెకానిక్, క్లరికల్ ఉద్యోగులకు రోజుకు రూ.1,000 వరకు ఉంటుందని, డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రోజుకు రూ.1,000 ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 99592 26266, సిద్దిపేట డివిజనల్ ఫోన్ నంబర్ 99592 26263లలో సంప్రదించాలని సూచించారు. -
బంగళాలు వీడని మాజీలు
న్యూఢిల్లీ: ఎంపీల అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయాల్సిందిగా మాజీ ఎంపీలకు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోతోంది. ల్యూటెన్స్ ఢిల్లీలోని ఎంపీల అధికారిక భవనాల నుంచి ఇంకా 82 మంది మాజీలు ఖాళీ చేయాల్సి ఉందని అధికారులు ఆదివారం తెలిపారు. ఈ నేపథ్యంలో వారిపై పబ్లిక్ ప్రెమిసెస్ చట్టాన్ని ప్రయోగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ లోక్ సభకు కొత్తగా ఎంపికైన వారికి బంగళాలు కేటాయించాల్సి ఉండగా, మాజీ ఎంపీలు తమ నివాసాలను ఖాళీ చేయలేదు. దీంతో ప్రస్తుత ఎంపీలకు వేరే చోట్ల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు. త్వరలో నోటీసులు.. గడువు ముగిసినా నివాసాలు ఖాళీ చేయని దాదాపు 200 మంది మాజీ ఎంపీలకు గతనెల 19న సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ వారంలోగా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లోగా కరెంటు, నీరు, వంటగ్యాస్ నిలిపి వేస్తామని స్పష్టంచేసింది. దీంతో కొందరు నివాసాలను ఖాళీ చేయగా ఇంకా 82 మంది మాజీ ఎంపీలు అక్కడే తిష్ట వేశారు. ఖాళీ చేయనివారిపై కఠిన చర్యలుంటాయని లోక్‌సభ హౌసింగ్ కమిటీ పేర్కొంది. -
ఉద్యోగుల బదిలీలకు కొత్త చిక్కులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. బదిలీల దరఖాస్తులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్డర్ టు సర్వ్ కింద చేసిన తాత్కాలిక కేటాయింపులను క్రమబద్ధీకరించకుండా బదిలీలకు అవకాశమిస్తే పాత జిల్లా కేంద్రాల్లోని వారు బదిలీలపై వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్ కింద వెళ్లిన ఉద్యోగులు పాత జిల్లాల పరిధిలోకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి నెలకొంది. అలాంటివారికి ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారన్నదే ప్రధాన సమస్య. అసలు బదిలీలను ఎవరు చేయాలన్నదీ సమస్యగానే మారింది. బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో పాత జిల్లాల ప్రకారం బదిలీలు చేస్తారని పేర్కొన్నారే తప్ప పాత జిల్లా కలెక్టర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించలేదు. అలాంటప్పుడు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పాత జిల్లాల కలెక్టర్లు ఏ అధికారంతో బదిలీ చేస్తారని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అవేమీ సమస్యలు కాబోవని మరికొన్ని సంఘాల నేతలు చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పేర్కొంటున్న అంశాలు.. ► కొత్త జిల్లాల్లో కేడర్ స్ట్రెంత్ నిర్ణయించలేదు. ఆర్డర్ టు సర్వ్‌పై వెళ్లిన వారిని అక్కడ క్రమబద్ధీకరించలేదు. అలాంటప్పుడు బదిలీలపై కొత్త జిల్లాల్లో ఉద్యోగులను ఏ పోస్టుల్లోకి పంపిస్తారు? ► ఆర్డర్ టు సర్వ్ కింద వెళ్లినవారికి పనిచేస్తున్న చోట రెండేళ్ల సర్వీసు లేకపోయినా బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు వారు దరఖాస్తు చేసుకొని పాత జిల్లాలకు వెళ్లే వీలుంది. కానీ పాత ఆదిలాబాద్ వంటి జిల్లాలకు చెందిన, ఆర్డర్ టు సర్వ్‌పై ఆసిఫాబాద్‌కు వెళ్లిన ఉద్యోగులు ఇప్పుడు బదిలీపై ఆదిలాబాద్ వచ్చేందుకు ఇష్టపడతారు. అదే ఆదిలాబాద్‌లో ఉన్న వారు మాత్రం ఆసిఫాబాద్ వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి లేదు. ► పునర్విభజనతో జిల్లాల పరిధులు మారాయి. ఒక జిల్లాలోని ఉద్యోగులు మరో జిల్లా పరిధిలోకి వచ్చారు. ఇప్పుడు వారిని పాత జిల్లా కలెక్టర్లు ఎలా బదిలీ చేస్తారన్నది ప్రశ్న. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ ప్రాంతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వచ్చింది. వారిప్పుడు భూపాలపల్లి జిల్లా పరిధిలోనే ఉంటామనే అవకాశముంది. ► రాష్ట్రంలో 2013 తర్వాత ఉద్యోగుల బదిలీలు లేవు. దీంతో ప్రస్తుత నిబంధన ప్రకారం పనిచేసే చోట రెండేళ్ల సర్వీసున్న ప్రతివారూ బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశముంది. కానీ 40 శాతం మందినే బదిలీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా 60 శాతం మందికి బదిలీకి అర్హత ఉన్నా పాత స్థానాల్లోనే ఉండక తప్పదు. వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ► త్వరలో పంచాయతీ ఎన్నికలున్నందున ఇప్పుడు బదిలీలు చేస్తే ఎన్నికల నిర్వహణ కొత్తవారికి సమస్యగా ఉంటుందేమోనంటున్నారు. రెవెన్యూ రికార్డుల సవరణకూ ఇదే ఇబ్బంది ఎదురు కావచ్చు. ► బదిలీ స్టేషన్‌కు టౌన్, విలేజ్ అని బదిలీ ఉత్తర్వుల్లో వివరణ ఇచ్చారు. దాని ప్రకారం జీహెచ్ఎంసీ ఒక యూనిట్ అవుతోంది. జోన్, మల్టీ జోన్ పోస్టుల్లోని ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారు జీహెచ్ఎంసీకి వచ్చే వీలుంది. కానీ జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యాలయాల్లో పని చేస్తున్న వారు మాత్రం ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు -
మధ్యంతర ఏర్పాట్లు చేయండి
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ట్రిబ్యునళ్లకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మధ్యంతర ఏర్పాట్లు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది. ట్రిబ్యునళ్లలో జడ్జీల నియామకాలు, వారి పదవీకాలం తదితరాలకు సంబంధించిన ఆర్థిక చట్టం–2017 రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ వచ్చిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంలో విచారణ ఇంకా కొనసాగాల్సి ఉన్నందున ప్రస్తుతానికి ట్రిబ్యునళ్లలో న్యాయమూర్తుల నియామకాల కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేయాలనీ, ఇందుకోసం సంబంధిత వర్గాలతో చర్చలు జరపాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ధర్మాసనం కోరింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదావేసింది. -
తెలంగాణ వైపు ఐఏఎస్‌ల చూపు
* తెలంగాణ వెళ్లేందుకు పెరుగుతున్న ఐఏఎస్‌ల సంఖ్య * వారిలో ఆంధ్రా సర్కారు విశ్వాసం కలిగించకపోవడమే కారణం * ప్రత్యూష్ సిన్హా వైఖరిపై కేంద్రానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన ఏపీసీఎస్ * విద్యా సంవత్సరం మధ్యలో విజయవాడ వెళ్లేందుకు అయిష్టత * ప్రధానమంత్రికి లేఖ రాయనున్న ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పలువురు ఐఏఎస్‌లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిలో విశ్వాసం కలిగించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమనే భావన వ్యక్తం అవుతోంది. పిల్లలు చదువులంతా హైదరాబాద్‌లోనేనని, విద్యా సంవత్సరం మధ్యలో ఇప్పటికిప్పుడు హఠాత్తుగా విజవాడ వెళ్లి పనిచేయాలంటే సాధ్యం కాదనేది పలువు ఐఏఎస్‌ల అభిప్రాయంగా ఉంది. తాత్కాలిక కేటాయింపులో తెలంగాణకు వెళ్లిన కేవలం ఇద్దరు ఐఏఎస్ లు పీవీ రమేశ్, జేఎస్వీ ప్రసాద్‌ను తమకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుండగా... మరోవైపు ఆంధ్రాకు కేటాయించిన పలువురు ఐఏఎస్‌లు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. కరుణ, ప్రశాంతి, వాణీమోహన్‌తో పాటు అనేకమంది ఐఏఎస్‌లు తెలంగాణలో పనిచేస్తామని కోరుతున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర కేడర్ ఐఏఎస్‌లు కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలను విజయవాడకు తరలిస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో... విద్యా సంవత్సరం మధ్యలో ఎలా వెళ్తామని ఐఏఎస్‌లు, ఉద్యోగులు కూడా ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ వాతావరణంతో పాటు పిల్లల చదువులే ఇందుకు ప్రధాన కారణమని పలువురు పేర్కొంటున్నారు. తెలంగాణకు వెళ్లేందుకు రోజు రోజుకు ఐఏఎస్‌ల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదికను సమర్పించడంలో జాప్యం చేయడాన్ని నివారించాలనేది ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది. ఇందులో భాగంగా ప్రత్యూష్ సిన్హా కమిటీ జాప్యం పట్ల ఫిర్యాదు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు బుధవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. తాత్కాలిక కేటాయింపులే తుది కేటాయింపులని రెండు రాష్ట్రాల సీఎస్ల సమావేశంలో చెప్పిన ప్రత్యూష్ సిన్హా కమిటీ... ఇప్పుడు 1983 బ్యాచ్‌కు చెందిన వినయ్‌కుమార్‌ను తెలంగాణకు కేటాయించేందుకు వీలుగా జాప్యం చేస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన కుంటుపడుతోందని, వెంటనే జోక్యం చేసుకుని అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీని పూర్తి చేయాలని కోరారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ తీరుపట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రి మోడీకి కూడా లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జాప్యం చేయకుండా అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీని పూర్తి చేయాలని, ఇప్పటికే పరిపాలన వ్యవస్థలో అనిశ్చితి నెలకొందని ఆ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొననున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా తాను కేంద్ర సర్వీసులో పనిచేసిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రత్యూష్ సిన్హా కమిటీని వినయ్‌కుమార్ కోరారు. ఆ సర్వీసు పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి వెళ్తానని, భవిష్యత్‌లో సీఎస్ అయ్యే అవకాశం ఉంటుందనేది ఆయన ఆలోచనగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.