* తెలంగాణ వెళ్లేందుకు పెరుగుతున్న ఐఏఎస్‌ల సంఖ్య
* వారిలో ఆంధ్రా సర్కారు విశ్వాసం కలిగించకపోవడమే కారణం
* ప్రత్యూష్ సిన్హా వైఖరిపై కేంద్రానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన ఏపీసీఎస్
* విద్యా సంవత్సరం మధ్యలో విజయవాడ వెళ్లేందుకు అయిష్టత
* ప్రధానమంత్రికి లేఖ రాయనున్న ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పలువురు ఐఏఎస్‌లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిలో విశ్వాసం కలిగించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమనే భావన వ్యక్తం అవుతోంది. పిల్లలు చదువులంతా హైదరాబాద్‌లోనేనని, విద్యా సంవత్సరం మధ్యలో ఇప్పటికిప్పుడు హఠాత్తుగా విజవాడ వెళ్లి పనిచేయాలంటే సాధ్యం కాదనేది పలువు ఐఏఎస్‌ల అభిప్రాయంగా ఉంది. తాత్కాలిక కేటాయింపులో తెలంగాణకు వెళ్లిన కేవలం ఇద్దరు ఐఏఎస్ లు పీవీ రమేశ్, జేఎస్‌వీ ప్రసాద్‌ను తమకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుండగా... మరోవైపు ఆంధ్రాకు కేటాయించిన పలువురు ఐఏఎస్‌లు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు.
కరుణ, ప్రశాంతి, వాణీమోహన్‌తో పాటు అనేకమంది ఐఏఎస్‌లు తెలంగాణలో పనిచేస్తామని కోరుతున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర కేడర్ ఐఏఎస్‌లు కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలను విజయవాడకు తరలిస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో... విద్యా సంవత్సరం మధ్యలో ఎలా వెళ్తామని ఐఏఎస్‌లు, ఉద్యోగులు కూడా ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ వాతావరణంతో పాటు పిల్లల చదువులే ఇందుకు ప్రధాన కారణమని పలువురు పేర్కొంటున్నారు. తెలంగాణకు వెళ్లేందుకు రోజు రోజుకు ఐఏఎస్‌ల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదికను సమర్పించడంలో జాప్యం చేయడాన్ని నివారించాలనేది ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది. ఇందులో భాగంగా ప్రత్యూష్ సిన్హా కమిటీ జాప్యం పట్ల ఫిర్యాదు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు బుధవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. తాత్కాలిక కేటాయింపులే తుది కేటాయింపులని రెండు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశంలో చెప్పిన ప్రత్యూష్ సిన్హా కమిటీ... ఇప్పుడు 1983 బ్యాచ్‌కు చెందిన వినయ్‌కుమార్‌ను తెలంగాణకు కేటాయించేందుకు వీలుగా జాప్యం చేస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో పాలన కుంటుపడుతోందని, వెంటనే జోక్యం చేసుకుని అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీని పూర్తి చేయాలని కోరారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ తీరుపట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రి మోడీకి కూడా లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జాప్యం చేయకుండా అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీని పూర్తి చేయాలని, ఇప్పటికే పరిపాలన వ్యవస్థలో అనిశ్చితి నెలకొందని ఆ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొననున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా తాను కేంద్ర సర్వీసులో పనిచేసిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రత్యూష్ సిన్హా కమిటీని వినయ్‌కుమార్ కోరారు. ఆ సర్వీసు పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి వెళ్తానని, భవిష్యత్‌లో సీఎస్ అయ్యే అవకాశం ఉంటుందనేది ఆయన ఆలోచనగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
తెలంగాణ వైపు ఐఏఎస్‌ల చూపు
Published Thu, Sep 11 2014 3:27 AM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM
Advertisement
Advertisement