సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. బదిలీల దరఖాస్తులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్డర్ టు సర్వ్ కింద చేసిన తాత్కాలిక కేటాయింపులను క్రమబద్ధీకరించకుండా బదిలీలకు అవకాశమిస్తే పాత జిల్లా కేంద్రాల్లోని వారు బదిలీలపై వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్ కింద వెళ్లిన ఉద్యోగులు పాత జిల్లాల పరిధిలోకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి నెలకొంది. అలాంటివారికి ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారన్నదే ప్రధాన సమస్య.
అసలు బదిలీలను ఎవరు చేయాలన్నదీ సమస్యగానే మారింది. బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో పాత జిల్లాల ప్రకారం బదిలీలు చేస్తారని పేర్కొన్నారే తప్ప పాత జిల్లా కలెక్టర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించలేదు. అలాంటప్పుడు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పాత జిల్లాల కలెక్టర్లు ఏ అధికారంతో బదిలీ చేస్తారని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అవేమీ సమస్యలు కాబోవని మరికొన్ని సంఘాల నేతలు చెబుతున్నారు.
ఉద్యోగ సంఘాల నేతలు
ప్రధానంగా పేర్కొంటున్న అంశాలు..
► కొత్త జిల్లాల్లో కేడర్ స్ట్రెంత్ నిర్ణయించలేదు. ఆర్డర్ టు సర్వ్‌పై వెళ్లిన వారిని అక్కడ క్రమబద్ధీకరించలేదు. అలాంటప్పుడు బదిలీలపై కొత్త జిల్లాల్లో ఉద్యోగులను ఏ పోస్టుల్లోకి పంపిస్తారు?
► ఆర్డర్ టు సర్వ్ కింద వెళ్లినవారికి పనిచేస్తున్న చోట రెండేళ్ల సర్వీసు లేకపోయినా బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు వారు దరఖాస్తు చేసుకొని పాత జిల్లాలకు వెళ్లే వీలుంది. కానీ పాత ఆదిలాబాద్ వంటి జిల్లాలకు చెందిన, ఆర్డర్ టు సర్వ్‌పై ఆసిఫాబాద్‌కు వెళ్లిన ఉద్యోగులు ఇప్పుడు బదిలీపై ఆదిలాబాద్ వచ్చేందుకు ఇష్టపడతారు. అదే ఆదిలాబాద్‌లో ఉన్న వారు మాత్రం ఆసిఫాబాద్ వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి లేదు.
► పునర్విభజనతో జిల్లాల పరిధులు మారాయి. ఒక జిల్లాలోని ఉద్యోగులు మరో జిల్లా పరిధిలోకి వచ్చారు. ఇప్పుడు వారిని పాత జిల్లా కలెక్టర్లు ఎలా బదిలీ చేస్తారన్నది ప్రశ్న. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ ప్రాంతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వచ్చింది. వారిప్పుడు భూపాలపల్లి జిల్లా పరిధిలోనే ఉంటామనే అవకాశముంది.
► రాష్ట్రంలో 2013 తర్వాత ఉద్యోగుల బదిలీలు లేవు. దీంతో ప్రస్తుత నిబంధన ప్రకారం పనిచేసే చోట రెండేళ్ల సర్వీసున్న ప్రతివారూ బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశముంది. కానీ 40 శాతం మందినే బదిలీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా 60 శాతం మందికి బదిలీకి అర్హత ఉన్నా పాత స్థానాల్లోనే ఉండక తప్పదు. వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
► త్వరలో పంచాయతీ ఎన్నికలున్నందున ఇప్పుడు బదిలీలు చేస్తే ఎన్నికల నిర్వహణ కొత్తవారికి సమస్యగా ఉంటుందేమోనంటున్నారు. రెవెన్యూ రికార్డుల సవరణకూ ఇదే ఇబ్బంది ఎదురు కావచ్చు.
► బదిలీ స్టేషన్‌కు టౌన్, విలేజ్ అని బదిలీ ఉత్తర్వుల్లో వివరణ ఇచ్చారు. దాని ప్రకారం జీహెచ్‌ఎంసీ ఒక యూనిట్ అవుతోంది. జోన్, మల్టీ జోన్ పోస్టుల్లోని ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారు జీహెచ్‌ఎంసీకి వచ్చే వీలుంది. కానీ జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్యాలయాల్లో పని చేస్తున్న వారు మాత్రం ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు
Comments
Please login to add a commentAdd a comment