Order to serve
-
ఉద్యోగుల బదిలీలకు కొత్త చిక్కులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. బదిలీల దరఖాస్తులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్డర్ టు సర్వ్ కింద చేసిన తాత్కాలిక కేటాయింపులను క్రమబద్ధీకరించకుండా బదిలీలకు అవకాశమిస్తే పాత జిల్లా కేంద్రాల్లోని వారు బదిలీలపై వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త జిల్లాలకు ఆర్డర్ టు సర్వ్ కింద వెళ్లిన ఉద్యోగులు పాత జిల్లాల పరిధిలోకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి నెలకొంది. అలాంటివారికి ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారన్నదే ప్రధాన సమస్య. అసలు బదిలీలను ఎవరు చేయాలన్నదీ సమస్యగానే మారింది. బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో పాత జిల్లాల ప్రకారం బదిలీలు చేస్తారని పేర్కొన్నారే తప్ప పాత జిల్లా కలెక్టర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించలేదు. అలాంటప్పుడు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పాత జిల్లాల కలెక్టర్లు ఏ అధికారంతో బదిలీ చేస్తారని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అవేమీ సమస్యలు కాబోవని మరికొన్ని సంఘాల నేతలు చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పేర్కొంటున్న అంశాలు.. ► కొత్త జిల్లాల్లో కేడర్ స్ట్రెంత్ నిర్ణయించలేదు. ఆర్డర్ టు సర్వ్‌పై వెళ్లిన వారిని అక్కడ క్రమబద్ధీకరించలేదు. అలాంటప్పుడు బదిలీలపై కొత్త జిల్లాల్లో ఉద్యోగులను ఏ పోస్టుల్లోకి పంపిస్తారు? ► ఆర్డర్ టు సర్వ్ కింద వెళ్లినవారికి పనిచేస్తున్న చోట రెండేళ్ల సర్వీసు లేకపోయినా బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు వారు దరఖాస్తు చేసుకొని పాత జిల్లాలకు వెళ్లే వీలుంది. కానీ పాత ఆదిలాబాద్ వంటి జిల్లాలకు చెందిన, ఆర్డర్ టు సర్వ్‌పై ఆసిఫాబాద్‌కు వెళ్లిన ఉద్యోగులు ఇప్పుడు బదిలీపై ఆదిలాబాద్ వచ్చేందుకు ఇష్టపడతారు. అదే ఆదిలాబాద్‌లో ఉన్న వారు మాత్రం ఆసిఫాబాద్ వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి లేదు. ► పునర్విభజనతో జిల్లాల పరిధులు మారాయి. ఒక జిల్లాలోని ఉద్యోగులు మరో జిల్లా పరిధిలోకి వచ్చారు. ఇప్పుడు వారిని పాత జిల్లా కలెక్టర్లు ఎలా బదిలీ చేస్తారన్నది ప్రశ్న. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ ప్రాంతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వచ్చింది. వారిప్పుడు భూపాలపల్లి జిల్లా పరిధిలోనే ఉంటామనే అవకాశముంది. ► రాష్ట్రంలో 2013 తర్వాత ఉద్యోగుల బదిలీలు లేవు. దీంతో ప్రస్తుత నిబంధన ప్రకారం పనిచేసే చోట రెండేళ్ల సర్వీసున్న ప్రతివారూ బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశముంది. కానీ 40 శాతం మందినే బదిలీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా 60 శాతం మందికి బదిలీకి అర్హత ఉన్నా పాత స్థానాల్లోనే ఉండక తప్పదు. వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ► త్వరలో పంచాయతీ ఎన్నికలున్నందున ఇప్పుడు బదిలీలు చేస్తే ఎన్నికల నిర్వహణ కొత్తవారికి సమస్యగా ఉంటుందేమోనంటున్నారు. రెవెన్యూ రికార్డుల సవరణకూ ఇదే ఇబ్బంది ఎదురు కావచ్చు. ► బదిలీ స్టేషన్‌కు టౌన్, విలేజ్ అని బదిలీ ఉత్తర్వుల్లో వివరణ ఇచ్చారు. దాని ప్రకారం జీహెచ్ఎంసీ ఒక యూనిట్ అవుతోంది. జోన్, మల్టీ జోన్ పోస్టుల్లోని ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారు జీహెచ్ఎంసీకి వచ్చే వీలుంది. కానీ జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యాలయాల్లో పని చేస్తున్న వారు మాత్రం ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు -
ఇంకెన్నాళ్లో..?
కొత్తగూడెం: భద్రాద్రి జిల్లా ఏర్పాటు సందర్భంగా తాత్కాలిక పద్ధతి ‘ఆర్డర్ టూ సర్వ్’ పేరిట అనేక మంది ఉద్యోగులను జిల్లాలోని వివిధ శాఖలలో పాత జిల్లాల ఉద్యోగులతో ప్రభుత్వం భర్తీ చేసింది. జిల్లా ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా... ఈ ‘ఆర్డర్ టూ సర్వ్’లో మార్పు లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పోస్టుల భర్తీ తర్వాత వెంటనే తమ స్థానాలకు తిరిగి వెళ్లిపోవచ్చని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఖాళీ పోస్టులభర్తీపై ఇప్పటివరకు పెదవి విప్పకపోవడంతో ‘ఇంకెన్నాళ్లు’ అంటూ నిరాశ చెందుతున్నారు. అయితే బదిలీలను వేసవి సెలవుల్లో చేపడతామని ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా సూచనలు వస్తుండటంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ బదిలీలు ఉపాధ్యాయులకే పరిమితమా... అన్ని శాఖల ఉద్యోగులకు ఉంటుందా అనే అంశం తేలాల్సి ఉంది. ఆశల పల్లకిలో 7, 627 మంది ఉద్యోగులు... జిల్లాలో ప్రస్తుతం 7,627 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 3,470 మంది వివిధ శాఖలలో పనిచేస్తుండగా, 4,157 మంది వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఉపాధ్యాయులు తప్ప ఇతర ఉద్యోగులు అధిక శాతం జిల్లా కేంద్రంలోని పలు శాఖల్లో ఆర్డర్ టూ సర్వ్ పేరిట విధులు నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు డీఈవో కార్యాలయ సిబ్బంది మొత్తం ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చిన వారే. వీరందరినీ తాత్కాలిక పద్ధతిన నియమించిన ప్రభుత్వం.. ఆ పోస్టులను భర్తీ చేయకపోవంతో నాడు వచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భర్త ఖమ్మంలో... భార్య కొత్తగూడెం జిల్లాలో.. ఇలా వేర్వేరు చోట్ల విధులను నిర్వహించాల్సిన పరిస్థితి. అంతే కాకుండా ఈ ఆర్డర్ టూ సర్వ్, బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన వెల్లడించకపోవడంతో వచ్చే ఏడాది తమ పిల్లలను ఏ జిల్లాలోని పాఠశాలల్లో చేర్పించాలో తెలియని అయోమయంలో కొందరు ఉద్యోగులున్నారు. బదిలీలు, ప్రమోషన్ల కోసంఎదురుచూపులు... జిల్లాలో ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం ఎస్జీటీలు 2701 మంది, స్కూల్ అసిస్టెంట్లు 1348 మంది, ప్రధానోపాధ్యాయులు 108 మంది.. మొత్తం 4157 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 2015 జూలైలో ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులకు సైతం బదిలీలు నిర్వహించారు. ఈ బదిలీలు జరిగి సుమారు మూడేళ్లు కావస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బదిలీలు, ప్రమోషన్లు లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఉద్యోగస్తులైన భార్యాభర్తలు, అనారోగ్య కారణాలు ఉన్నవారు బదిలీల కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇతర శాఖల్లో ప్రమోషన్ల భర్తీ వేగవంతంగా జరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయుల్లో ‘కామన్ సర్వీస్ రూల్స్’ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉందనే కారణంతో ప్రమోషన్లను ఇప్పటి వరకు చేపట్టలేదు. దీనిపై సైతం ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రమోషన్లు లేకుండానే అనేక మంది ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చిక్కుముడులు వీడితేనే సులువు... బదిలీలను చేపడతామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇటీవల ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి అదనంగా ఉన్నవారిని కుదించే ప్రక్రియ ‘రేషనలైజేషన్’ను చేపట్టాలనే మరో డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఇటీవల టీఎస్పీఎస్సీ చేపట్టిన టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్టు పూర్తయినప్పటికీ కోర్టు కేసుతో ఫలితాలు విడుదల కాలేదు. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే ముందుగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
త్వరలో ఉద్యోగుల పరిమిత బదిలీలు
సీఎం సూచనప్రాయ అంగీకారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు పరిమిత సంఖ్యలో అవకాశమివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తల్లో ఒకరిని బదిలీ చేయడంతోపాటు అయిదేళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను త్వరలో బదిలీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు సీఎం కేసీఆర్ ఇటీవల సూచించినట్లు తెలిసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సాధారణ బదిలీలకు అవకాశం లేకపోవటంతో ఆరోగ్య సమస్యలు, కుటుంబ అవసరాలతో కొందరు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఉద్యోగ సంఘాలు పలుమార్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో సీఎస్‌ను కలసిన సందర్భంలోనూ సాధారణ బదిలీల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో సీఎం సమక్షంలో బదిలీలపై చర్చ జరిగినట్లు తెలిసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా దాదాపు 20 వేల మంది ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ పేరుతో తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. కాబట్టి ఇప్పటికిప్పుడు భారీగా బదిలీలు చేపడితే కొత్త జిల్లాల్లో పరిపాలనపై ప్రభావం పడుతుందని, ఉద్యోగుల సర్దుబాటు సమస్యాత్మకంగా మారుతుందని సీఎం అభిప్రాయం వెలిబుచ్చినట్ల తెలిసింది. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల పైరవీలు, ఒత్తిళ్లతో బదిలీల దందా సాగిందనే ఆరోపణలకు తావిచ్చినట్లవుతుందని అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు సీఎం నచ్చజెప్పినట్లు సమాచారం. అయితే అయిదేళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయడంతోపాటు భార్యాభర్తలు ఒకే చోట పనిచేయాలనే ఆలోచనతో ఆ రెండు కేటగిరీలకు అవకాశమివ్వాలని సూచనప్రాయంగా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
పాత జిల్లా పరిధిలోనే ప్రమోషన్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో తలెత్తిన గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెర దింపింది. ఈ సర్దుబాటు కేవలం తాత్కాలిక కేటాయింపుగా, తాత్కాలిక అవసరాల నిమిత్తం విధి నిర్వహణ (ఆర్డర్ టు సర్వ్)గానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ (జీవో నెం.381) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్లు, లీవ్, సర్వీసు వ్యవహారాలకు సంబంధించి ఈ ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో పని చేసిన వారికి సంబంధిత జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పరిధిలోనే సీనియారిటీ లెక్కిస్తారని స్పష్టం చేశారు. అదే తీరుగా ప్రమోషన్లు కల్పిస్తారు. మాతృ సంస్థలకు బదులు ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్‌పై ఇతర విభాగాల్లో పని చేస్తున్న వారికి పోస్టింగ్ ఇచ్చే విషయంలో ఇదే నిబంధన వర్తిస్తుంది. రాష్ట్రంలో గతంలో ఉన్న పది జిల్లాల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులను పునర్వ్యవస్థీకరణ సందర్భంగా 31 జిల్లాలకు ప్రభుత్వం సర్దుబాటు చేసింది. కొందరిని నేరుగా పదోన్నతులు కల్పించి నియామక ఉత్తర్వులివ్వగా, ఎక్కువ మంది ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులపై కొత్త జిల్లాలకు పంపింది. దీంతో తమ సీనియారిటీని ఎలా లెక్కిస్తారు.. ప్రమోషన్లు ఎలా ఇస్తారు.. బదిలీలెలా ఉంటాయి.. కొత్త జిల్లా పరిధిలోనా లేక పాత జిల్లా పరిధిని పరిగణనలోకి తీసుకుంటారా అనే సందేహాలు వెల్లువెత్తాయి. సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లకు సమీపంలో ఉన్న ఉద్యోగులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, మండలాలకు ఉద్యోగుల పంపిణీకి నిర్దేశించిన కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. -
ఉత్తర్వులు ఇచ్చేది కలెక్టరే
ఆర్డర్ టూ సర్వ్ ఉత్తర్వుల బాధ్యతల అప్పగింత కొత్తమండలాలకు తహసీల్దార్లు లేరు.. ఇన్‌చార్జిలే.. రాత్రివరకు అధికారులు కసరత్తు జేసీ ఆధ్వర్యంలో పనులు హన్మకొండ అర్బన్ : జిల్లాల విభజన ప్రక్రియ గడువు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారులు, ఉద్యోగుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అదే స్థాయి లో అయోమయం నెలకొంటోంది. ఇప్పటి వరకు నాలుగు జిల్లాలు అవుతాయా, కావా అనే ఊగిసలాటలో ఉండగా కొత్తగా జనగామ పేరు తెరపైకి రావడంతో విభజన ప్రక్రియ మళ్లీ మొదటి కొచ్చినట్లయింది. ఫైళ్లు, సామగ్రి ఇక ఐదు జిల్లాలకు పంపిణీ చేయాల్సి వస్తోంది. దీంతో ఆదివారం(2వ తేదీ) ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధుల్లో ఉన్నారు. కలెక్టర్ రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉండడంతో జిల్లా స్థాయిలో జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ పనులు చక్కబెడుతున్నా రు. ఇక జిల్లా స్థాయిలో ఉద్యోగుల విభజన, పంపిణీ, ఆర్డర్ టూ సర్వ్ ఉత్తర్వులు జారీ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకే అప్పగిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడంతో ఇక ఉద్యోగుల విభజన పనులను జిల్లా స్థాయిలో ఆరంభించారు. అందరికీ ఒక్కరే.. ఇప్పటి వరకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులను ఆర్డర్ టూ సర్వర్ ఉత్తర్వుల ద్వారా జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ఉన్న జిల్లాతో పాటు కొత్త జిల్లాలకు కేటాయిస్తారు. అయితే, ఇందుకు సంబంధించి వివిధ శాఖలు ఇప్పటికే జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ మేరకు ఉత్తర్వులు శాఖ కమిషనర్ నుంచి జారీ అవుతాయని భావించగా.. తాజాగా ఉత్తర్వుల ప్రకారం కలెక్టర్ ఈ ప్రక్రియ చేపడుతారు. వివిధ శాఖలు సిద్ధం చేసిన ఉద్యోగుల కేటాయింపుల జాబితాను కలెక్టర్ పరిశీలించి ఆమోదిస్తారు. ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసే అవకాశముంది. ఇన్చార్జ్ తహసీల్దార్లే... ప్రస్తుతం జిల్లాలో కొత్తగా సుమారు పది మండలాల వరకు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. అయితే, డీపీసీ పూర్తికానిదే కొత్తగా సీసీఎల్ఏ నుంచి తహసీల్దార్లను కేటాయించే పరిస్థితి లేదు. దీంతో కొత్త మండలాలకు పక్క మండలాల తహసీల్దార్లను ఇన్చార్జిలుగా నియమించి తొలి రోజు కార్యక్రమాలు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. డీటీ నుంచి అంతకు కింది స్థాయి ఉద్యోగులను మాత్రం పూర్తి స్థాయిలో కలెక్టర్ కేటాయించే అవకాశం ఉంది. ఇదే అంశాలపై సోమవారం రాత్రి వరకు జేసీ డీఆర్వో, ఏవోలు సమావేశమై చర్చించారు. అయితే, మండలాలు పెరగడం, కలెక్టరేట్లో సూపరింటెండెంట్లు తక్కువ సంఖ్యలో ఉండటం తో కొత్త జిల్లాలు, మండలాలకు రెవెన్యూ సిబ్బంది కొరత ఏర్పడే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. సీనియర్లకు అఫీషియేటింగ్ ఇస్తే తప్ప ఇప్పటికిప్పుడు ఈ సమస్య పరిష్కారం కాకపోవచ్చని చెబుతున్నారు. -
ఆర్డర్ టు సర్వ్
ప్రస్తుతం ఈ ప్రకారమే ఉద్యోగుల కేటాయింపు శాశ్వత కేటాయింపులకు సంవత్సరం పట్టే అవకాశం జూన్ నాటికి పూర్తి చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం మూడు జిల్లాలపైనే దృష్టి హన్మకొండ అర్బన్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. కార్యాలయాల గుర్తింపు.. సౌకర్యాలు.. ఫైళ్ల పంపిణీపై కసరత్తు జరుగుతోంది. ఈ ప్రక్రియను పూర్తిచేయడంలో తలమునకలైన ఉద్యోగుల్లో.. తమ భవితవ్యం ఏమిటనే ఆందోళన కూడా ఉంది. ఇప్పటివరకు కొత్త జిల్లాల ఏర్పాటులో భౌగోళిక అంశాలపైన దృష్టి పెట్టిన ప్రభుత్వం ఉద్యోగుల విభజనలో వేగంగా ముందుకు వెళ్లడం లేదు. ఉద్యోగుల బదిలీలకు, కేటాయింపులకు ప్రామాణికం ఏమిటనే విషయంపై స్పష్టత లేదు. దీంతో విభజన సమయంలో సహజ న్యాయ సూత్రం అన్నట్లు ‘ఆర్డర్ టు సర్వ్’ నిబంధనల మేరకు ఉద్యోగుల కేటాయింపులు ఉంటాయని, ఆ మేరకు పనిచేయాల్సి ఉంటుదని ఉద్యోగులు మానసికంగా సిద్ధమవుతున్నారు. ఆర్టర్ టు సర్వ్ అంటే... తాత్కాలిక కేటాయింపుల ఉత్తర్వులను ఆర్డర్ టు సర్వ్ అంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన సమయంలో ఈ ఉత్తర్వుల మేరకే ఇరు రాష్ట్రాల్లో ఉద్యోగుల పంపకం చేశారు. అనంతరం కమలనాథన్ కమిటీ పూర్తి స్థాయి కేటాయింపులు నిబంధనల ప్రకారం జరిగే విధంగా చూస్తోంది. ఇప్పుడు జిల్లాల ఏర్పాటు విషయంలో కూడా ఇదే విధమైన ఉత్తర్వులతో ఉద్యోగులు వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు కేటాయించబడతారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. కొత్త చోటుకు వెళ్లే ఉద్యోగులు అభ్యంతరాలువ్యక్తం చేయరాదు. ఎందుకంటే.. ఇవి తాత్కాలిక కేటాయింపులే కాబట్టి ఎక్కడికి బదిలీ చేసినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. కమిటీ ద్వారానే కేటాయింపుల నింబంధనలు జిల్లాల విభజనకు సంబంధించి ప్రస్తుతం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీనే ఉద్యోగుల కేటాయింపులు చూస్తుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్లు మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో కమిటీ ఏర్పాటు చేసినా కేటాయింపుల విషయంలో ఉద్యోగుల స్థానికత, ఆప్షన్స్, సీనియార్టీ తదితర విషయాలు పరిశీలిస్తారు. వాటి మేరకు కేటాయింపులు ఉంటాయి. అయితే ఇది పూర్తి కావడానికి ఎంత వేగంగా చేసినా కనీసం సంవత్సరకాలం పట్టవచ్చని సీనియర్ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ ఏర్పాటు ద్వారా.. ఉద్యోగులను వారి స్వస్థలం ఆధారంగా(610జీవో) ఆయా జిల్లాలకు కేటాయిస్తారు. ఈ సమయంలో ఉద్యోగులు తమ కేటయింపుల విషయంలో అభ్యంతరాలు ఉన్నట్లయితే వ్యక్తం చేయవచ్చు. ఈ విధంగా కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు కేటాయించబడిన ఉద్యోగులు ఒక వేళ ఇతర జిల్లాలకు మారాలంటే జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో శాఖ పరంగా డిప్యూటేషన్ ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. ఈ అవకాశం శాశ్వత కేటాయింపులు పూర్తయిన తరువాతే ఉంటుంది. ప్రస్తుతం మాత్రం కేటాయించిన చోట విధులు నిర్వహించాల్సి ఉంటుంది. శాఖల విలీనం.. ప్రస్తుతం జిల్లాల ఏర్పాటు సమయంలో కొన్ని శాఖలు కలిపి ఉమ్మడిగా చేయాలని ఆలోచనలు ఉన్నా ఈ విషయంలో చిక్కులు ఎక్కువగా ఉన్నాయి. సీనియార్టీ, హోదా విషయాల్లో చిక్కులు తప్పక పోవచ్చు. అయితే శాఖల విలీనం కాకుండా మధ్యేమార్గంగా శాఖలు వేరైనప్పటికీ ఒకే ఉన్నతాధికారి కింద పనిచేసేవిధంగా తాత్కాలిక ఏర్పాట్లు చేయవ్చని చర్చ జరుగుతోంది. దీనివల్ల ఇప్పటికిప్పుడు ఉద్యోగులకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఉద్యోగుల కొరత కూడా కొంతవరకు తగ్గుతుంది. ప్రభుత్వ అంతిమ నిర్ణయం మేరకు ఈ విషయంలో కేటాయింపులు ఉంటాయి. జోనల్ వ్యస్థ పక్కకు.. ప్రస్తుతం జోనల్ వ్యవస్థ జోలికి ప్రభుత్వం వెళ్లే పరిస్థితి లేదు. దీంతో జోనల్ స్థాయి అధికారులను కూడా జిల్లా స్థాయిలోనే సర్దుబాటు చేసే అవకాశాలుఉన్నాయి. జేడీ, డీడీ, ఏడీ స్థాయి అధికారులు ఒక శాఖలో ఉన్నట్లయితే వారిని జిల్లాకు ఒకరిని కేటాయిస్తారు. మిగతా ఉద్యోగులది కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. జోనల్ వ్యవస్థపై స్పష్టత వచ్చాక జిల్లా, రాష్ట్ర స్థాయి కేడర్ నిర్ణయిస్తే అప్పుడు సర్వీస్ రూల్స్ మార్పులు చేసి తదుపరి బదిలీలు, పదోన్నతులు కొనసాగించే అవకాశం ఉంటుంది. జిల్లాలో 40,243 పోస్టులు జిల్లాలో మొత్తం వివిధ స్థాయిలో ఉద్యోగుల పోస్టులు మొత్తం 40,243 ఉన్నాయి. వీటిలో గెజిటెడ్ హోదా పోస్టులు 3502, నాన్ గెజిటెడ్ అధికారుల పోస్టులు 31,139, క్లాస్ ఫోర్త్ ఉద్యోగులవి 547, మిగతావి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులవి, పార్ట్‌టైం, కాంట్రాక్ట్వారివి. అయితో ప్రసుతం వివిధ స్థాయిల్లో ఖాళీలుపోను సుమారు 3644 మంది గెజటెడ్, నాన్‌గెజిటెడ్, క్లాస్ ఫోర్త్ హోదాలో పనిచేస్తున్నారు. వీరు కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు కేటాయింపుల వారీగా వెళ్లాల్సి ఉంటుంది. జూన్‌లోపు ఉద్యోగుల కేటయింపులు పూర్తి చేయాలి ఎన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం ఉద్యోగుల శాశ్వత కేటయింపుల కోసం సత్వరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో కమిటీ ఏర్పాటు చేసి వేగంగా పనులు చేపట్టాలి. జూన్ ఆఖరు నాటికి కేటయింపులు పూర్తిచేసి బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి. తద్వారా పిల్లల చదువులు ఇబ్బందులు కాకుండా ఉంటాయి. ఆలస్యం అవుతున్నాకొద్దీ ఉద్యోగుల్లో ఆందోళననెలకొంటుంది. ఇదే విషయం కమిటీకి వివరిస్తాం. విభజన పేరుతో ఉద్యోగులు నష్టపోవడాన్ని ఉద్యోగ సంఘాలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించవు. సీనియార్టీ, స్థానికత, ఆప్షన్స్ ప్రకారం కేటాయింపులు ఉండాలి రాజ్‌కుమార్, ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉద్యోగుల స్థానికత, సీనియార్టీ వివరాలు ఉన్నాయి. ఆప్షన్స్‌కూడా తీసుకుంటున్నారు. అందువల్ల ఉద్యోగులను సీనియార్టీ, స్థానికత, ఆప్షన్స్ ఆధారంగా కేటాయింపులు చేపడితో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కొద్దిపాటి మార్పులు ఉన్నా క్రమంగా సర్దుబాటు చేసుకోవచ్చు. లేదంటే ఈ ప్రకియ చాలా సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త జిల్లాల్లో ఉద్యోగులపై పనిభారం ఎక్కువ ఉండకుండా స్టాప్ ప్యాట్రన్ ఏర్పాటుచేయాలి. -
టీ ఉద్యోగులను.. ఆంధ్ర ప్రభుత్వం వేధిస్తోంది
టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్డర్ టూ సర్వ్ కింద పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఆ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని, నిబంధనలను ఉల్లంఘిస్తూ బదిలీలు చేస్తున్నదని టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాల జారీలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని నిరసన వ్యక్తం చేశారు. ఏప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించకపోవడం వల్ల పాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. పదో షెడ్యూల్లో ఉన్న అన్ని కార్యాలయాలు ఆంధ్ర పాలనలో ఉన్నాయని, వీటిని తక్షణమే విభజించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేశారు.