పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలు (ఫైల్)
కొత్తగూడెం: భద్రాద్రి జిల్లా ఏర్పాటు సందర్భంగా తాత్కాలిక పద్ధతి ‘ఆర్డర్ టూ సర్వ్’ పేరిట అనేక మంది ఉద్యోగులను జిల్లాలోని వివిధ శాఖలలో పాత జిల్లాల ఉద్యోగులతో ప్రభుత్వం భర్తీ చేసింది. జిల్లా ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా... ఈ ‘ఆర్డర్ టూ సర్వ్’లో మార్పు లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పోస్టుల భర్తీ తర్వాత వెంటనే తమ స్థానాలకు తిరిగి వెళ్లిపోవచ్చని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఖాళీ పోస్టులభర్తీపై ఇప్పటివరకు పెదవి విప్పకపోవడంతో ‘ఇంకెన్నాళ్లు’ అంటూ నిరాశ చెందుతున్నారు. అయితే బదిలీలను వేసవి సెలవుల్లో చేపడతామని ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా సూచనలు వస్తుండటంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ బదిలీలు ఉపాధ్యాయులకే పరిమితమా... అన్ని శాఖల ఉద్యోగులకు ఉంటుందా అనే అంశం తేలాల్సి ఉంది.
ఆశల పల్లకిలో 7, 627 మంది ఉద్యోగులు...
జిల్లాలో ప్రస్తుతం 7,627 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 3,470 మంది వివిధ శాఖలలో పనిచేస్తుండగా, 4,157 మంది వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఉపాధ్యాయులు తప్ప ఇతర ఉద్యోగులు అధిక శాతం జిల్లా కేంద్రంలోని పలు శాఖల్లో ఆర్డర్ టూ సర్వ్ పేరిట విధులు నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు డీఈవో కార్యాలయ సిబ్బంది మొత్తం ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చిన వారే. వీరందరినీ తాత్కాలిక పద్ధతిన నియమించిన ప్రభుత్వం.. ఆ పోస్టులను భర్తీ చేయకపోవంతో నాడు వచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భర్త ఖమ్మంలో... భార్య కొత్తగూడెం జిల్లాలో.. ఇలా వేర్వేరు చోట్ల విధులను నిర్వహించాల్సిన పరిస్థితి. అంతే కాకుండా ఈ ఆర్డర్ టూ సర్వ్, బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన వెల్లడించకపోవడంతో వచ్చే ఏడాది తమ పిల్లలను ఏ జిల్లాలోని పాఠశాలల్లో చేర్పించాలో తెలియని అయోమయంలో కొందరు ఉద్యోగులున్నారు.
బదిలీలు, ప్రమోషన్ల కోసంఎదురుచూపులు...
జిల్లాలో ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం ఎస్‌జీటీలు 2701 మంది, స్కూల్ అసిస్టెంట్‌లు 1348 మంది, ప్రధానోపాధ్యాయులు 108 మంది.. మొత్తం 4157 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 2015 జూలైలో ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులకు సైతం బదిలీలు నిర్వహించారు. ఈ బదిలీలు జరిగి సుమారు మూడేళ్లు కావస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బదిలీలు, ప్రమోషన్లు లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఉద్యోగస్తులైన భార్యాభర్తలు, అనారోగ్య కారణాలు ఉన్నవారు బదిలీల కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇతర శాఖల్లో ప్రమోషన్ల భర్తీ వేగవంతంగా జరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయుల్లో ‘కామన్ సర్వీస్ రూల్స్’ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉందనే కారణంతో ప్రమోషన్లను ఇప్పటి వరకు చేపట్టలేదు. దీనిపై సైతం ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రమోషన్లు లేకుండానే అనేక మంది ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
చిక్కుముడులు వీడితేనే సులువు...
బదిలీలను చేపడతామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇటీవల ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి అదనంగా ఉన్నవారిని కుదించే ప్రక్రియ ‘రేషనలైజేషన్’ను చేపట్టాలనే మరో డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఇటీవల టీఎస్‌పీఎస్సీ చేపట్టిన టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్టు పూర్తయినప్పటికీ కోర్టు కేసుతో ఫలితాలు విడుదల కాలేదు. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే ముందుగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment