ఖమ్మంసహకారనగర్: జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కన్పిస్తుంది. శాసనమండలి ఎన్నికల కసరత్తు ప్రారంభమవడంతో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఉపాధ్యాయ నియోజకవరాల్గ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు అధికారులు కసరత్తు ప్రారంభించనున్నారు. రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు ఇందుకోసం ఆశావహుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల జోరు ఊపందుకుంది. ఆయా సంఘాల నాయకులు ముందు నుంచే హడావుడి మొదలుపెట్టాయి. ఇటీవల ఓ సంఘం నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించగా, తాజాగా ఓ సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి తాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉండే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మళ్లీ నమోదు తప్పనిసరి
సాధారణ ఎన్నికలకు భిన్నంగా జరిగే ఈ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో ఓటర్ల నమోదు సహా ఓట్ల లెక్కింపు భిన్నంగా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో ఓటరుగా నమోదైతే సరిపోతుంది. కానీ మండలి ఎన్నికల్లో మాత్ర ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు తన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 1నాటికి ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఆ రోజుతో ముగిసే ఆరేళ్ల కాలంలో కనీసం మూడేళ్ల పాటు ఉన్నత పాఠశాలలో బోధన అనుభవం కలిగి ఉండాలి. ఓటరు జాబితాలో పేరు నమోదుకు, ఓటు వేసేందుకు అర్హులుగా ఉంటారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలను ఒక నియోజకవర్గంగా గుర్తించారు. ఈ మూడు జిల్లాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు మాత్రమే ఓటు హక్కుకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పూల రవీందర్ పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఎన్నికల సంఘం ఉంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా..
- సాధారణ ఓటు హక్కు కోసం బూత్ స్థాయి అధికారులను సంప్రదిస్తుంటాం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఓటు నమోదు పత్రాలు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. పట్టభద్రుల, ఉపాధ్యాయ స్థానానికి వేర్వేరుగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి మాత్రం కేవలం ఉపాధ్యాయులు, అధ్యాపకులతో పాటు విశ్రాంత ఉపాధ్యాయులు, అధ్యాపకులు మాత్రమే ఓటు నమోదుకు అర్హతగా పరిగణిస్తారు.
- నవంబర్ 1, 2018నాటికి డిగ్రీ పూర్తి పట్టా పొంది మూడేళ్లు నిండిన వారై ఉండాలి. సదరు అభ్యర్థులు 2015 నవంబర్ నాటికి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. ఫారం 19ని పూర్తి చేయాలి. ఆ దరఖాస్తుకు గెజిటెడ్ అధికారి ద్రువీకరించిన డిగ్రీ నకలుతోపాటు ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్‌ను జత చేయాలి.
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఓటు వేయాలంటే 2012 నవంబర్ ఒకటి నుంచి 2018 నవంబర్ 1 నాటికి ఆరేళ్లలో మూడేళ్లు హైస్కూల్, ఆ పైతరగతులకు బోధించే వారై ఉండాలి.
- ఆరేళ్లలో వరుసగా కాకపోయినా మూడేళ్ల పాటు బోధన అనుభవం ఉన్నట్లు ఆయా విద్యాసంస్థ నుంచి ద్రువపత్రంతో పాటు ఏదైనా గుర్తింపు పొందిన ద్రువపత్రం ఫారం–19కి జత చేయాల్సి ఉంటుంది.
- ఓటరు నమోదుకు వ్యక్తిగతంగా గానీ కుటుంబ సభ్యులైనా, పాఠశాలలు, కళాశాలల హెడ్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి మోడల్ స్కూల్స్, కేజీబీవీ, ప్రభుత్వ గురుకులాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సైతం ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment