టీ ఉద్యోగులను.. ఆంధ్ర ప్రభుత్వం వేధిస్తోంది
టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్డర్ టూ సర్వ్ కింద పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఆ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని, నిబంధనలను ఉల్లంఘిస్తూ బదిలీలు చేస్తున్నదని టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాల జారీలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని నిరసన వ్యక్తం చేశారు.
ఏప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించకపోవడం వల్ల పాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. పదో షెడ్యూల్‌లో ఉన్న అన్ని కార్యాలయాలు ఆంధ్ర పాలనలో ఉన్నాయని, వీటిని తక్షణమే విభజించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేశారు.