సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో తలెత్తిన గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెర దింపింది. ఈ సర్దుబాటు కేవలం తాత్కాలిక కేటాయింపుగా, తాత్కాలిక అవసరాల నిమిత్తం విధి నిర్వహణ (ఆర్డర్ టు సర్వ్)గానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ (జీవో నెం.381) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్లు, లీవ్, సర్వీసు వ్యవహారాలకు సంబంధించి ఈ ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చారు.
ఇప్పటివరకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో పని చేసిన వారికి సంబంధిత జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పరిధిలోనే సీనియారిటీ లెక్కిస్తారని స్పష్టం చేశారు. అదే తీరుగా ప్రమోషన్లు కల్పిస్తారు. మాతృ సంస్థలకు బదులు ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్‌పై ఇతర విభాగాల్లో పని చేస్తున్న వారికి పోస్టింగ్ ఇచ్చే విషయంలో ఇదే నిబంధన వర్తిస్తుంది. రాష్ట్రంలో గతంలో ఉన్న పది జిల్లాల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులను పునర్వ్యవస్థీకరణ సందర్భంగా 31 జిల్లాలకు ప్రభుత్వం సర్దుబాటు చేసింది.
కొందరిని నేరుగా పదోన్నతులు కల్పించి నియామక ఉత్తర్వులివ్వగా, ఎక్కువ మంది ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులపై కొత్త జిల్లాలకు పంపింది. దీంతో తమ సీనియారిటీని ఎలా లెక్కిస్తారు.. ప్రమోషన్లు ఎలా ఇస్తారు.. బదిలీలెలా ఉంటాయి.. కొత్త జిల్లా పరిధిలోనా లేక పాత జిల్లా పరిధిని పరిగణనలోకి తీసుకుంటారా అనే సందేహాలు వెల్లువెత్తాయి. సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లకు సమీపంలో ఉన్న ఉద్యోగులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, మండలాలకు ఉద్యోగుల పంపిణీకి నిర్దేశించిన కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.
పాత జిల్లా పరిధిలోనే ప్రమోషన్లు
Published Fri, Oct 21 2016 2:06 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
Advertisement
Advertisement