నీటిపారుదల శాఖలో మరో 1,300 ఉద్యోగాల భర్తీ
ఇంజనీర్లు కచ్చితంగా పని ప్రదేశాల్లోనే నివసించాలి
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఇరిగేషన్‌ను బీఆర్‌ఎస్ సర్కారు అస్తవ్యస్తం చేసిందని ఆగ్రహం
ఆర్‌ఆర్‌ఆర్‌ను గాడిలోకి తెచ్చింది నేనే: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలోని అన్ని స్థాయిల ఇంజనీర్లకు 15 రోజుల్లోగా పదోన్నతులు, బదిలీలు చేపడుతామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇంజనీర్లు పనిచేసే ప్రాంతంలోనే నివాసం ఉండాలని స్పష్టంచేశారు. బాధ్యతలను విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం జలసౌధలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి ఫిర్యాదు ఆధారంగా మిర్యాలగూడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను మంత్రి సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మరో 1,300 మంది నియామకం
ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టేందుకు 700 మందికి పైగా ఏఈఈలను నియమించామని, అందులో దాదాపు 100 మంది ఐఐటీ, ఎన్‌ఐటీల గ్రాడ్యుయేట్లు ఉన్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాల్వలపై పర్యవేక్షణకు 1,800 మంది లష్కర్లను నియమిస్తున్నామని చెప్పారు. నీటిపారుదల శాఖలో మరో 1,300 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని టీజీపీఎస్సీకి లేఖ రాసినట్లు వెల్లడించారు.
ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల కృష్ణా జలాల వాటా నుంచి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించడాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాతపూర్వకంగా సమ్మతించిందని తప్పుబట్టారు. తెలంగాణకు 550 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట వాదనలు వినిపిస్తున్నామని, ఆరు నెలల్లో సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అప్పుల చెల్లింపులకే సగం నిధులు
బీఆర్‌ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నీటిపారుదల శాఖ అస్తవ్యస్తంగా మారిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాల్వల నిర్వహణను నాడు పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి బీఆర్‌ఎస్ సర్కారు రూ.1.81 లక్షల కోట్లు అప్పు చేసినా ఆయకట్టు మాత్రం అభివృద్ధి కాలేదని అన్నారు.
ఈ అప్పులభారం నీటిపారుదల శాఖపై తీవ్రంగా పడిందని తెలిపారు. బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.22 వేల కోట్లు కేటాయిస్తే, రూ.11 వేల కోట్లు అప్పుల చెల్లింపులకే పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులను పునర్వ్యవస్థీకరించి, వడ్డీలను తగ్గించడంతో పాటు కాలపరిమితి పెంచడం ద్వారా శాఖపై భారం తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కేటీఆర్‌ను ప్రశాంతంగా వేడుకలు చేసుకోనీయండి: కోమటిరెడ్డి
ఫార్ములా– ఈ రేసు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ కేసు గురించి మీడియా ప్రశ్నించగా.. కొత్త సంవత్సరం సందర్భంగా కేటీఆర్‌ను రెండుమూడు రోజులు ప్రశాంతంగా వేడుకలు చేసుకోనీయండి అని సెటైర్ వేశారు.
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కోసం బీఆర్‌ఎస్ హయాంలోనే 70 శాతం భూసేకరణ పూర్తిచేశామన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటనను కోమటిరెడ్డి కొట్టిపారేశారు. గత ప్రభుత్వం యుటిలిటీ చార్జీలు కట్టకపోతే ప్రాజెక్టు నిలిచిపోగా, తాను కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి ప్రాజెక్టును రివైవ్ చేయించినట్టు తెలిపారు. సమీక్షలో ఎమ్మెల్యేలు మందుల సామేలు, లక్ష్మారెడ్డి, బాలూనాయక్, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment