Irrigation engineers
-
15 రోజుల్లో ఇరిగేషన్ ఇంజనీర్లకు ప్రమోషన్లు
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలోని అన్ని స్థాయిల ఇంజనీర్లకు 15 రోజుల్లోగా పదోన్నతులు, బదిలీలు చేపడుతామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇంజనీర్లు పనిచేసే ప్రాంతంలోనే నివాసం ఉండాలని స్పష్టంచేశారు. బాధ్యతలను విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం జలసౌధలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి ఫిర్యాదు ఆధారంగా మిర్యాలగూడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను మంత్రి సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మరో 1,300 మంది నియామకంఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టేందుకు 700 మందికి పైగా ఏఈఈలను నియమించామని, అందులో దాదాపు 100 మంది ఐఐటీ, ఎన్ఐటీల గ్రాడ్యుయేట్లు ఉన్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాల్వలపై పర్యవేక్షణకు 1,800 మంది లష్కర్లను నియమిస్తున్నామని చెప్పారు. నీటిపారుదల శాఖలో మరో 1,300 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని టీజీపీఎస్సీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల కృష్ణా జలాల వాటా నుంచి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించడాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రాతపూర్వకంగా సమ్మతించిందని తప్పుబట్టారు. తెలంగాణకు 550 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట వాదనలు వినిపిస్తున్నామని, ఆరు నెలల్లో సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుల చెల్లింపులకే సగం నిధులుబీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నీటిపారుదల శాఖ అస్తవ్యస్తంగా మారిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాల్వల నిర్వహణను నాడు పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు రూ.1.81 లక్షల కోట్లు అప్పు చేసినా ఆయకట్టు మాత్రం అభివృద్ధి కాలేదని అన్నారు. ఈ అప్పులభారం నీటిపారుదల శాఖపై తీవ్రంగా పడిందని తెలిపారు. బడ్జెట్లో ఈ శాఖకు రూ.22 వేల కోట్లు కేటాయిస్తే, రూ.11 వేల కోట్లు అప్పుల చెల్లింపులకే పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులను పునర్వ్యవస్థీకరించి, వడ్డీలను తగ్గించడంతో పాటు కాలపరిమితి పెంచడం ద్వారా శాఖపై భారం తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేటీఆర్‌ను ప్రశాంతంగా వేడుకలు చేసుకోనీయండి: కోమటిరెడ్డి ఫార్ములా– ఈ రేసు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ కేసు గురించి మీడియా ప్రశ్నించగా.. కొత్త సంవత్సరం సందర్భంగా కేటీఆర్‌ను రెండుమూడు రోజులు ప్రశాంతంగా వేడుకలు చేసుకోనీయండి అని సెటైర్ వేశారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కోసం బీఆర్ఎస్ హయాంలోనే 70 శాతం భూసేకరణ పూర్తిచేశామన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటనను కోమటిరెడ్డి కొట్టిపారేశారు. గత ప్రభుత్వం యుటిలిటీ చార్జీలు కట్టకపోతే ప్రాజెక్టు నిలిచిపోగా, తాను కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి ప్రాజెక్టును రివైవ్ చేయించినట్టు తెలిపారు. సమీక్షలో ఎమ్మెల్యేలు మందుల సామేలు, లక్ష్మారెడ్డి, బాలూనాయక్, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం : అంచనాలు రెట్టింపా?
సాక్షి, హైదరాబాద్: ఎగువ నుంచి ప్రవాహాల్లేక నిర్జీవంగా మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జవసత్వాలు ఇచ్చేందుకు చేపట్టిన ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం అంచనా వ్యయాలను ఇష్టారీతిన పెంచడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై ఆయనే స్వయంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా రెట్టింపు చేయడం ఏమిటని, ఇదంతా ఎలా జరిగిందో తేల్చి సమగ్ర నివేదిక ఇవ్వాలని సాగునీటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్‌ను సీఎం ఆదేశించినట్లుగా ప్రభుత్వంలోని అత్యున్నత వర్గాలు వెల్లడించాయి. ఏయే పనుల కింద ఎంతమేర అంచనాలు పెరిగాయో వివరాలు ఇవ్వాలని, తప్పుడు లెక్కలుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం స్పష్టం చేశారని తెలిపాయి. ఎస్సారెస్పీకి జవసత్వాలు ఇచ్చేందుకు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్–1 కింద 9.68 లక్షల ఎకరాలు, స్టేజ్–2 కింద 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నాయి. కానీ ప్రాజెక్టులో పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు పడిపోయింది. ఎగువన మహారాష్ట్ర ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు కట్టి నీళ్లన్నీ వాడేసుకుంటోంది. దిగువన ఉన్న ఎస్సారెస్పీకి 50 టీఎంసీల మేర కూడా నీళ్లు రాని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎస్సారెస్పీకి తరలించి జవసత్వాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తరలించే 2 టీఎంసీల నీటిలో.. ఒక టీఎంసీ నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి 2017 జూన్‌లో రూ.1,067 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. మూడు లిఫ్టుల ద్వారా నీటిని ఎస్సారెస్పీకి ఎత్తిపోసేలా డిజైన్ చేశారు. 15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరు నెలలకే మార్పులు షురూ.. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం టెండర్ల ప్రక్రియ మొదలైన ఆరు నెలలకే డిజైన్‌లో మార్పులు జరిగాయి. ఈ సమయంలోనే అంచనా వ్యయాన్ని రూ.1,067 కోట్ల నుంచి.. ఏకంగా రూ.1,751.46 కోట్లకు పెంచారు. ఈ వ్యయాల మార్పు సమయంలో స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా పెరిగిన వ్యయాలను యథాతథంగా ఆమోదించారు. తర్వాత వేగంగా పనులు కొనసాగాయి. ఇప్పటికే మూడు పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తయింది. ఇరిగేషన్ శాఖ లెక్కల మేరకు.. ఈ పనులకు సంబంధించి రూ.1,250 కోట్లు, సబ్ స్టేషన్ల నిర్మాణాలకు మరో రూ.220 కోట్లు, పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లించిన మొత్తాలు మరో రూ.70 కోట్లు కలుపుకొని.. మొత్తంగా రూ.1,540 కోట్ల మేర నిధులు ఖర్చు చేసినట్టు చూపారు. మరో రూ.150 కోట్ల మేర పెండింగ్ బిల్లులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రాజెక్టుపై మొత్తంగా రూ.1,700 కోట్ల వరకు ఖర్చు జరిగింది. అయినప్పటికీ ప్రాజెక్టు ఇంజనీర్లు మరోమారు అంచనాలను సవరిస్తూ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రూ.1,999.55 కోట్లతో ఈ ప్రతిపాదనలు వెళ్లినట్టు తెలిసింది. అంటే తొలి అంచనాతో పోలిస్తే ఏకంగా రూ.932 కోట్లు వ్యయం పెరిగినట్టు. రెండో సవరించిన అంచనాతో పోల్చినా కూడా రూ. 248.55 కోట్లు పెరిగిపోయింది. జరిగింది వేరే.. లెక్కలు వేరే.. మంగళవారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా లేవనెత్తినట్టు తెలిసింది. అంచనా వ్యయం ఏకంగా రెట్టింపు కావడం ఏమిటని ఇంజనీర్లను సీఎం నిలదీయగా.. డిజైన్‌లో మార్పులు జరిగాయని, పంపుహౌజ్ లోతు పెరిగిందని, ఫౌండేషన్ సైతం తొలి ప్రతిపాదనతో పోలిస్తే మారిందని ఇంజనీర్లు చెప్పినట్టు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న ఓ మంత్రి దీనిపై స్పందిస్తూ.. సివిల్ పనుల్లో మార్పులు జరిగితే ఎలక్ట్రో, మెకానికల్ పనుల అంచనాలు ఎలా పెరిగాయని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రాజెక్టులో మొదట రూ.600 కోట్లుగా ఉన్న ఎలక్ట్రో, మెకానికల్ పనుల విలువ.. ఇప్పుడు ఏకంగా రూ.1,400 కోట్లకు చేరిందన్న విషయాన్ని సీఎంకు వివరించినట్టు సమాచారం. మంత్రి చెప్పిన అంశాలతో ఏకీభవించిన సీఎం.. వ్యయం పెరగడం మామూలే అయినా, ఏకంగా రెట్టింపు ఎలా అయిందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై విజిలెన్స్ విచారణ చేయించి, తనకు సమగ్ర నివేదిక అందించాలని.. అక్కడికక్కడే సాగునీటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్‌ను ఆదేశించినట్టు సమాచారం. ఈ సమయంలో ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. భారీ ఎత్తున పనులు జరుగుతున్న ఇరిగేషన్ శాఖలో చిన్నచిన్న తప్పులు జరుగుతున్నా, ఉపేక్షిస్తూ వస్తున్నానని.. దీన్ని ఆసరాగా చేసుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అంచనా వ్యయాలను సవరిస్తే ‘వీపులు పగులుతాయ్’ అంటూ ఘాటుగా హెచ్చరించారని సమాచారం. ఏం జరిగింది? తొలి అంచనా వ్యయం రూ. 1,067 కోట్లు సవరించిన అంచనా మొత్తం రూ. 1,999.55 కోట్లు పెరిగిన వ్యయం:రూ.932.55 కోట్లు -
కాలువలకు జలకళ
- తాగునీటి అవసరాల కోసం విడుదల - తొలుత బందరు, ఏలూరు కాలువలకు.. - ఆ తరువాత రైవస్ కాలువకు.. - 10 రోజులపాటు నీటి విడుదలకు అవకాశం - చేపల చెరువులకు నిషేధం సాక్షి, విజయవాడ : వేసవిలో ప్రజల తాగు నీటి కష్టాలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి తాగునీటి అవసరాల కోసం శనివారం రాత్రి 8 గంటలకు కాలువలకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరు సుగుణాకరరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ పది రోజులు పాటు గ్రామాల్లోని చెరువులు నింపుకోవడానికి కాలువలకు నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న 389 తాగునీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామని వివరించారు. ఈ చెరువులు పూర్తిగా నిండితే వచ్చే మే నెలాఖరు వరకు గ్రామాల్లో నీటి ఎద్దడి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఆ తరువాత మరో సారి తాగునీరు విడుదల చేస్తామని వెల్లడించారు. 500 క్యూసెక్కుల చొప్పున తొలుత కృష్ణా ఈస్ట్రన్ బ్రాంచ్ కెనాల్‌తో పాటు బందరు, ఏలూరు కాలువలకు 500 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. ఐదారు రోజులు తరువాత రైవస్ కాలువకు రోజుకు 1500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇలా పది రోజులు పాటు నీరు విడుదల చేస్తే చెరువులు పూర్తిస్థాయిలో నిండుతాయని భావిస్తున్నారు. వాస్తవంగా ప్రకాశం బ్యారేజీ నుంచి మరి కొంత ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే నాగార్జునసాగర్ నుంచి రోజుకు రెండువేల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు విడుదల కావడంలేదు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువునకు కూడా ఆచితూచి నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలు నిండటానికి అర టీఎంసీ నీరు సరిపోతుంది. అయితే కాలువ చివర వరకు వెళ్లడంతో పాటు, కాలువల్లో ఉన్న వ్యర్థాలు సముద్రంలో కలవడానికి సుమారు మూడు టీఏంసీల నీరు అవసరం అవుతుందని, అప్పుడే బ్యారేజీకి దిగువున ఉన్న చెరువులన్నీ నిండుతాయని ఎస్ఈ సుగుణాకరరావు తెలిపారు. సాగర్ నుంచి ఆరు టీఎంసీల నీరు విడుదల చేయాలని అధికారులు కోరగా.. ప్రస్తుతానికి అర టీఎంసీ నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ నీటిని పులిచింతల ప్రాజెక్టులో నిల్వచేసి జాగ్రత్తగా కాల్వలకు వదులుతున్నారు. చేపల చెరువులకు నిషేధం నాగార్జున సాగర్ నుంచే వచ్చే నీటిని జాగ్రత్తగా వినియోగించుకుంటూ ఈ మండు వేసవిని దాటేందుకు ఇరిగేషన్ ఇంజినీర్లు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాలువలకు విడుదల చేసిన నీటిని తాగునీటి చెరువులకు చేరకుండా చేపల చెరువులకు మళ్లిస్తే భవిష్యత్తులో నీటి ఎద్దడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల చేపల చెరువులకు నీటిని మళ్లించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా చేపల చెరువులకు నీటిని మళ్లిస్తే ఆ ప్రాంతంలోని ఇరిగేషన్ అధికారులుపై కఠినచర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. -
వైఎస్ జగన్‌తో ఏపీ ఇరిగేషన్ ఇంజనీర్ల భేటీ
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సమావేశమయ్యారు. సోమవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలుసుకొని, తమ సమస్యలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు పోస్టింగులు ఇవ్వకుండా తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని ఇంజనీర్లు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. మూడు నెలలుగా తమకు జీతాలు కూడా ఇవ్వటం లేదని వారు వాపోయారు. తమకు ఏ రాష్ట్రంలో పోస్టింగులు ఇచ్చినా చేయటానికి సిద్ధంగా ఉన్నామని ఇంజనీర్లు చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా జగన్ ను కోరారు. అనంతరం ఇంజనీర్లు మీడియాతో మాట్లాడుతూ.. తమ సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు. -
ఆంధ్ర పొమ్మంది... తెలంగాణ వద్దంటోంది
పోస్టింగ్‌లు లేవు... జీతాలు రావడం లేదంటూ ఇంజినీర్ల ఆవేదన గాంధీనగర్ : ‘రాష్ర్ట విభజన పుణ్యమాని పోస్టింగ్‌లు లేవు. రెండు నెలలుగా జీతాలూ లేవు. మమ్మల్ని ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు’ అని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కె.ఎల్.రావు భవన్లో ఆంధ్ర స్థానికత కలిగి స్థానికేతర కోటాలో తెలంగాణకు కేటాయించిన నీటిపారుదల శాఖ ఇంజినీర్ల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీటిపారుదల ఇంజినీర్ల(తెలంగాణకు బదలాయించిన) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత నీటిపారుదల శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న 299 మంది ఇంజినీర్లను ఆంధ్రప్రభుత్వం గత నవంబర్‌లో తెలంగాణకు బదలాయించిందని, వీరిలో 175 మంది ఆంధ్ర స్థానికత కలిగిన వారున్నారని చెప్పారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వబోమని స్పష్టం చేసిందన్నారు. ఇరు రాష్ట్రాల మంత్రులు సమస్యను పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఈనెల 27న హైదరాబాద్‌లోని ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇంజినీర్లు టి. సుధాకర్‌బాబు, పి. శ్రీనివాసరావు, లక్ష్మీసాయి, చలం, జగదీష్ పాల్గొన్నారు. -
రేపు, ఎల్లుండి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు బంద్
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం, ఆదివారం ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రతి ఏడాది ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు నిర్వహిస్తారు. అలాగే బ్యారేజీ వద్ద పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వీటితోపాటు రోడ్డు మరమ్మతులు చేపట్టనున్నారు. అధికారులు, కార్మికులు రెండు రోజుల పాటు శ్రమించి బ్యారేజీ పనులు పూర్తి చేయనున్నారు. దాంతో సోమవారం ఉదయం నుంచి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు సాగిస్తారు. అయితే గుంటూరు - విజయవాడ నగరాల మధ్య రాకపోకలు ప్రకాశం బ్యారేజీపై మీదగా నుంచి కాకుండా దుర్గమ్మవారధి మీదగా సాగనున్నాయి. దాంతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. -
కోటి ఎకరాలకు నీరందాల్సిందే
-
కోటి ఎకరాలకు నీరందాల్సిందే
* నిధులకు ఫికర్ లేదన్న కేసీఆర్ * మధ్యలో ఉన్నవన్నీ 15 నెలల్లో పూర్తికావాలి * ఏం చేద్దామో ప్రతిపాదనలివ్వండి * రిటైర్డ్, ప్రస్తుత సాగునీటి ఇంజనీర్లతో కేసీఆర్ సుదీర్ఘ భేటీ సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలోగా తెలంగాణ రాష్ట్రం లోని కోటి ఎకరాలకు సాగునీరు అందాల్సిందేనని, నిధులకోసం ఫికర్ వద్దని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, పార్టీ శాసనసభాపక్ష నేత కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రిటైర్డు ఇంజనీర్లు, సాగునీటి శాఖ ఇంజనీర్లు, అధికారులతో తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనలో ఉన్నవి, కొత్తగా అవసరమైన ప్రాజెక్టుల ప్రతిపాదనల గురించి సాగునీటి అధికారులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. సాగునీటి శాఖలో అమలులో ఉన్న మార్గదర్శకాలు, సమస్యలు, మార్పు చేర్పులు చేయాల్సిన అంశాలపై స్థూలంగా చర్చించారు. ప్రభుత్వానికి ఐదేళ్ల కాలపరిమితి ఉన్నా, తెలంగాణలో ఇప్పటిదాకా అనుకున్న కోటి ఎకరాలకు సాగునీటిని 50 నెలల్లోగా పూర్తిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశం సాగునీరు అని కేసీఆర్ ప్రకటించారు. ‘ప్రాజెక్టులను పూర్తిచేయడానికి నిధుల లభ్యత గురించి మీరు ఆలోచించొద్దు. నిధులను సమీకరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ప్రపంచబ్యాంకు నుంచి తెస్తామా, అంతర్జాతీయ రుణ సంస్థల నుంచి తెస్తామా, కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తామా అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. నిధులను ఎలాగైనా సమీకరిస్తా. ఆ బాధ్యత నాది. వీలైనంత వేగంగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసే బాధ్యత మీది. సాగునీటి శాఖలో ఇప్పుడున్న సమస్యలు, చేయాల్సిన మార్పులు, సగం పూర్తయిన ప్రాజెక్టులు, వెంటనే చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ప్రతిపాదనలు, సూచనలు చేయండి’ అని కేసీఆర్ కోరారు. సాగునీటి శాఖలోని ఉద్యోగుల బదిలీలు సచివాలయం వరకు రాకుండా ఎక్కడికక్కడే ఇన్చార్జీల ఆధ్వర్యంలోనే ఉండేవిధంగా సాగునీటిశాఖను సమూలంగా మారుస్తానని చెప్పారు. మంత్రికి అన్ని అధికారాలు ఉంటాయని, కిందిస్థాయి అధికారాలను వికేంద్రీకరించే విధంగా మార్గదర్శకాలను మారుస్తామని చెప్పారు. సంస్థాగతంగా, సాంకేతికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన సంస్కరణల గురించి స్థూలంగా చర్చించారు. సగంలో ఉన్నవి, 80 శాతం దాకా పూర్తయిన 26 తెలంగాణ ప్రాజెక్టులకు 14 వేల కోట్లు అవసరమవుతాయని సాగునీటి శాఖాధికారులు నివేదికను ఇచ్చారు. వీటివల్ల 24 లక్షల ఎకరాలు తక్షణమే సాగుకు వస్తాయని అధికారులు నివేదించారు. 50 నెలల్లోనే లక్ష్యం చేరాలి ప్రభుత్వానికి 60 నెలల గడువున్నా, కోటి ఎకరాల లక్ష్యాన్ని 50 నెలల్లోనే చేరాలని కేసీఆర్ సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు, క్రమం తప్పని సమీక్షలతో వీలైనంత వేగంగా పనులు పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణకు ఉన్న పూర్వవైభవాన్ని తీసుకురావాలన్నారు. రాష్ట్ర విభజనతో తెలంగాణలో తక్షణమే ఉత్పన్నమయ్యే ఖాళీలు, వాటిలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు జాబితా ఇవ్వాలని కేసీఆర్ కోరారు. ఖాళీల్లో కొత్తవారిని తీసుకుంటామని, అప్పటిదాకా పనులను ఆపడానికి వీల్లేదన్నారు. అందుకే అనుభవం ఉన్న ఇంజనీర్లు ఆసక్తిగా ఉంటే వెంటనే నియమించుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలను ఇస్తుందని కేసీఆర్ ప్రకటించారు. తక్షణమే కొన్ని.. దీర్ఘకాలికం మరికొన్ని నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ విముక్తానికి డిండి ఎత్తిపోతల పథకం, మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమీ, కోయిల్కుంట్ల వంటివి వెంటనే పూర్తిచేస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి త్వరలోనే శ్రీకారం చుడతామన్నారు. జిల్లాల వారీగా మధ్యలో ఉన్నవాటిని తక్షణమే పూర్తిచేసుకుందామన్నారు. జిల్లాలవారీగా కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతంలో మధ్యలో ఆగిపోయినవి, కొత్తగా చేపట్టాల్సిన వాటి గురించి కేసీఆర్ చర్చించారు. కేబినెట్లో చర్చించిన తర్వాతనే ప్రకటన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత కేబినెట్ సమావేశంలో జరిగే నిర్ణయాల తర్వాతనే సాగునీటి రంగంలో విధాన ప్రకటన చేస్తామని కేసీఆర్ తెలిపారు. రాజకీయ అవినీతి జీరో స్థాయిలో ఉండాలని, అధికారులు కూడా అదే స్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశం తర్వాతనే జిల్లాల వారీగా ప్రాధాన్యతలు, ఇతర అంశాలపై నిర్దిష్టంగా ప్రకటన ఉంటుందన్నారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ సమైక్య రాష్ట్రంలో 1956లో తెలంగాణ విలీనం అయ్యేనాటికి తెలంగాణలోని గొలుసుకట్టు చెరువులు, కుంటల ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడది 3 లక్షల ఎకరాలకు పడిపోయిందన్నారు. తెలంగాణలోని 33 వేల చెరువుల్లో చాలావరకు కనుమరుగైనాయని, మిగిలినవాటికి గొలుసులు లేకుండాపోయి ఎండిపోతున్నాయని వివరించారు. వాటిని పునరుద్ధరించుకుని, చిన్ననీటి వనరులను భారీ నీటిపారుదల రంగంగా తెలంగాణలో వినియోగించుకోవాలని కేసీఆర్ సూచించారు. చెరువులను, కుంటలను నింపుకోవడానికి కృష్ణా నది ద్వారా 90 టీఎంసీలు, గోదావరి ద్వారా 112 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించినా 30-40 టీఎంసీలను వీటికి ఉపయోగించుకోవడం లేదన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టి.హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌తో పాటు ఇంజనీర్లు ఆర్.విద్యాసాగర్‌రావు, శ్యాంప్రసాద్ రెడ్డి, పత్తి మోహన్ రెడ్డి, రంగారెడ్డి, రాంరెడ్డి, జగదీశ్వర్, రామకృష్ణా రెడ్డి, వై.వి.చారి, రామానుజం, పి.వి.మధుసూదన్ రెడ్డి, వివిధ ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు. -
ఒక్కటై కదిలారు
ముత్తుకూరు, న్యూస్‌లైన్: ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా మండలంలోని పలు గ్రామాల రైతులు చేయి..చేయీ కలిపి వల్లూరు కాలువలో పాచి, చెత్త తొలగింపునకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ కాలువకు లైనింగ్ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు మట్టి, ఇసుకను వదిలేసి వెళ్లడంతో పాచి పెరిగి నీటి పారుదలకు తీవ్ర అవరోధంగా మారింది. కాంట్రాక్టర్ల ద్వారా వీటిని తొలగించడంలో ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్లక్ష్యం వహించారు. ఫైనల్ బిల్లులను కూడా చెల్లించడంతో కాలువ నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టర్లు వదిలి వె ళ్లగా, ఇరిగేషన్ ఇంజనీర్లూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. 40 రోజుల్లో కోతలకు రావాల్సిన వరి పంట నీరు లేక ఎండిపోతున్న తరుణంలో దువ్వూరువారిపాళెం, డమ్మాయపాళెం, పోతునాయుడుదిబ్బ, రామాపురం, వల్లూరు, పోలంరాజుగుంట, తదితర గ్రామాలకు చెందిన 300 మంది రైతులు, వ్యవసాయ కూలీలు పనులకు శ్రీకారం చుట్టారు. కలివెలపాళెం నుంచి రంగాచార్యులకండ్రిగ వరకు వల్లూరు కాలువలో పాచి, పిచ్చి మొక్కలను తొలగించారు. మూడు రోజులు నీళ్లు ఆపేసి లోతు తగ్గిన తర్వాత పాచి తొలగించేందుకు ఉపక్రమించారు. ఇరిగేషన్ ఇంజనీర్ల నిర్లక్ష్యం జలయజ్ఞం పనులను చేపట్టిన కాంట్రాక్టర్ల ద్వారా వల్లూరు కాలువ పూడికను తీయించాలి. ఈ విషయంలో ఇరిగేషన్ డీఈఈ కాంట్రాక్టర్ల కొమ్ము కాశారు. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టారు. దువ్వూరు విజయభాస్కర్‌రెడ్డి, రైతు, దువ్వూరువారిపాళెం మరో 40 రోజులు నీరు కావాలి వల్లూరు కాలువ కింద వేసిన వరి పంటకు మరో 40 రోజుల పాటు సాగునీరు కావాలి. పూడిక తీయకుంటే వేలాది ఎకరాల్లో పైరు ఎండిపోతుంది. రైతులు బాగా నష్టపోతారు. గతంలో ఎప్పుడూ ఈ దుస్థితి రాలేదు. పోచారెడ్డి చెంగారెడ్డి, రైతు, రామాపురం