ఆంధ్ర పొమ్మంది... తెలంగాణ వద్దంటోంది
పోస్టింగ్‌లు లేవు... జీతాలు రావడం
లేదంటూ ఇంజినీర్ల ఆవేదన
గాంధీనగర్ : ‘రాష్ర్ట విభజన పుణ్యమాని పోస్టింగ్‌లు లేవు. రెండు నెలలుగా జీతాలూ లేవు. మమ్మల్ని ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు’ అని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కె.ఎల్.రావు భవన్‌లో ఆంధ్ర స్థానికత కలిగి స్థానికేతర కోటాలో తెలంగాణకు కేటాయించిన నీటిపారుదల శాఖ ఇంజినీర్ల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీటిపారుదల ఇంజినీర్ల(తెలంగాణకు బదలాయించిన) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత నీటిపారుదల శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న 299 మంది ఇంజినీర్లను ఆంధ్రప్రభుత్వం గత నవంబర్‌లో తెలంగాణకు బదలాయించిందని, వీరిలో 175 మంది ఆంధ్ర స్థానికత కలిగిన వారున్నారని చెప్పారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వబోమని స్పష్టం చేసిందన్నారు.
ఇరు రాష్ట్రాల మంత్రులు సమస్యను పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఈనెల 27న హైదరాబాద్‌లోని ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇంజినీర్లు టి. సుధాకర్‌బాబు, పి. శ్రీనివాసరావు, లక్ష్మీసాయి, చలం, జగదీష్ పాల్గొన్నారు.