కాలువలకు జలకళ
- తాగునీటి అవసరాల కోసం విడుదల
- తొలుత బందరు, ఏలూరు కాలువలకు..
- ఆ తరువాత రైవస్ కాలువకు..
- 10 రోజులపాటు నీటి విడుదలకు అవకాశం
- చేపల చెరువులకు నిషేధం
సాక్షి, విజయవాడ : వేసవిలో ప్రజల తాగు నీటి కష్టాలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి తాగునీటి అవసరాల కోసం శనివారం రాత్రి 8 గంటలకు కాలువలకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరు సుగుణాకరరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ పది రోజులు పాటు గ్రామాల్లోని చెరువులు నింపుకోవడానికి కాలువలకు నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న 389 తాగునీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామని వివరించారు. ఈ చెరువులు పూర్తిగా నిండితే వచ్చే మే నెలాఖరు వరకు గ్రామాల్లో నీటి ఎద్దడి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఆ తరువాత మరో సారి తాగునీరు విడుదల చేస్తామని వెల్లడించారు.
500 క్యూసెక్కుల చొప్పున
తొలుత కృష్ణా ఈస్ట్రన్ బ్రాంచ్ కెనాల్‌తో పాటు బందరు, ఏలూరు కాలువలకు 500 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. ఐదారు రోజులు తరువాత రైవస్ కాలువకు రోజుకు 1500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇలా పది రోజులు పాటు నీరు విడుదల చేస్తే చెరువులు పూర్తిస్థాయిలో నిండుతాయని భావిస్తున్నారు. వాస్తవంగా ప్రకాశం బ్యారేజీ నుంచి మరి కొంత ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే నాగార్జునసాగర్ నుంచి రోజుకు రెండువేల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు విడుదల కావడంలేదు.
ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువునకు కూడా ఆచితూచి నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలు నిండటానికి అర టీఎంసీ నీరు సరిపోతుంది. అయితే కాలువ చివర వరకు వెళ్లడంతో పాటు, కాలువల్లో ఉన్న వ్యర్థాలు సముద్రంలో కలవడానికి సుమారు మూడు టీఏంసీల నీరు అవసరం అవుతుందని, అప్పుడే బ్యారేజీకి దిగువున ఉన్న చెరువులన్నీ నిండుతాయని ఎస్‌ఈ సుగుణాకరరావు తెలిపారు. సాగర్ నుంచి ఆరు టీఎంసీల నీరు విడుదల చేయాలని అధికారులు కోరగా.. ప్రస్తుతానికి అర టీఎంసీ నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ నీటిని పులిచింతల ప్రాజెక్టులో నిల్వచేసి జాగ్రత్తగా కాల్వలకు వదులుతున్నారు.
చేపల చెరువులకు నిషేధం
నాగార్జున సాగర్ నుంచే వచ్చే నీటిని జాగ్రత్తగా వినియోగించుకుంటూ ఈ మండు వేసవిని దాటేందుకు ఇరిగేషన్ ఇంజినీర్లు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాలువలకు విడుదల చేసిన నీటిని తాగునీటి చెరువులకు చేరకుండా చేపల చెరువులకు మళ్లిస్తే భవిష్యత్తులో నీటి ఎద్దడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల చేపల చెరువులకు నీటిని మళ్లించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా చేపల చెరువులకు నీటిని మళ్లిస్తే ఆ ప్రాంతంలోని ఇరిగేషన్ అధికారులుపై కఠినచర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.