ఇంజనీర్ల పనితీరు, సామర్థ్యం పెంపుదలపై సర్కారు దృష్టి
బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలకు నిర్ణయం
పదేళ్ల తర్వాత ఇంజనీర్ల పదోన్నతులు, బదిలీలకు చర్యలు
ఇప్పటివరకు కొనసాగిన అడ్‌హక్ పదోన్నతులకు చెల్లుచీటీ
ఇకపై రిటైరైన ఇంజనీర్ల పదవీకాలం పొడిగించరాదని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను పటిష్టపరచడంతో పాటు ఇంజనీర్ల పనితీరు, సామర్థ్యం పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓ వైపు ఇంజనీర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది.
ముఖ్యంగా గత పదేళ్లుగా తాత్కాలిక (అడ్‌హక్) పదోన్నతులే కల్పిస్తుండగా, ఇకపై ఈ విధానానికి శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పెట్టనుంది. వచ్చే 10–15 రోజుల్లోగా అర్హులైన ఇంజనీర్లందరికీ సాధారణ పదోన్నతులు ఇవ్వడంతో పాటు బదిలీల ప్రక్రియ చేపట్టనుంది.తమ తుది తీర్పునకు లోబడి పదోన్నతులు కల్పించుకోవాలని ఇటీవల రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పదోన్నతులు, బదిలీలపై కసరత్తు ప్రారంభించింది.
కమిటీ సిఫారసుల మేరకు..
ఏఈ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు అందరికీ ప్రమోషన్లు కల్పించబోతోంది. పదోన్నతుల విషయంలో జోన్–5, జోన్–6 ఇంజనీర్లతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ), అదనపు అసిస్టెంట్ ఇంజనీర్ల మధ్య సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఒక జోన్ వారికే పదోన్నతుల్లో ప్రాధాన్యత కల్పించడంతో తమకు అన్యాయం జరిగిందని మరో జోన్ ఇంజనీర్లు కోర్టును ఆశ్రయించారు. ఉద్యోగంలో చేరాక డిప్లమా చేసిన వారికి ఏఈలుగా పదోన్నతి కల్పిస్తుండడంతో ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో నియమితులైన ఏఈఈలు తమ పోస్టులను కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదాల నేపథ్యంలో పదోన్నతులపై అధ్యయనం కోసం నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, ఈఎన్‌సీ (ఓ అండ్ ఎం) విజయభాస్కర్ రెడ్డితో ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ఇవ్వనున్న సిఫారసుల ఆధారంగా ఈ నెలాఖరులోగా మెరిట్ కమ్ సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు, బదిలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న ఈఎన్‌సీ (జనరల్), ఈఎన్‌సీ (రామగుండం), ఈఎన్‌సీ (ఓ అండ్ ఎం) పోస్టులతో పాటు 9 సీఈ, 27 ఎస్‌ఈ, 26 ఈఈ పోస్టులను పదోన్నతులు, బదిలీల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది.
సీఈలు క్షేత్ర స్థాయిలోనే ఉండాలి
నీటిపారుదల శాఖలో టెరిటోరియల్ చీఫ్ ఇంజనీర్లుగా కీలక పోస్టుల్లో ఉన్న కొందరు అధికారులు తమ పని ప్రదేశంలో ఉండకుండా హైదరాబాద్‌లో ఉంటున్నారని ప్రభుత్వ దృష్టికి వచ్చిoది. ఇంకొందరు సీఈలకు హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రత్యేక క్యాంపు కార్యాలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఈలందరూ ఇకపై క్షేత్ర స్థాయిలోనే తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే మిర్యాలగూడ ఈఈని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే క్రమంలో ఇటీవల నియమితులైన కొత్త ఏఈఈలు కొంత కాలం పాటు క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిందేనని, బదిలీల్లో వీరికి స్థానచలనం కల్పించరాదని నిర్ణయం తీసుకుంది. వీరిలో బాగా పనిచేసే ఇంజనీర్లకు ప్రోత్సాహకంగా ప్రత్యేక పదోన్నతులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది.
రిటైర్ అయితే ఇంటికే..
ఇకపై రిటైరైన ఇంజనీర్ల పదవీ కాలం పొడిగించరాదని ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత పదేళ్లలో కీలకమైన ఈఎన్‌సీలు, చీఫ్ ఇంజనీర్లుగా రిటైరైన ఇంజనీర్లే కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లను తొలగించింది.
ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన ఓ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న ఓ కీలక ఇంజనీర్ నీళ్లు నమిలారు. దీంతో మళ్లీ ఆయన పదవీకాలాన్ని పొడిగించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పోస్టులో మరో ఇంజనీర్‌ను అదనపు బాధ్యతల కింద నియమించింది. ఇదే సమయంలో మరో ఇంజనీర్ సైతం తన పదవీకాలం పొడిగింపునకు తీవ్ర ప్రయత్నాలు చేసుకున్నా ఫలించలేదు.
Comments
Please login to add a commentAdd a comment