‘రెవెన్యూ’లో పదోన్నతులకు పచ్చజెండా | revenue department - new promotion order issued | Sakshi
Sakshi News home page

‘రెవెన్యూ’లో పదోన్నతులకు పచ్చజెండా

Published Fri, Jul 10 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

revenue department - new promotion order issued

సాక్షి, హైదరాబాద్: గత పది రోజులుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు జరిపిన ఆందోళనతో ఎట్టకేలకు సర్కారు దిగివచ్చింది. రెవెన్యూ విభాగంలో వివిధ స్థాయిల్లో పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పదోన్నతుల నిమిత్తం ఈ నెల 20న శాఖాపరమైన పదోన్నతుల(డీపీసీ) క మిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరి పాలన విభాగం ముఖ్య(ఇన్‌చార్జి) కమిషనర్ రాజీవ్‌శర్మ ప్రకటించారు. డిమాండ్ల పరి ష్కారం నిమిత్తం రెవెన్యూ జేఏసీ ప్రతినిధులు సీఎస్‌తో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి.

గురువారం సీసీఎల్‌ఏ కార్యాలయంలో జరిగిన  చర్చల అనంతరం సీఎస్ రాజీవ్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ..  రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన పలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా అర్హులైన డిప్యూటీ తహసీల్దార్ల(డీటీ)కు తహసీల్దారు, తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టరు పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను వెంటనే విడుదల చేయాలని సీసీఎల్ ప్రిన్సిపల్ కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. సీనియారిటీ జాబితాపై ఈనెల 16 వరకు ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని, 20న డీపీసీ సమావేశమై పదోన్నతుల ప్రక్రియను చేపడుతుందన్నారు.
 
షరతులతో పదోన్నతులు..
కమలనాథన్ కమిటీ విభజన ప్రక్రియ కొలిక్కి రానందున తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చే విషయమై కొన్ని ఇబ్బందులు ఉన్నాయని సీఎస్ చెప్పారు. అయితే.. ఖాళీగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన తహసీల్దార్లకు షరతులతో కూడిన పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కమలనాథ న్ కమిటీ ప్రక్రియ అనంతరం పోస్టులు ఖాళీ ఉండని పక్షంలో.. పదోన్నతులు పొందిన వారు వెనక్కి వెళ్లాల్సి ఉంటుందన్నారు.

అలాగే.. కీలకమైన రెవెన్యూ విభాగంలో ఉద్యోగులకు సరైన విశ్రాంతి లభించ నందున, తప్పనిసరి పరిస్థితుల్లో మినహా సెలవు రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. వీఆర్వోలకు పెన్షనరీ బెనిఫిట్, 010 పద్దు కింద వేతనాలు అందించేందుకు అంగీకరించారు.
 
ఆందోళన విరమిస్తున్నాం: రెవెన్యూ జేఏసీ
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున, తమ ఆందోళన కార్యక్రమాలను విరమిస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి, సెక్రటరీ జనరల్ శివశంకర్, కన్వీనర్ లచ్చిరెడ్డి, వీఆర్‌వోల సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి, వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు శివరామ్ ప్రకటించారు. చర్చల్లో సీసీఎల్‌ఏ ప్రిన్సిపల్ కమిషనర్ అధర్‌సిన్హా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
 
3 కేటగిరీలుగా విభజన..
మండల రెవెన్యూ కార్యాలయాలకు పక్కా భవనాలు, తగినంత మంది సిబ్బంది, అవసరమైన మేరకు బడ్జెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎస్ రాజీవ్ శర్మ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండల రెవెన్యూ కార్యాలయాలను మూడు కేటగిరీలుగా విభజిస్తామని, జిల్లా కేంద్రాల్లో, మున్సిపల్ ఏరియాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఆర్‌వో ఆఫీసులను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజిస్తూ ప్రతిపాదనలను పంపాలని ప్రిన్సిపల్ కమిషనర్‌ను ఆదేశించామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement