- ఆర్డర్ టూ సర్వ్ ఉత్తర్వుల బాధ్యతల అప్పగింత
- కొత్తమండలాలకు తహసీల్దార్లు లేరు.. ఇన్‌చార్జిలే..
- రాత్రివరకు అధికారులు కసరత్తు
- జేసీ ఆధ్వర్యంలో పనులు
ఉత్తర్వులు ఇచ్చేది కలెక్టరే
Published Tue, Oct 4 2016 12:04 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
హన్మకొండ అర్బన్ : జిల్లాల విభజన ప్రక్రియ గడువు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారులు, ఉద్యోగుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అదే స్థాయి లో అయోమయం నెలకొంటోంది. ఇప్పటి వరకు నాలుగు జిల్లాలు అవుతాయా, కావా అనే ఊగిసలాటలో ఉండగా కొత్తగా జనగామ పేరు తెరపైకి రావడంతో విభజన ప్రక్రియ మళ్లీ మొదటి కొచ్చినట్లయింది. ఫైళ్లు, సామగ్రి ఇక ఐదు జిల్లాలకు పంపిణీ చేయాల్సి వస్తోంది. దీంతో ఆదివారం(2వ తేదీ) ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధుల్లో ఉన్నారు. కలెక్టర్ రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉండడంతో జిల్లా స్థాయిలో జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ పనులు చక్కబెడుతున్నా రు. ఇక జిల్లా స్థాయిలో ఉద్యోగుల విభజన, పంపిణీ, ఆర్డర్ టూ సర్వ్ ఉత్తర్వులు జారీ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకే అప్పగిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడంతో ఇక ఉద్యోగుల విభజన పనులను జిల్లా స్థాయిలో ఆరంభించారు.
అందరికీ ఒక్కరే..
ఇప్పటి వరకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులను ఆర్డర్ టూ సర్వర్ ఉత్తర్వుల ద్వారా జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ఉన్న జిల్లాతో పాటు కొత్త జిల్లాలకు కేటాయిస్తారు. అయితే, ఇందుకు సంబంధించి వివిధ శాఖలు ఇప్పటికే జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ మేరకు ఉత్తర్వులు శాఖ కమిషనర్ నుంచి జారీ అవుతాయని భావించగా.. తాజాగా ఉత్తర్వుల ప్రకారం కలెక్టర్ ఈ ప్రక్రియ చేపడుతారు. వివిధ శాఖలు సిద్ధం చేసిన ఉద్యోగుల కేటాయింపుల జాబితాను కలెక్టర్ పరిశీలించి ఆమోదిస్తారు. ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసే అవకాశముంది.
ఇన్‌చార్జ్ తహసీల్దార్లే...
ప్రస్తుతం జిల్లాలో కొత్తగా సుమారు పది మండలాల వరకు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. అయితే, డీపీసీ పూర్తికానిదే కొత్తగా సీసీఎల్‌ఏ నుంచి తహసీల్దార్లను కేటాయించే పరిస్థితి లేదు. దీంతో కొత్త మండలాలకు పక్క మండలాల తహసీల్దార్లను ఇన్‌చార్జిలుగా నియమించి తొలి రోజు కార్యక్రమాలు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. డీటీ నుంచి అంతకు కింది స్థాయి ఉద్యోగులను మాత్రం పూర్తి స్థాయిలో కలెక్టర్ కేటాయించే అవకాశం ఉంది. ఇదే అంశాలపై సోమవారం రాత్రి వరకు జేసీ డీఆర్వో, ఏవోలు సమావేశమై చర్చించారు. అయితే, మండలాలు పెరగడం, కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్లు తక్కువ సంఖ్యలో ఉండటం తో కొత్త జిల్లాలు, మండలాలకు రెవెన్యూ సిబ్బంది కొరత ఏర్పడే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. సీనియర్లకు అఫీషియేటింగ్ ఇస్తే తప్ప ఇప్పటికిప్పుడు ఈ సమస్య పరిష్కారం కాకపోవచ్చని చెబుతున్నారు.
Advertisement
Advertisement