
తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల కలకలంపై కలెక్టర్ ప్రశాంతి స్పష్టతనిచ్చారు. క్యాన్సర్ కేసులు విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. జాతీయ సగటు కంటే తక్కువగా క్యాన్సర్ పాజిటివ్ కేసులను గుర్తించామన్నారు. జాతీయ సగటు ప్రతి 10 వేలకి 30 మందికి క్యాన్సర్ కేసుల నమోదు అవుతుండగా, బలభద్రపురం గ్రామంలో 23 కేసులను గుర్తించామన్నారు. గ్రామస్థులకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.
ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలున్నవారిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య నిపుణుల సూచనలు సలహాల మేరకు ప్రజలకు తగిన వైద్య చికిత్స అందజేస్తామని కలెక్టర్ అన్నారు. నిన్న (శనివారం) ఆమె బలభద్రపురంలోని ఇంటింటి సర్వేను క్ష్రేత స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షించారు. గ్రామంలోని 2,492 గృహాల్లో సుమారు 10 వేలు జనాభా ఉన్నారన్నారు. వీరిలో ఎక్కువగా క్యాన్సర్ కేసుల నమోదు నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు.
ఇందుకోసం ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు, ఎనిమిది మంది డాక్టర్లు, 98 సిబ్బంది ఆధ్వర్యంలో 31 బృందాలను నియమించామన్నారు. వీరు ఇంటింటి ఆరోగ్య సర్వే ద్వారా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. వైద్య నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణుల సూచనలు సలహాలను అనుసరించి క్యాన్సర్ కేసుల గుర్తించి తదుపరి వైద్య పరీక్షలను చేపట్టనున్నట్లు తెలిపారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల నుంచి స్పెషలిస్ట్ వైద్యులు, ఆంకా లజిస్టుల సూచనలను అనుసరించి వైద్య పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment